పేదింటి ఆడ పిల్ల.. బడంటె తెల్వదంట

పేదింటి ఆడ పిల్ల..  బడంటె తెల్వదంట

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరు స్కూలుకు పోలే

    ‘అడ్రసింగ్‌ ది లర్నింగ్‌ క్రిసిస్‌’ రిపోర్టులో యునిసెఫ్‌

    పేద పిల్లల చదువుపై ఖర్చులో ఆఫ్రికా దేశాలు లాస్ట్‌

    బార్బడోస్‌, డెన్మార్క్‌, ఐర్లాండ్‌, నార్వే, స్వీడన్‌ ఫస్ట్‌

పిల్లలకు చదువు చెప్పించడంలో ఆడ, మగ తేడా ఇంకా పోలేదని.. ప్రపంచవ్యాప్తంగా పేద కుటుంబాల్లో ప్రతి ముగ్గురు ఆడ పిల్లల్లో ఒకరు ఇప్పటికీ స్కూలు ముఖం చూడలేదని యునిసెఫ్‌ వెల్లడించింది. ఆఫ్రికా దేశాల్లో చదువు అందని పిల్లలు ఎక్కువున్నారని.. స్కాండినేవియన్‌, యూరప్‌ దేశాలు పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నాయని తెలిపింది. చాలావరకు పేద, మధ్య తరగతి దేశాల్లో ప్రైమరీ స్కూల్‌ పూర్తైన పిల్లలు చిన్న స్టోరీని కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారంది. పిల్లల చదువుపై 42 దేశాల్లోని డేటాను విశ్లేషించిన యునిసెఫ్‌ ఈ మేరకు ‘అడ్రసింగ్‌ ది లర్నింగ్‌ క్రిసిస్‌’ పేరుతో పేపర్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల్లోని పిల్లలు చదువు దూరమవుతున్నారని, పేద పిల్లలకు చదువు చెప్పించడంలో దేశాలన్నీ ఫెయిలవుతున్నాయని చెప్పింది.

జాతి, భాష, స్కూలు దూరం ఉండటం..

చాలా దేశాల్లో డబ్బున్న 20 శాతం కుటుంబాల్లోని పిల్లల చదువుకు చేస్తున్న ఖర్చు అట్టడుగున ఉన్న 20 శాతం పేద స్టూడెంట్లకు పెడుతున్న ఖర్చు కన్నా రెండున్నర రెట్లు ఎక్కువని యునిసెఫ్‌ వివరించింది. పది ఆఫ్రికా దేశాల్లో విద్యకు చేస్తున్న ఖర్చులో చాలా తేడాలున్నాయని.. ఇక్కడ పేద, ధనిక చిన్నారుల మధ్య ఖర్చులో తేడా 4 రెట్లుందని పేర్కొంది. గినియా, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ దేశాల్లో చదువుకోని స్టూడెంట్ల సంఖ్య ప్రపంచంలోనే ఎక్కువుందని చెప్పింది. బార్బడోస్‌, డెన్మార్క్‌, ఐర్లాండ్‌, నార్వే, స్వీడన్‌ లాంటి దేశాలు పేద, ధనిక పిల్లలకు సమానంగా విద్యకు ఖర్చు చేస్తున్నాయని వివరించింది. పేదరికం, ఆడ, మగ తేడా చూపడం, అవయవాలు సరిగా లేకపోవడం, పుట్టిన జాతి, మాట్లాడే భాష, స్కూలు చాలా దూరం ఉండటం, స్కూళ్లలో సరైన వసతులు లేకపోవడం.. ఇవన్నీ పేద కుటుంబాల్లోని పిల్లలు స్కూలుకు పోకుండా అడ్డుపడుతున్నాయంది.

కనీసం 10 శాతం ఖర్చు పెట్టాలె

దేశాల బడ్జెట్‌లో 10 శాతం ఖర్చు పెడితే విద్య అందరికీ అందుతుందని యునిసెఫ్​ పేర్కొంది. చిన్న పిల్లల విద్యపై తెలివిగా, సమానంగా ఖర్చు పెడితే మున్ముందు వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడతారని, ప్రైమరీ ఎడ్యుకేషన్‌ బాగుంటేనే హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ బాగా చదవగలరంది. అప్పుడే వాళ్లు పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని, ప్రస్తుత ప్రపంచంలో నెగ్గగలుగుతారని చెప్పింది.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి