
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంతో ఆ రాష్ట్రంలో చాలా మార్పులు జరగనున్నాయి. కేంద్రం నిర్ణయంతో ఇప్పటివరకు రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు (జమ్మూకాశ్మీర్, లడఖ్)గా విడిపోయింది. జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఉంటుంది. కానీ ఢిల్లీ, పుదుచ్చేరిల్లా కేంద్రానికి అధికారాలు ఉంటాయి. లడఖ్‌లో అసెంబ్లీ ఉండదు. లోక్‌సభ ఎన్నికలు మాత్రం జరుగుతాయి. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, జెండా ఉండవు. దేశమంతా త్రివర్ణ పతాకమే రెపరెలపాడనుంది. అక్కడి అసెంబ్లీ పదవీకాలం ఇంతకుముందులా ఆరేళ్లు కాకుండా ఐదేళ్లకు మారనుంది. క్రిమినల్ నేరాలకు సంబంధించి అక్కడి రణ్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్‌పీసీ) స్థానంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అమలులోకి రానుంది. ఇంతకుముందు వరకు రాష్ట్రంలో పాలన గాడి తప్పితే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం ఆరు నెలల పాటు గవర్నర్ పాలన విధించేవారు. 370ని రద్దు చేయడంతో ఆర్టికల్ 356 ప్రకారం ఇక నుంచి రాష్ట్రపతి పాలన పెడతారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తే ఆర్టికల్ 360ని కూడా అమలు చేయొచ్చు. ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు జమ్మూకాశ్మీర్‌లో భూములు, ఆస్తులు కొనొచ్చు. కొత్తగా ఏర్పాటయ్యే కేంద్ర పాలిత ప్రాంతాల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలు కానుంది.