యూట్యూబ్​, ఆఫ్​లైన్​ క్లాసుల ద్వారా నెలకు 10 లక్షల ఆదాయం

యూట్యూబ్​, ఆఫ్​లైన్​ క్లాసుల ద్వారా నెలకు 10 లక్షల ఆదాయం

చాలామందికి మ్యాథ్స్​ సబ్జెక్ట్​ అంటే భయం. అందుకే కొందరు పిల్లలు మ్యాథ్స్​ క్లాసు అన్నా, టీచర్​ అన్నా వణికిపోతారు. కానీ.. అభినయ్ శర్మకు మ్యాథ్స్​ అంటే చాలా ఇష్టం. ఏ క్లాస్​ మిస్సయిన మ్యాథ్స్​ క్లాస్​ మాత్రం కచ్చితంగా వినేవాడు. సీన్​ కట్​ చేస్తే.. ఇప్పుడు ఆయనే లెక్కల పాఠాలు చెప్తున్నాడు. అభినయ్ క్లాస్​లను ఇప్పుడు కొన్ని లక్షల మంది వింటున్నారు. అందులో ఎంతోమంది గవర్నమెంట్ జాబ్స్​ కూడా సాధించారు. ​ 

అభినయ్ శర్మ 19 నవంబర్ 1990న ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని ఒక పల్లెటూరిలో పుట్టాడు. అదే ఊర్లో ఉన్న ప్రైమరీ స్కూల్​లో చదువుకున్నాడు. అతను ఐదో తరగతిలో ఉన్నప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్​ మీద ఆసక్తి పెరిగింది. దాంతో అన్ని సబ్జెక్ట్​ల కంటే మ్యాథ్స్​ మీద ఎక్కువ కాన్​సంట్రేట్​ చేసేవాడు. అందుకే పదో తరగతిలో మ్యాథ్స్​లో నూటికి నూరు శాతం మార్కులు సాధించాడు. ఇంటర్​లో కూడా మంచి మార్కులే వచ్చాయి. మిగతా సబ్జెక్ట్స్​ కూడా బాగానే చదివేవాడు. అందుకే గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే సివిల్ సర్వీస్‌‌‌‌ ఉద్యోగం కోసం ప్రిపరేషన్​ మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఢిల్లీ వెళ్లాడు. కానీ.. అక్కడ ఒక్కడే ఉండలేకపోయాడు. దాంతో అతని చదువు కోసం ఫ్యామిలీ మొత్తం గ్రేటర్​ నోయిడాలో ఒక చిన్న అద్దె ఇంటికి మారింది. అక్కడే ఫ్యామిలీతో పాటు ఉంటూ చదువుకున్నాడు. తన కోచింగ్​ సెంటర్​కి వెళ్లేందుకు ప్రతి రోజూ మూడు కిలోమీటర్లు నడిచేవాడు. 2012లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్​ రాసి, క్వాలిఫై అయ్యాడు.

టీచింగ్​.. 

ప్రిలిమ్స్​ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్​కి ప్రిపేర్​ అవుతూనే కుటుంబానికి చేదోడుగా ఉండాలని జాబ్​ చేయడం మొదలుపెట్టాడు. ఒక కోచింగ్​ ఇనిస్టిట్యూట్​లో మ్యాథ్స్​ చెప్తూ, వచ్చే డబ్బుని తన చదువు కోసం, ఇంటి అవసరాల కోసం ఖర్చు చేసేవాడు. కానీ.. 2012 చివరి నాటికి ఎస్​ఎస్​సీ(స్టాఫ్​ సెలెక్షన్​ కమిషన్​)కి సెలెక్ట్​ అయ్యాడు. దాంతో ఉద్యోగంలో చేరాడు. కానీ.. కొన్నాళ్లకే ఉద్యోగం మానేసి, మళ్లీ టీచింగ్​ వైపు వచ్చాడు. 2013లో ‘‘ప్లే విత్​ అడ్వాన్స్​ మ్యాథ్స్​”అనే పుస్తకం రాశాడు. దాన్ని 2014లో ప్రింట్​ చేసి, మార్కెట్​లోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత 2016లో కొన్ని రోజులు టీచింగ్​కి బ్రేక్​ తీసుకోవాలి అనుకున్నాడు. దాంతో ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​లో జాబ్​ కొట్టి, జాయిన్​ అయ్యాడు. కానీ.. ఆరు నెలలకే రిజైన్​ చేసి, మళ్లీ టీచింగ్​ రంగంలోకి వచ్చాడు. ఇప్పటికీ అదే రంగంలో ఉన్నాడు. 

