అటవీ నిర్మూలన.. భూ నిమ్నీకరణ

అటవీ నిర్మూలన.. భూ నిమ్నీకరణ

సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, వాణిజ్య, నివాస అవసరాల కోసం అటవీ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల దేశంలో అటవీ వనరుల విస్తృతి క్రమంగా తగ్గిపోతోంది. జాతీయ అటవీ విధానం – 1952 ప్రకారం దేశ భూభాగంలో 33 శాతం అడవులు ఉండాలి. అలాంటిది ప్రస్తుతం 21.3 శాతానికి తగ్గిపోయింది. దీని వల్ల నేల క్రమక్షయం, రుతుపవనాలు గతి తప్పడం, భూగర్భజలాల మట్టం తగ్గడం, జీవ వైవిధ్యత దెబ్బతినడం, వాతావరణంలో కాలుష్యస్థాయి పెరిగిపోవడం,  గిరిజనుల జీవన చర్యలు దెబ్బతినడం, జన్యు వైవిధ్యత దెబ్బతినడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. 

కారణాలు

-     అటవీ ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చడం.
-     కొండవాలు ప్రాంతాల్లో గిరిజనులు పాటించే పోడు వ్యవసాయం.
-     గనుల తవ్వకం.
-     నీటిపారుదల, జల విద్యుత్​ ప్రాజెక్టుల నిర్మాణం.
-     రోడ్డు, రైల్వే మార్గాలు నిర్మించడం.
-     నక్సలిజం, బోడోల్యాండ్ వంటి మానవ అసాంఘిక కార్యకలాపాలు
-     గ్లోబల్​ వార్మింగ్ సదస్సు

ప్రభుత్వ కార్యక్రమాలు

భారత ప్రభుత్వం అటవీ వనరుల నిర్వహణ కోసం కార్యక్రమాలను రూపొందించి మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తోంది. 

1. సంరక్షణ చర్యలు: ప్రస్తుతమున్న అడవులను పరిరక్షించే శాసనపరమైన చర్యలు.
2. వనీకరణ: దేశంలో అటవీ విస్తృతిని పెంచే చర్యలు.
3. శాస్త్రీయ పద్ధతుల ద్వారా అటవీ వనరులను వాణిజ్య స్థాయిలో వినియోగించే చర్యలు.

సంరక్షణ చర్యలు

అటవీ వనరుల క్షీణత నివారణ, ప్రస్తుతం ఉన్న అడవుల సంరక్షణకు 1980లో భారత ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని చేసింది. ఈ చట్టం ప్రకారం కొన్ని అటవీ ప్రాంతాలను రక్షిత అడవులుగా ప్రకటిస్తూ వాణిజ్య కలప ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి ఉండాలని సూచించారు. 

మానవ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రక్షిత ప్రాంతాలు(జాతీయ పార్కులు, అభయారణ్యాలు), బయోస్పియర్​ రిజర్వుగా ప్రకటించారు. వీటిలో అటవీ వనరుల సంరక్షణతోపాటు శాస్త్రీయ పరిశోధనలనూ చేపడుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 104 జాతీయ పార్కులు, 566 అభయారణ్యాలు, 18 బయోస్పియర్​ ప్రాంతాలను ప్రకటించారు. 

వనీకరణ చర్యలు

అటవీ విస్తృతిని పెంపొందించడంలో భాగంగా కింది కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.సామాజిక అడవుల పెంపకం, వన మహోత్సవ కార్యక్రమాలు, జాయింట్​ ఫారెస్ట్​ మేనేజ్​మెంట్​, అర్బన్​ ఫారెస్ట్రీ, వన సంరక్షణ సమితి, కమర్షియల్​ ఫారెస్ట్రీ, ఆగ్రో ఫారెస్ట్రీ పథకాలు, సెల్వికల్చర్​. ఈ కార్యక్రమాలతోపాటు సామాజిక భూ పంపిణీ పథకాన్ని ఈశాన్య భారతదేశంలో అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా అక్కడి ప్రజలను పోడు వ్యవసాయం నుంచి మళ్లించడానికి అటవీ భూమిని రైతులకిస్తూ అందులో అటవీ మొక్కలను పెంచే అలవాటును ప్రోత్సహిస్తున్నారు. తద్వారా వచ్చే ఆదాయం వారికే ఇస్తున్నారు. అంతేకాకుండా అడవుల్లో కార్చిచ్చును నియంత్రించడానికి ఫారెస్ట్​ డివైడర్​ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యక్తిగతంగా అటవీ వనరుల సంరక్షణకు కృషి చేసేవారికి వృక్ష మిత్ర అవార్డుల పేరుతో ప్రోత్సహిస్తున్నారు. 

