వైద్యుల నిర్లక్షంతో మూడు నెలల బాలుడు మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

వైద్యుల నిర్లక్షంతో మూడు నెలల బాలుడు మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఘోర సంఘటన జరిగింది. సిటీలోని స్టార్ కిడ్స్ ప్రైవేట్ హాస్పిటల్ లో నాని అనే మూడు నెలల పసికందు మృత్యువు పాలయ్యాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదట డాక్టర్లు.. ఆరోగ్యం నయం అవుతుందని పిల్లాడ్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేయించాలని తల్లిదండ్రులను కోరారు. డాక్టర్ల మాట విన్న తల్లిదండ్రులు నిన్న హాస్పిటల్ లో అడ్మిట్ చేయించారు. 

డాక్టర్లు ఆ వెంటనే.. ఊపిరితిత్తుల్లో నిమోనియా వచ్చిందని వెంటనే హైదరాబాద్ హాస్పిటల్ కు మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లాలంటూ చెప్పడంతో బాలుడి పేరెంట్స్ కంగారుపడ్డారు. అయితే, డాక్టర్లు చెప్పినప్పటికే 3 నెలల నాని మృతి చెందినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలుడి మృతినుంచి తప్పిచుకోవడం కోసం డాక్టర్లు అబద్ధం చెప్పారని నాని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. 

వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పసికందు మృతి చెందాడని ఆరోపిస్తూ.. షాద్ నగర్ లోని రామ్ నగర్ కాలనీకి చెందిన తండ్రి రవీందర్, బంధువులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన విరమించడానికి ప్రయత్నిస్తున్నా.. వాళ్లు వినిపించుకోవడం లేదు. ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.