ఆధార్ కార్డు ఉంటే నిమిషాల్లో పాన్ కార్డు

ఆధార్ కార్డు ఉంటే నిమిషాల్లో పాన్ కార్డు

పర్మినెంట్  అకౌంట్ నంబర్ (పాన్) కార్డు కోసం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు పేజీల్లో అప్లికేషన్ నింపాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆన్ లైన్లోనే పాన్ కార్డును మీ సొంతం చేసుకోవచ్చు. అది కూడా ఆధార్  కార్డు ఉంటే చాలు నిమిషాల్లోనే పాన్ కార్డు వచ్చేస్తుంది. ఆధార్ వివరాలను ఆన్ లైన్ లో ఇస్తే చాలు… వెంటనే పాన్ ను జారీ చేస్తారు. PDF ఫార్మాట్ లో వుండే దీనిని వెంటనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మొదట ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఈ ఫైలింగ్‌  పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో ఎడమవైపు తొలి ఆప్షన్‌గా ఉన్న Instant PAN through Aadhaar పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో ఉన్నGet New PAN ఆప్షన్‌ను ఎంచుకోవాలి.  అక్కడ కొత్త పాన్ సంఖ్య కోసం మీ ఆధార్ సంఖ్యను అడుగుతుంది. ఇచ్చిన బాక్స్ లో ఆధార్ నంబర్ ను ఎంటర్ చేస్తే,  మీ ఆధార్ కు లింక్ చేసిన ఫోన్ నంబర్ కు OTP వస్తుంది.  ఆ OTPని ఎంటర్ చేయగానే, ఇతర ఆధార్ లోని వివరాలను అడుగుతుంది.

మీ ఈ మెయిల్ ను, ఇతర వివరాలను ఎంటర్ చేయగానే, UIDAI డేటాలో సరిచూసుకునే ఐటీ వెబ్ సైట్, వెంటనే పాన్ నంబర్ ను కేటాయిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు పది నిమిషాలు కూడా పట్టదు. ఆ తర్వాత మీ పాన్ కార్డును PDF ఫార్మాట్ లో డౌన్ లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోవచ్చు. మీ ఈ మెయిల్ కు కూడా పాన్ కార్డు PDF వస్తుంది. అయితే, మీ మొబైల్ నంబర్ ను ఆధార్ కు అనుసంధానించి వుండాలి. గతంలో పాన్ కార్డును పొందని వారికి మాత్రమే ఈ అవకాశం. అంతేకాదు మైనర్లకు ఈ పాన్ కార్డు జారీ చేయరు.