మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్  జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట, వెలుగు : జీవో 59 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులు ముందుకు కదలడం లేదు. ఇండ్లు క్రమబద్ధీకరణ చేసేందుకు 2016లో ప్రభుత్వం 58, 59 నంబర్​ జీవోలు జారీ చేసింది.  125 గజాలలోపు ఇండ్లను ఉచితంగా, అంతకుమించి  స్థలమున్న ఇండ్లను నామ మాత్రపు ఫీజు తీసుకుని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అప్పట్లోనే దరఖాస్తులు స్వీకరించింది. తిరిగి గత ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు మీ సేవా కేంద్రాల ద్వారా  దరఖాస్తులను తీసుకుంది.  సిద్దిపేట జిల్లాలో మొత్తం 4,594 దరఖాస్తులు రాగా, అందులో 58 జీవో కింద  426, 59 జీవోకు సంబంధించి  4,168 దరఖాస్తులు వచ్చాయి. రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు, స్థలం వారీ ఆధీనంలోనే ఉన్నట్టుగా టాక్స్ రశీదు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లులను జత చేశారు. దరఖాస్తు చేసుకున్న  90 రోజుల లోపు పరిశీలన జరిపి క్రమబద్ధీకరణకు అనుమతిఇవ్వాలని నిర్ణయించారు. 58 జీవోకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగా, 59 జీవో దరఖాస్తులకు మాత్రం ఇంకా మోక్షం కలగడం లేదు. ఇదిలా ఉండగా 59 జీవో ప్రకారం వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 3,300 సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోనివే. 

మార్గదర్శకాలు రాక..

ప్రభుత్వం నుంచి పూర్తి  స్థాయి మార్గదర్శకాలు రాకపోవడంతో 59 జీవో కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలనను అధికారులు పెండింగ్ లో పెట్టారు. జిల్లాలో అందిన  4,168 దరఖాస్తులలో 200గజాల  కంటే ఎక్కువగా విస్తీర్ణంలో  ఉన్న స్థలాలే ఉన్నట్టు తెలుస్తోంది.  నిబంధనల ప్రకారం 500 గజాల వరకు దరఖాస్తులను పరిశీలించి తహసీల్దారు ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్లు చేసే అధికారం ఉండగా, ఆ పైన విస్తీర్ణం కలిగిన స్థలాల క్రమబద్ధీకరణ అంశం కలెక్టర్ పరిధిలోకి వెళ్తుంది. స్థలాల విస్తీర్ణాన్ని బట్టి విధించే రుసుము విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం జాప్యానికి కారణంగా తెలుస్తోంది.  ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే ఈ దరఖాస్తుల పరిశీలన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో 59 జీవో మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. 

బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

సిద్దిపేట, వెలుగు :  దేశ జనాభాలో అధికంగా  ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే మరింత న్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై  కేంద్రం మౌనం వీడాలని మంత్రి హరీశ్​ రావు అన్నారు. శనివారం నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో  నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో కోతలు లేకుండా నాణ్యమైన కరెంటును  రైతులకు అందిస్తుంటే  ఓర్వలేక దానిని బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్ లతో పాటు ఉచితాలు  వద్దని స్వయంగా దేశ ప్రధాని చెబుతున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఉచితాలు వద్దంటూనే పారిశ్రామిక వేత్తలకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిన బీజేపీ సర్కారు తెలంగాణ ప్రభుత్వం గురించి  మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగేలా సీఎం కేసీఆర్ పనిచేస్తే,  ప్రజల సొమ్మును ధనవంతులకు పంచేలా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ ​కోసం రైతులు ముప్పుతిప్పలు పడ్డారని, ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చే పైసలు కనీసం బేస్మెంట్ కు  కూడా సరిపోయేవి కావని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం ప్రజలకు పైసా ఖర్చులేకుండా వాటన్నింటినీ చేసిపెట్టిందని చెప్పారు. పాలమాకులలో ఇప్పటికే 55 ఇళ్ల ను  ప్రారంభించామని, మరో 30 ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే  ఇంటి జాగలు ఉండి ఇళ్లు కట్టుకునే వారికి  ప్రభుత్వం రూ.3 లక్షల  ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు అందిస్తామని చెప్పారు. అనంతరం  సిద్దిపేటలోని మినిస్టర్​ క్యాంపు ఆఫీస్​లో 205 కుటుంబాలకు రూ.74. 42 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్​ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

సమ్మెలో వీఆర్ఏలు.. పనుల్లో ప్రైవేట్ ​వ్యక్తులు!

కొండాపూర్, వెలుగు:  తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్​ఏలు కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ ​తహసీల్దార్​ ఆఫీస్​లో  ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నారు. 15 రోజుల నుంచి అర్ధరాత్రి 12 వరకూ వివిధ రికార్డులకు సంబంధించిన పనులను ఆఫీసర్లు చేయిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన  వీడియో శనివారం బయటకొచ్చింది. ఆఫీసర్ల తీరుపై వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మెకు సహకరించాల్సిన ఆఫీసర్లు పైసలకు ఆశపడి ప్రైవేటు వ్యక్తులతో తమ పనులు చేయించడం దారుణమని ఆరోపించారు. ఇప్పటికే భూ ప్రక్షాళన పేరుతో అనేక సమస్యలు ఊర్లలో నెలకొన్నాయని, ఇప్పుడు వాటిని ప్రైవేట్​ వ్యక్తులకు అప్పగిస్తే భూ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ ను వివరణ కోరగా రెవెన్యూ పనులు కావాలంటే ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించడం తప్పడంలేదని చెప్పారు. 

ఫీజు నియంత్రణ చట్టం చేయాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఫీజు నియంత్రణ చట్టం చేయాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి టాకూర్ రాకెట్ సింగ్ డిమాండ్​ చేశారు.  బలవంతపు ఫీజు వసూళ్ల కారణంగానే హైదరాబాద్​లోని నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. శనివారం యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్​పిలుపు మేరకు ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నడ  ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్ నాగరాజు, బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు వినోద్, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు

మెదక్ (నిజాంపేట), వెలుగు:  రైతులెవరూ ఆత్మహత్యకు పాల్పడొద్దని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తుందని డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. నిజాంపేట మండలం బచ్చురాజుపల్లిలో రెండు రోజుల కింద అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రమావత్ జీవన్   కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. రూ.10 వేల సాయాన్ని అందజేశారు.  జీవన్​ పిల్లల పై చదువులకు కూడా సహకరిస్తామని భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ఇంతవరకు అమలు చేయకపోవడంతో అప్పులబాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్​ చేశారు. ఆయన వెంట పార్టీ ఉమ్మడి మండలాల అధ్యక్షులు లింగంగౌడ్, శ్యామ్ రెడ్డి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రామచంద్ర గౌడ్, పట్టణ అధ్యక్షుడు నసీరుద్దీన్, చింతల స్వామి, యూత్ అధ్యక్షుడు రమావత్ వినోద్, ఉపాధ్యక్షులు రవి, రాజయ్య, సులేమాన్, రాజు, చంద్రం ఉన్నారు.