రాజ్యాంగంలోని 63వ అధికరణ ప్రకారం.. భారత ఉపరాష్ట్రపతి

రాజ్యాంగంలోని 63వ అధికరణ ప్రకారం.. భారత ఉపరాష్ట్రపతి

రాజ్యాంగంలోని 63వ అధికరణ ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు. రాష్ట్రపతి పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయినప్పటికి ఆ పదవిని తాత్కాలికంగా నిర్వహించడం అంటే నూతన రాష్ట్రపతిని ఎన్నుకునే వరకు రాష్ట్రపతి పదవీ బాధ్యతలను నిర్వర్తించడం కోసం భారత రాజ్యాంగం ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేసింది. 

ఉపరాష్ట్రపతి పదవి ఏర్పాటును మన దేశం అమెరికా నుంచి గ్రహించింది. కానీ అమెరికాలో మాదిరిగా అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడితే ఉపాధ్యక్షుడు మిగిలిన పదవీకాలం మొత్తం అధ్యక్షుడిగా వ్యవహరించే పద్ధతిని మన దేశం అనుసరించలేదు. ఉపరాష్ట్రపతి కేవలం నిర్ణీత కాలానికి మాత్రమే తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. 

ఎందుకంటే రాజ్యాంగంలో 62వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పదవి ఏ కారణంతోనైనా ఖాళీ ఏర్పడిన ఆరు నెలల్లోగా రాష్ట్రపతి పదవికి తప్పనిసరిగా ఎన్నిక నిర్వహించాలి. 

  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం-1952
  • 1997లో ఎన్నికల చట్టంలో కొన్ని సవరణలు చేశారు.     
  • రూ. 15000 డిపాజిట్ చెల్లించాలి.   
  • 20 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించగా మరో 20 మంది బలపరచాలి.    
  • పోలై చెల్లిన ఓట్లలో 1/6వ వంతు ఓట్లను పొందిన వారికి మాత్రమే తిరిగి డిపాజిట్ చెల్లిస్తారు.   
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వివాదాలను 71వ అధికరణను అనుసరించి 
  • సుప్రీంకోర్టు విచారిస్తుంది.    
  • సుప్రీంకోర్టు 1957, 1974ల్లో తీర్పునిస్తూ ఎలక్టోరల్ కాలేజ్​లో ఏవైనా స్థానాలు ఖాళీగా ఉన్నా   రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించవచ్చు. 

తొలగించే పద్ధతి

  • ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయాలనుకుంటే వారు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి. 
  • అసమర్థత, దుష్ప్రవర్తన కారణాలపై ఉపరాష్ట్రపతిని అభిశంసన తీర్మానం ద్వారా ఉభయ సభలు సాధారణ మెజారిటీతో తొలగించవచ్చు.    
  • ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం మొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.
  • కనీసం 50 మంది సభ్యుల సంతకాలతో కూడిన తీర్మాన నోటీసును 14 రోజుల ముందు సభాపతి అందించాలి. 

90వ అధికరణ ప్రకారం తొలగింపు తీర్మాన నోటీసుపై చర్చ జరుగుతున్నప్పుడు ఉపరాష్ట్రపతి సభకు అధ్యక్షత వహించరాదు. కానీ, సభకు హాజరుకావచ్చు. చర్చలో పాల్గొనవచ్చు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పవచ్చు. కానీ అభిశంసన తీర్మానంపై ఓటు వేసే అధికారం ఉపరాష్ట్రపతికి ఉండదు. 
    
ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానంపై రాజ్యసభలో బలాబలాలు సమానమైనప్పటికీ ఉపరాష్ట్రపతి ఓటు వేయరాదు.  ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించే అవకాశం ఉండదు. అందువల్ల కాస్టింగ్ ఓటు వేయరాదు. అలాగే, ఉపరాష్ట్రపతి రాజ్యసభ సభ్యుడు కానందున సాధారణ ఓటు వేసే అవకాశం లేదు. 

►ALSO READ | Hyderabad IIT : కంటెంట్ క్రియేటర్ ఉద్యోగాలు భర్తీ
    
ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానంపై చర్చ జరిగేటప్పుడు డిప్యూటీ చైర్మన్ రాజ్యసభకు అధ్యక్షత వహిస్తున్నందున వారు కాస్టింగ్​ఓటు వేసే అవకాశం కలిగి ఉంటారు. రాజ్యసభ ఆమోదించి పంపిన తీర్మానాన్ని లోక్​సభ కూడా సాధారణ మెజారిటీతో ఆమోదించినప్పుడు వారు పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. 
    
