కంపెనీలకు ఇబ్బందులు తెచ్చిన కొన్ని ప్రకటనల..

కంపెనీలకు ఇబ్బందులు తెచ్చిన కొన్ని ప్రకటనల..

గుండుసూది కొనాలన్నా యాడ్​ చూసి కొనేవాళ్లు ఉన్న కాలం ఇది. అందుకే కంపెనీలు కూడా ప్రతి ప్రొడక్ట్​కూ యాడ్​ ఇస్తున్నాయి.  కానీ, ఇక్కడే అసలు తంటా ఉంది. యాడ్​ క్లిక్​ అయితే పర్వాలేదు. లేకపోతే ప్రొడక్ట్​కే కాదు, కంపెనీ కూడా సమస్యల్లో పడినట్లే. అలా గాడి తప్పి ప్రొడక్ట్స్​కూ, కంపెనీకి ఇబ్బందులు తెచ్చిన కొన్ని ప్రకటనల సంగతులే ఇవి. 
    
‘కిటకిటలాడుతున్న బస్​లో వెళ్లడం ఎందుకు? రాపిడో ఉందిగా’ అంది ఒక యాడ్​..‘మీకు ఆకలేసినప్పుడు, మీరు ఎక్కడున్నా క్షణాల్లో ‘మహాకాల్​ థాలి’ అందుతుంది’ అంది మరొక యాడ్​.. ఈ రెండు యాడ్స్​ మనదేశంలో ఇటీవలే వచ్చాయి. కానీ, ఇవి రెండు కూడా ఆ యాడ్స్​ తీసిన కంపెనీలను, అందులో నటించినవాళ్లను ఇబ్బందులకు గురిచేశాయి. ఇలా యాడ్స్​ వల్ల కంపెనీలకు ఇబ్బంది రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు జరిగింది.  వస్తువుల అమ్మకంలో యాడ్స్ (అడ్వర్టైజ్​మెంట్స్​​)ది కీ రోల్​​. మంచి యాడ్స్​ వల్ల​ సేల్స్​ పెరుగుతాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అలాగే యాడ్​ బాగలేకపోతే​ సేల్స్​ సంగతి దేవుడెరుగు ఏకంగా కంపెనీ దివాళా తీసే ప్రమాదం కూడా ఉంది. ఇటీవల మనదేశంలో లేయర్స్​ బాడీ స్ప్రే ‘షాట్​’​, జొమాటో ‘మహాకాల్​ కి థాలి’,  టాలీవుడ్​ యాక్టర్​ అల్లుఅర్జున్​తో రాపిడో చేసిన యాడ్స్​ వివాదాల్లో చిక్కి ఆయా కంపెనీలకు ఇబ్బందులు తెచ్చిపెట్టినవే.గ్లోబలైజేషన్​ వల్ల ప్రపంచం ఒక పెద్ద మార్కెట్​గా మారిపోయింది. ఎక్కడ ఏ వస్తువు ఉత్పత్తి అయినా అది అన్ని దేశాలకూ వెళ్తోంది. అలాగే ఆ వస్తువుల యాడ్స్​ కూడా అన్నిచోట్లకూ వెళ్తున్నాయి. కానీ ఇలా వెళ్లే యాడ్స్​ ఒక్కోసారి ఆ ప్రొడక్ట్స్​, వాటి కంపెనీలకు చిక్కులు తెస్తున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నా ముఖ్యమైనవి మాత్రం రెండే. ఒకటి భాష, రెండు సంస్కృతి. 
  
ట్రాన్స్​లేషన్,​స్పెల్లింగ్...
కూల్​డ్రింక్స్ టాప్​ బ్రాండ్లలో​ ‘కోకాకోలా’ ఒకటి. కానీ, ఇది​ చైనా మార్కెట్​లోకి వెళ్లినప్పుడు మాత్రం అక్కడ చాలారోజుల పాటు సరైన సేల్స్​ లేవు. కారణం..‘కోకాకోలా’ను రిటైల్​ షాపుల ఓనర్లు అక్కడి భాషలోకి మార్చి రాయడమే. దానివల్ల ‘కోకాకోలా’ అంటే ‘మైనపు తోకకప్పను కొరకడం’ అని అర్థం వస్తోందట. చివరికి తప్పు తెలియడంతో వెంటనే ‘కోకాకోలా’ పేరును చైనీస్​లో రాసేటప్పుడు అర్థం మారేలా రాయడంతో సేల్స్ పెరిగాయి.  

