అద్వానీ సైలెన్స్ : ఐదేళ్లలో 365 పదాలే మాట్లాడారు

అద్వానీ సైలెన్స్ : ఐదేళ్లలో 365 పదాలే మాట్లాడారు

లోక్ సభలో అద్వానీ మౌనముద్ర

న్యూ ఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, రాజకీయ భీష్ముడు అంటే గుర్తొచ్చే వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ. రెండున్నర దశాబ్ధాలు బీజేపీని తన కనుసన్నల్లో నడిపించిన వ్యక్తి . తన రాజకీయ జీవితంలో 11సార్లు ఎంపీగా పనిచేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అధికారపక్షం అడ్డుకున్నా సరే తాను అనుకున్నది చెప్పేంతవరకు వెనక్కి తగ్గని ధైర్యం ఆయనది. ఆగస్టు 8, 2012 అస్సాం లోకి అక్రమ వలసలు, హింసాత్మక ఘలనలపై వాయిదా తీర్మాణంపై పార్లమెంట్ లో చర్చలో విపక్షనేతగా అద్వానీ 5 వేల పదాలు మాట్లాడారు. మరెన్నో సార్లు ఆయన గంటల తరబడి సమావేశాల్లో ప్రసంగించిన సందర్భాలున్నా యి. ఒక్క చర్చలోనే ఐదువేల పదాల వరకు మాట్లాడిన అద్వానీ గత ఐదేళ్లలో లోక్ సభ సమావేశాల్లో మాట్లాడిన పదాలు 400 దాటలేదని రికార్డులు చెబుతున్నాయి.

2014నుంచి 2019వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అద్వానీ మాట్లాడిన పదాలు 365 మాత్రమేనని రికార్డుల్లో నమోదైంది. 2009-14 తో పోలిస్తే ఆయన ప్రసంగం దాదాపు 99 శాతం తగ్గిపోయిం దని వెల్లడైంది. సమావేశాల్లో ఆయన హాజరు 92శాతంగా ఉంది. గత ఐదేళ్ల మొత్తంలో మాట్లాడిన పదాల కన్నా 2009లో స్పీకర్‌‌‌‌గా మీరాకుమార్‌‌‌‌ను ఎన్నుకున్న సమయంలో అద్వానీ ఆమెను అభినందిస్తూ ఎక్కువగా(440 )పదాలు మాట్లాడారు.

2014 ఎన్నికలకు ముందు వరకు అద్వానీ.. బ్లాగ్ లో ఎప్పటికప్పుడు రాజకీయాలపై విమర్శలు చేస్తూ 39 ఆర్టికల్స్ రాశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బ్లాగ్ లో ఎలాంటి వ్యాసాలు రాయలేదు.