ఆవుల సుబ్బారావుకు ముగిసిన కస్టడీ

ఆవుల సుబ్బారావుకు ముగిసిన కస్టడీ
  • సికింద్రాబాద్ విధ్వంసం ఘటనపై విచారణ స్పీడప్

హైదరాబాద్: సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు ఆవుల సుబ్బారావు తోపాటు ముగ్గురి పోలీసు కస్టడీ గడువు ముగిసింది.  రెండు రోజుల పాటు వారిని జీఆర్పీ పోలీసులు విచారించారు. కస్టడీ గడువు ముగియడంతో  ఇవాళ వారిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు అరెస్ట్ చేయడంలో జాప్యం జరగడంపై అనేక ఊహాగానాలు వ్యాపించిన సంగతి తెలిసిందే. అయితే కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉండడం వల్లే కొంత జాప్యం జరిగిందని పోలీసులు ప్రకటించారు. సుబ్బారావును అరెస్టు చేసి ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేశారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని నిరసిస్తూ  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గత నెల 17వ తేదీన జరిగిన విధ్వంసం ఘటన సంచలనం సృష్టించింది. రైల్వే పోలీసులు, రాష్ట్ర పోలీసుల తీరుపై విమర్శలు చెలరేగినా..  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించడంతో విచారణలో వేగం పెంచారు పోలీసులు. 

తొలి విడత 46 మంది అరెస్టు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల ఘటనపై సీసీ కెమెరా ఫుటేజీలు.. టీవీల్లో ప్రసారమైన వీడియోల ఆధారంగా పోలీసులు  తొలుత 46  మంది ఆర్మీ అభ్యర్థులను అరెస్టు చేశారు. నిందితులు చంచల్ గూడ జైలులోనే ఉన్నారు. ఘటన జరిగిన రెండో రోజు నిందితులను  అరెస్టు చేసిన పోలీసులు ముందుగా వారికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, రైల్వే కోర్టు  న్యాయమూర్తి  ఎదుట హాజరుపరచగా  రైల్వే కోర్టు.. వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.  

పోలీసు యాక్ట్ తోపాటు రైల్వే యాక్ట్ కింద కేసులు

విధ్వంసానికి పాల్పడిన వారిపై రైల్వే పోలీసులు.. సెక్షన్ 143, 147, 324, 307, 435,427, 448, 336, 332, 341, రెడ్ విత్ 149 తో పాటు  ఇండియన్ రైల్వే యాక్ట్ 150, 151, 152, కింద కేసులు నమోదు చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించి సుమోటోగా కేసును స్వీకరించి జూలై 20లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్పీఎఫ్ , జీఆర్పీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆర్మీ, పోలీసు కోచింగ్ సెంటర్లపై తెలుగు రాష్ట్రాల్లో విచారణ చేసి.. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రధాన నిందితుడు ఆవుల సుబ్బారావు కీలక సూత్రధారి అని అనుమానాలు కలిగినా .. తగిన ఆధారాల కోసం పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.

రెండు రోజుల పాటు జరిగిన జీఆర్పీ పోలీసుల కస్టడీ విచారణలో కీలక ఆరోపణలపై వాంగ్మూలం తీసుకున్నారు. విచారణ మొత్తం వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. కేసు విచారణలో ఉన్నందున పూర్తి వివరాలు వెల్లడించలేమంటున్నారు పోలీసులు.  దర్యాప్తుకు అవరోధం కాకుండా నిందితులు చెప్పిన వాటిని క్రాస్ చెక్ చేసుకుని నిర్ధారించుకునే పనిలోపడ్డారు. ఈనెల 20వ తేదీన మానవ హక్కుల కమిషన్ కు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు మరింత గడువు ఉండడంతో ఈలోపు మరిన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.