తండ్రి కోసమే.. 

వాస్తవానికి తనకు ఎప్పుడూ టీచింగ్​ అంటేనే ఇష్టం. కానీ.. సివిల్​ సర్వీసెస్​లో జాబ్​ చేయాలనేది తన తండ్రి కోరిక. అభినయ్​ తండ్రి చదువుకోలేదు. కానీ.. తన కొడుకు మంచి గవర్నమెంట్​ ఉద్యోగం చేయాలని కోరుకున్నాడు. అందుకే తన తండ్రి కోసం సివిల్స్​కి ప్రిపేర్​ అయ్యాడు అభినయ్. కానీ.. తన లక్ష్యం అదికాదు​. అందుకే మెయిన్స్​లో క్వాలిఫై కాలేకపోయాడు. పైగా అప్పటికే ఆర్థిక సమస్యల వల్ల బాగా ఇబ్బంది పడేవాడు. చివరికి సివిల్స్​ని వదిలేసి తనకు నచ్చిన రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్​ అయ్యాడు. ఇప్పుడు అభినవ్​ కొన్ని లక్షల మందికి కోచింగ్​ ఇస్తున్నాడు. అంతేకాదు.. అభినయ్ వరుసగా 5 సార్లు ఎస్​ఎస్​ఎసీ సీజీఎల్​ ఎగ్జామ్​ రాసి, జాబ్​ కొట్టాడు. అందులో 4 సార్లు 200 మార్కులకు గాను 197.5 మార్కులు తెచ్చుకున్నాడు. 

యూట్యూబ్​లోకి..

కోచింగ్​ తీసుకోలేని పేదవాళ్లకు కూడా మ్యాథ్స్​ నేర్పించాలి అనుకున్నాడు అభినయ్​. అందుకే సీజీఎల్​, సీహెచ్​ఎస్​ఎల్ ఉద్యోగాలకు ప్రిపేర్​ అయ్యే స్టూడెంట్స్​ కోసం తన క్లాసులను  యూట్యూబ్​లో అప్​లోడ్​ చేస్తున్నాడు. ఆయన క్లాసులు విని ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించారు. 2015లో తన ఛానెల్​ ‘‘అభినయ్​ మ్యాథ్స్​’’ని మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ ఛానెల్​కు 2.45 మిలియన్ల సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు. దీంతో పాటు మరో మూడు ఛానెల్స్​ని కూడా నడుపుతున్నాడు. వాటిలో ‘‘లెర్నింగ్​ హబ్​”కి లక్షా ఎనభై వేలు, ‘‘ఎస్​ఎస్​సీ అభినయ్​’’కి లక్షా 64 వేలు, ‘‘అభినయ్​ ఫుడ్​ ఫ్యాక్టరీ’’కి 24 వేల మంది సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు. అభినయ్​ ఇన్‌‌‌‌స్టాగ్రామ్, ఫేస్‌‌‌‌బుక్, ట్విట్టర్‌‌‌‌లో కూడా యాక్టివ్​గా ఉంటాడు. 

žనెట్​ వర్త్

యూట్యూబ్​, ఆఫ్​లైన్​ క్లాసుల ద్వారా అభినయ్​ నెలకు 10 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఆయన ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు. పుస్తకాలు అమ్మడం ద్వారా కూడా ఆదాయం వస్తోంది.