శాస్త్రీయ పద్ధతుల ద్వారా అటవీ వనరులను వాణిజ్య స్థాయిలో పునరుద్ధరించే చర్యలు: విద్య, శిక్షణ, పరిశోధనల ద్వారా అటవీ వనరులను పునరుద్ధరించడానికి కింద తెలిపిన పరిశోధనా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫారెస్ట్​ 

మేనేజ్​మెంట్​                                                    – భోపాల్​
నేషనల్​ ఫారెస్ట్ అకామీ        – డెహ్రాడూన్​
అరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్​ అకాడమీ    – జోధ్​పూర్​
కానిఫెరస్​ రీసెర్చ్​ అకాడమీ    – సిమ్లా

పర్యావరణంపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి 2011 సంవత్సరాన్ని అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా ప్రకటిస్తూ అడవుల పెంపకం, సంరక్షణ, మానవాళికి అడవుల వల్ల కలిగే లాభాలు తదితర అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా సభ్య దేశాలకు ఆదేశాలు ఇచ్చింది. 

ఉష్ణ కాలుష్యం

థర్మల్​ విద్యత్తు కేంద్రాలు, అణు విద్యుత్​ కేంద్రాలు, బొగ్గును ఇంధనంగా ఉపయోగించే భారీ పరిశ్రమల్లో దాదాపు 70 శాతం ఉష్ణ శక్తి బహిర్గతమవుతోంది. ఈ ఉష్ణోగ్రతను తగ్గించడానికి సమీపంలో ఉన్న నదులు నుంచి కాని జలాశయాల నుంచి కాని నీటిని యంత్రాల కండెన్సర్ల ద్వారా నిరంతరం నీటి ప్రవాహాన్ని పంపించి చల్లబరుస్తారు. ఈ విధంగా నీటి ప్రవాహం కండెన్సర్ల ద్వారా ప్రవహించి, ఆ యంత్రాలను చల్లబరిచి విడుదలైన నీరు సమీప నదిలో కలుస్తుంది. ఈ నీరు సుమరు 6 డిగ్రీల సెంటీ గ్రేడ్​ సెల్సియస్​ నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్​ సెల్సియస్​  వరకు ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.

కాలుష్య ప్రభావం విలీన ఆక్సిజన్​ కొరత

నీటిలో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ డి.ఓ.ల విలువలు తగ్గిపోయి బయోలాజికల్​ ఆక్సిజన్​ డిమాండ్​ ఏర్పడుతుంది. ఉదాహరణకు 32 డిగ్రీల ఫారిన్​హీట్​ వద్ద నీటిలో డి.ఓ.ల విలువలు 14.6 పీపీఎం ఉండగా, 64 డిగ్రీల ఫారిన్​హీట్​ వద్ద ఐదు పీపీఎం కంటే తక్కువకు పడిపోతుంది. దీని కారణంగా నీటిలో ఉండే సున్నిత జలచరాలు ఈ వేడిని తట్టుకోలేవు . అంతేకాకుండా వాటికి చాలా విస్తృతమైన ఆక్సిజన్​ కావాలి. కరిగిన స్థితిలో ఆక్సిజన్​ లేకపోవడం వల్ల సున్నిత జలచరాలు బ్యాక్టీరియా, ప్రోటోజోవా తదితర సూక్ష్మజీవులు చనిపోతాయి.  

సహజమైన నీటిలో ఇవి వృద్ధి చెందుతూ ఆహార గొలుసులో పెద్ద జీవులకు ఆహారంగా ఉపయోగపడుతాయి. కాబట్టి పై జీవులు నశించడం వల్ల మిగతా జలచరాలకు ముప్పు పెరుగుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద హానికరమైన బ్యాక్టీరియా మాత్రమే బతుకుతుంది. వీటి మూలంగా జీవ వైవిధ్యానికి భంగం వాటిల్లుతుంది. పైగా ఈ స్థితిలో శైవలాలు వృద్ధి చెంది యూట్రిఫికేషన్​ ప్రక్రియ వల్ల నీరు ఎందుకూ పనికిరాకుండా పోతుంది.

భూ నిమ్నీకరణ 

మానవుడు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, అగ్నిపర్వత విప్పోటనాలు, భూకంపాల వంటి సహజ విపత్తుల వల్ల భూవనరులు తమ ఉత్పాదకత సామర్థ్యాన్ని కోల్పోవడాన్ని భూమి నిమ్నీకరణ అని పిలుస్తారు. దీనికి కారణాలు. నేల క్రమక్షయం: వేగంగా వీచే పవనాలు, అధిక వర్షపాతం తదితర సహజసిద్ధ కారణాల వల్ల, పశువుల మేత, అడవుల నరికివేత, ఖనిజాల తవ్వకం, సరైన పంట విధానం పాటించకపోవడం, సరైన నేల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం, పంట మార్పిడి విధానాలు పాటించకపోవడం, ఒకే పంట విధానాన్ని అనుసరించడం వల్ల నేల పై భాగంలోని సారవంతమైన మట్టిపొర తొలగిపోయి నేలలు నిస్సారవంతమవుతున్నాయి.