మా భవిష్యత్​.. మరింత బెటర్ : గౌతమ్ ​అదానీ

మా భవిష్యత్​.. మరింత బెటర్ : గౌతమ్ ​అదానీ
  • ఆర్థికంగా బలంగా ఎదుగుతున్నాం
  • హిండన్​బర్గ్​ రిపోర్ట్​ కుట్రపూరితం

న్యూఢిల్లీ :  రికార్డు ఆదాయాలు, బలమైన నగదు నిల్వలు,  అతి తక్కువ డెట్ ​రేషియోలతో బలంగా ఎదుగుతున్నామని అదానీ గ్రూప్​ చైర్మన్ ​గౌతమ్ ​అదానీ అన్నారు.   2032 నాటికి భారతదేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం వల్ల తమ గ్రూపునకు అద్భుత అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు. అప్పటికి  మౌలిక సదుపాయాలు 20–-25 శాతం వృద్ధి చెంది  2.5 ట్రిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నందున తాము మరింత ఎదుగుతామని చెప్పారు.   తన గ్రూప్ ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూఎస్​ షార్ట్ సెల్లర్ హిండన్​బర్గ్​తమకు వ్యతిరేకంగా ఇచ్చిన రిపోర్ట్​పై మండిపడ్డారు.  " విదేశీ షార్ట్ సెల్లర్ చేసిన నిరాధారమైన ఆరోపణలను మేం ఎదుర్కొన్నాం.

మా సమగ్రత  ప్రతిష్టపై  దాడి జరిగింది. మేం బలంగా పోరాడాం. మా గ్రూప్ పునాదులను ఎవరూ బలహీనపరచలేరని నిరూపించాం ”అని సోమవారం 62వ ఏట అడుగుపెట్టిన అదానీ అన్నారు.  అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం, వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌లను పెంచడం, డబ్బును స్వాహా చేయడం,  షెల్ కంపెనీలను సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడిందని   హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. దీంతో అదానీ గ్రూపు మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లు పడిపోయింది. ఏఈఎల్​ రూ. 20 వేల కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్​ ఆపేయడానికి రెండు రోజుల ముందు ఈ నివేదిక వచ్చింది. ఎఫ్​పీఓ రద్దు కావడానికి కూడా హిండన్​బర్గ్​ కారణమని అదానీ అన్నారు.  మీడియా, కొన్ని రాజకీయ శక్తులు కూడా తమకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆరోపించారు. 

రూ.40 వేల కోట్ల సేకరణ

రాబోయే రెండేళ్లలో అప్పుల చెల్లింపుల కోసం గ్రూప్ రూ. 40 వేల కోట్లను సమీకరించామని, రూ. 17,500 కోట్ల మార్జిన్-లింక్డ్ ఫైనాన్సింగ్‌‌‌‌‌‌‌‌ను ముందే చెల్లించామని అదానీ వెల్లడించారు.  అప్పులను తగ్గించుకోవడంతోపాటు వ్యాపారంపై మరింత దృష్టి పెట్టామని ఆయన చెప్పారు.   తమ విధానం కంపెనీల ఆర్థిక స్థితిస్థాపకతను బలోపేతం చేయడమే కాకుండా భవిష్యత్ విస్తరణ కోసం తగిన అవకాశాలనూ అందిస్తుందని అన్నారు.

మమ్మల్ని అడ్డగించిన ఎదురుగాలులతోనే మరింత ఎదిగాం’’అని ఆయన కామెంట్​ చేశారు.  ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన ఎడారులలో ఒకటైన గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని ఖవ్దాలో తన గ్రూప్ అభివృద్ధి చేస్తున్న 30 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన పార్కును ఈ సందర్భంగా అదానీ  ప్రదర్శించారు. 2023–-24లో అత్యధిక ఇబిటా రూ. 82,917 కోట్లు సాధించామని, నికర లాభం 71 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ. 40,129 కోట్లకు చేరుకుందని గౌతమ్​అదానీ వివరించారు.