ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీబీ ఎంట్రీ .. సోదాలకు రంగం సిద్ధం

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీబీ ఎంట్రీ .. సోదాలకు రంగం సిద్ధం
  • అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన అధికారులపై నజర్
  • ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన ప్రణీత్ రావు టీమ్

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ దృష్టి పెట్టింది. ప్రణీత్‌‌రావు టీమ్‌‌ ఫోన్‌‌ ట్యాపింగ్ ద్వారా ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు గుంజినట్టు బయటకురావడంతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో పని చేసిన అధికారులపై నజర్ పెట్టింది. అక్రమాస్తులు కూడబెట్టిన అధికారుల చిట్టా సిద్ధం చేస్తున్నది.

ఇందులో భాగంగా ముఖ్యమైన పదవుల్లో సుదీర్ఘకాలం పని చేసిన అధికారులు, రిటైర్డ్‌‌ పోలీస్ ఆఫీసర్ల వివరాలు సేకరిస్తున్నది. ఈ కేసులో నిందితులైన ప్రణీత్‌‌రావు, భుజంగరావు, తిరుపతన్నలు వెల్లడించిన వివరాల ఆధారంగా స్పెషల్‌‌ టీమ్‌‌ దర్యాప్తు చేస్తున్నది. ప్రణీత్‌‌రావు టీమ్‌‌ చేసిన సీక్రెట్‌‌ ఆపరేషన్స్‌‌ ద్వారా ప్రభుత్వ అధికారులు అక్రమాస్తులు సంపాదించుకున్నారని ఏసీబీ దృష్టికి వచ్చింది. 

సిటీలో విల్లాలు, జిల్లాల్లో భూములు.. 

ఫోన్ ట్యాపింగ్‌‌ ద్వారా ఆస్తులు సంపాదించిన అధికారులపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఆయా అధికారులు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి వాళ్ల ఆస్తుల లెక్కలు సేకరిస్తున్నది. ప్రధానంగా గత ఐదేండ్ల వ్యవధిలో వారి ఆదాయ వ్యయాలు, సంపాదించిన ఆస్తుల వివరాలు తెలుసుకుంటున్నది. ఫోన్ ట్యాపింగ్, బ్లాక్ మెయిలింగ్ చేసి పలువురు అధికారులు గ్రేటర్ హైదరాబాద్‌‌తో పాటు వరంగల్‌‌, యాదాద్రి, కరీంనగర్‌‌‌‌, సిద్దిపేట జిల్లాల్లో విలువైన భూములు కొనుగోలు చేశారని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. హైదరాబాద్ శివార్లలో విల్లాలు కూడా రిజిస్ట్రేషన్‌‌ చేయించుకున్నట్టు సమాచారం. అధికారులు, వారి కుటుంబ సభ్యులు, బినామీల వివరాలను ఏసీబీ అధికారులు రహస్యంగా సేకరిస్తున్నట్టు తెలిసింది. ఈ వివరాల ఆధారంగా అక్రమాస్తుల కేసులు నమోదు చేసి సోదాలు చేయనున్నట్టు సమాచారం.  

అధికారి స్థాయిని బట్టి వాటాలు.. 

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని రాజకీయ నేతలు, వ్యాపారుల కదలికలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించారు. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారు. ఇలా సేకరించిన సమాచారంతో రెయిడ్స్ చేశారు. రూ.కోట్ల కొద్దీ డబ్బు సీజ్‌‌ చేశారు. ఇందులో హవాలా డబ్బుకు ఎలాంటి లెక్కలు లేకపోవడంతో వాటిని దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో అధికారి స్థాయిని బట్టి వాటాలు చేరినట్టు పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌లో బహిరంగంగానే  చర్చించుకుంటున్నారు. ఇట్ల వచ్చిన సొమ్ముతో ఒక ఉన్నతాధికారి జిల్లాల్లో భూములు కొనుగోలు చేయగా, ఇతర అధికారులు సిటీ శివార్లలో విల్లాలు కొనుగోలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మొత్తం బాగోతాన్ని బయటకు తీస్తే  మరిన్ని నిజాలు బయటపడతాయని భావించిన ప్రభుత్వం... ఏసీబీని రంగంలోకి దించినట్టు తెలుస్తున్నది.