మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్

 మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్
  • తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తాం: ఎస్పీ అఖిల్​ మహాజన్​

ఆదిలాబాద్, వెలుగు: మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పోలీస్​ హెడ్ క్వార్టర్స్​లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో జిల్లాలో డ్రైవింగ్ చేసి పట్టుబడ్డ పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ.. మైనర్లకు వెహికల్స్​ఇస్తే వాటి యజమానులు, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్ ప్రమాదానికి కారణమైతే ఇన్సూరెన్స్ రాకుండా పోతుందన్నారు.

అర్హులైన ప్రతిఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్​ తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 261 మైనర్లు వాహనాలతో పట్టుబడ్డారని, 261 వాహనాలను సీజ్ చేసి తల్లిదండ్రులకు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, పట్టణ సీఐలు సునీల్ కుమార్, నాగరాజు, ప్రణయ్ కుమార్, కె.ఫణిదర్ పాల్గొన్నారు.

ఆదివాసీలకు దుప్పట్ల పంపిణీ

ఆదిలాబాద్ రూరల్ మండలం బుర్కీ గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా 150 దుప్పట్లు, యువతకు స్పోర్ట్స్ కిట్స్​ను ఎస్పీ అఖిల్ మహాజన్  పంపిణీ చేశారు. త్వరలోనే యువతకు జాబ్ మేళా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, బాబాలను నమ్మవద్దని  సూచించారు. అనారోగ్యానికి గురైతే డాక్టర్లను సంప్రదించాలన్నారు.