ఉపరాష్ట్రపతి తన తొలగింపు తీర్మానంపై ఓటింగ్​లో పాల్గొనే అవకాశం లేకపోయినా రాజ్యసభ చైర్మన్​గా ఉన్న కాలంలో ఒకవేళ ఏదైనా అంశంపై సభలో బలాబలాలు సమానమైనప్పుడు తన కాస్టింగ్ ఓటును వినియోగించవచ్చు. 

ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు

ఉపరాష్ట్రపతి పదవిలో సాధారణ ఖాళీ ఏర్పడినప్పుడు గానీ లేక ఆకస్మిక ఖాళీ ఏర్పడినప్పుడు కానీ ఎంత కాలంలోగా ఆ పదవికి తిరిగి ఎన్నిక జరపాలి అనే అంశంపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు నూతన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగే వరకు వారు పదవిలో కొనసాగించవచ్చునని భావించవచ్చు.  

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతల నిర్వహణ చట్టం 1969

రాజ్యాంగంలోని 70వ అధికరణ ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవీ నిర్వహణ కోసం భారత పార్లమెంట్ ప్రత్యేక చట్టాలను చేయవచ్చు. 1969లో రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణించినప్పుడు ఉపరాష్ట్రపతి అయిన వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సందర్భంలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన పదవికి రాజీనామా చేసే సందర్భంలో నెలకొన్న సందిగ్ధంపై రాష్ట్రపతి వి.వి.గిరి సుప్రీంకోర్టు న్యాయ సలహాను కోరారు. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 

1969లో భారత పార్లమెంట్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతల నిర్వహణ చట్టాన్ని ఆమోదించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఒకేసారి ఖాళీ ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చని చట్టంలో పేర్కొన్నారు. 
    
రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసిన సందర్భంలో ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే తన రాజీనామా పత్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించాలి. ఒకవేళ ఆ పదవి కూడా ఖాళీగా ఉన్నట్లయితే సీనియర్ న్యాయమూర్తికి అందించాలి. 

ఎన్నిక పద్ధతి

రాజ్యాంగంలోని 66వ అధికరణ ఉపరాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని గురించి తెలుపుతుంది. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ, లోక్​సభలతో ఏర్పడిన ఎలక్టోరల్ కాలేజ్​ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో  రాష్ట్రాల విధాన సభల సభ్యులు పాల్గొనడానికి అవకాశం కల్పించలేదు. కానీ భారత రాష్ట్రపతి నామినేట్ చేసే14 మంది పార్లమెంట్ సభ్యులకు (లోక్​సభలోని ఇద్దరు ఆంగ్లో ఇండియన్లకు, అలాగే రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే 12 మంది సభ్యులకు) అవకాశం కల్పించారు. 

104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్లను లోక్​సభకు నియమించే పద్ధతిని తొలగించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం–1952ను అనుసరించి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో సవరణలు చేసే అధికారం పార్లమెంట్​కు ఉంటుంది. ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

 1962 వరకు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉభయసభల సంయుక్త సమావేశంలో బహిరంగ ఓటింగ్ విధానంలో ఎన్నిక జరిగేది. 11వ రాజ్యాంగ సవరణను అనుసరించి 1962 నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య ఓటింగ్ విధానం ద్వారా జరుగుతుంది. 11వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్​లో ఖాళీలున్నాయనే కారణంతో ఏ వ్యక్తి కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును సంప్రదించడానికి అవకాశం లేదని పేర్కొన్నది.

అధికారాలు-విధులు

  • రాజ్యాంగంలోని 64వ అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్​గా అధ్యక్షత వహించి నిర్వహిస్తారు. ఈ పద్ధతిని మన దేశం అమెరికా నుంచి గ్రహించింది. 
  • రాజ్యాంగంలోని 65వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. 
  • ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించేటప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు. 
  • ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసే కాలంలో ఉపరాష్ట్రపతి పదవిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టరాదు. 
  • తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినప్పుడు రాష్ట్రపతి పొందే జీతభత్యాలనే ఉపరాష్ట్రపతి కూడా పొందుతారు.
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రమాణం చేస్తారు. 
  • భారతరత్న, పద్మ అవార్డులు వంటి అత్యున్నత అవార్డుల కమిటీకి చైర్మన్​గా వ్యవహరించవచ్చు.