బురద దారులు .. ఆదిలాబాద్ జిల్లాలో అధ్వాన్నంగా మారిన గ్రామీణ రోడ్లు

బురద దారులు .. ఆదిలాబాద్ జిల్లాలో అధ్వాన్నంగా మారిన గ్రామీణ రోడ్లు
  • ముసుర్లతో బురదమయం
  • ఏజెన్సీ గ్రామాల్లో నరకం
  • నిధులు లేక నిలిచిన బీంపూర్ రహదారి పనులు 
  • ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న 10 గ్రామాల ప్రజలు

ఈ ఫోటోలో గుంతలు పడి బురదమయంగా మారిన రోడ్డు ఇచ్చోడ నుంచి సొనాలకు వెళ్లే అంతర్ జిల్లా రహదారి. అడెగాంలో అరకిలోమీటర్ మేర ఈ రోడ్డు అధ్వాన్నంగా మారింది. ప్రతి రోజు వందల సంఖ్యలో వెహికల్స్ ఈ రోడ్డు గుండా వెళ్తుంటాయి. రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రతి ఏటా వర్షకాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి విస్తరణ కోసం భూ సేకరణకు సమస్య ఏర్పడడంతో పనులు ఆగిపోయాయి.

ఈ ఫోటోలో కనిపిస్తున్న రోడ్డు బజార్ హత్నూర్ మండలం భూతాయి గ్రామం నుంచి డెడ్ర గ్రామానికి వెళ్లేది. ఉమర్ద, గోసాయి, గిరిజాయి, బద్దు నాయక్ తాండ, డెడ్ర గ్రామం వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర రోడ్డు బురదమయమైంది. ఈ దారి గుండా ఆయా గ్రామాల వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆదిలాబాద్, వెలుగు -: అధ్వానమైన రోడ్లు.. ప్రయాణానికి పాట్లు.. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏటా వానాకాలంలో కనిపిస్తున్న పరిస్థితి. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా రోడ్లపై గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రోడ్లు కిలోమీటర్ల మేర బురదమయమవుతున్నాయి. దీంతో ఆదివాసీలు ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా మూడు నాలుగు రోజుల నుంచి ముసురు కురుస్తుండటంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వర్షాకాలానికి ముందే రోడ్లకు రిపేర్లు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడంలేదు.

ప్రమాదకరంగా ప్రయాణం...

ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, బజార్​హతూర్, ఇచ్చోడ, సిరికొండ, నార్నూర్, బీంపూర్, తాంసి, తలమడుగు మండలాల్లోని మారుమూల గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ఏజెన్సీలో రోడ్డు సదుపాయాలే లేక ఆదివాసీలు అవస్థలు పడుతుంటే.. ఈ వర్షానికి ఉన్న మట్టి రోడ్లు బురదమయమవుతున్నాయి. దీంతో అత్యవసర సమయంలో వెంటనే ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. వర్షాలకు వాగులు దాటలేక.. మరోపక్క రోడ్లపై ప్రయాణించలేక వారు పడే అవస్థలు వర్ణాణాతీతం.

 జిల్లా కేంద్రం నుంచి భీంపూర్ మండలంలోని మహారాష్ట్ర బార్డర్​లో ఉన్న కరంజి గ్రామానికి వెళ్లే అంతరాష్ట్ర రోడ్డు అధ్వాన్నంగా మారింది. నిపాని నుంచి కరంజి వరకు రోడ్డు పనులు నిలిచిపోవడంతో బురదమయమై 10 గ్రామాల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఆదిలాబాద్ మండలంలోని పొచ్చర నుంచి బండల్ నాగాపూర్ కు వెళ్లే రోడ్డు దారుణంగా ఉంది.