‘విక్స్​ కాఫ్​ డ్రాప్స్​’, ‘పఫ్స్​’ టిష్యూ పేపర్స్​ సేల్స్​ జర్మనీలో మొదట అనుకున్న స్థాయిలో లేకపోవడానికి భాషతో వచ్చిన తిప్పలే. అదెలాగంటే.. ఇంగ్లీష్​ అక్షరం ‘వి’ని జర్మనీలో ‘ఎఫ్’గా పలుకుతారు. దాంతో ‘విక్స్​’ కాస్తా ‘ఫిక్స్​’ అయింది. ఈ మాటకు జర్మన్​ భాషలో ‘శృంగారం’ అని అర్థం! అలాగే ‘ఫఫ్​’ అంటే ‘వేశ్యాగృహం’ అని అర్థం. ఇంకేముంది ఈ రెండింటి సేల్స్​ జర్మనీలో ఢమాల్​. ఇలాగే కోల్గెట్​ ప్రొడక్ట్​ ‘క్యూ’కు ఫ్రాన్స్​లో చుక్కెదురైంది. ‘క్యూ’ పేరుతో అప్పటికే అక్కడ ఒక ‘పోర్న్​ మేగజైన్​ (బూతు పత్రిక)’ ఉందట మరి! పానసోనిక్​ కంపెనీ తయారుచేసిన మొదటి టచ్​స్క్రీన్​ కంప్యూటర్​ ‘టచ్​ ఊడీ’ అమెరికా మార్కెట్​లో అట్టర్​ ఫ్లాప్​ అవడానికి కూడా పేరే కారణం.ఎందుకంటే.. అమెరికాలో ‘ఊడీ ఉడ్​పెకర్​’ కార్టూన్​ చాలా ఫేమస్​. దాంతో తాము తయారుచేసిన పీసీకి ‘టచ్​ ఊడీ’ అని పెట్టింది పానసోనిక్​. అక్కడే తప్పులో కాలేసింది. ‘ఊడీ’ అంటే అమెరికా స్థానిక యాసలో ‘పురుష జననాంగం’ అని అర్థమట. పైగా ఊడీకి తోడు ‘టచ్’​ కూడా పెట్టేశారు.  విషయాన్ని అమెరికాలోని ‘పానసోనిక్​’ కంపెనీ సిబ్బంది గుర్తించేసరికే ఆలస్యమైపోయింది. ఇక సేల్స్​ సంగతి అంటారా? ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది? భాషతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా పెద్దగా నష్టం రాకపోవచ్చు కానీ, చైనాలో మాత్రం అలా కుదరదు. ఎందుకంటే అది వందకోట్ల మార్కెట్​. ‘కోకాకోలా’ విషయంలో ఏం జరిగిందో తెలిసినా కూడా పట్టించుకోకపోవడం ఇలానే చైనాలో ‘పెప్సీ’ కొంప ముంచింది. పెప్సీ కూల్​డ్రింక్​ ఫేమస్​ స్లోగన్​ ‘పెప్సీ బ్రింగ్స్​ యు బ్యాక్​ టు లైఫ్​’ గురించి తెలుసు కదా. దీన్ని చైనీస్​లోకి మారిస్తే ‘పెప్సీ బ్రింగ్స్​ యువర్​ ఏన్​సెస్టర్స్ బ్యాక్​ ఫ్రమ్​ ది గ్రేవ్​’ అని వచ్చింది. అంటే ‘సమాధుల్లోని మీవాళ్లను పెప్సీ బయటకు తెస్తుంది’ అని అర్థం. ఈ తప్పు చూస్తే నవ్వు వచ్చినా, పెప్సీకి మాత్రం తీవ్ర నష్టమే చేసింది.

కోకకోలా, పెప్సీకే కాదు కెఎఫ్​సికి కూడా చైనాలో ట్రాన్స్​లేషన్​ దెబ్బ తగిలింది. కెఎఫ్​సి స్లోగన్ ‘ఫింగర్​–లికిన్​ గుడ్​’కు అర్థం చైనీస్ భాషలో ‘మీ చేతి వేళ్లను కొరికి తినండి’ అంట! ఆలస్యంగా తెలుసుకున్న కెఎఫ్​సి తర్వాత చైనాలో స్లోగన్​ మార్చేసింది. ఇలాంటి స్లోగన్​ దెబ్బ ‘పార్కర్’​ పెన్​పై కూడా పడింది. ఇది జరిగింది మెక్సికోలో. పార్కర్​ కంపెనీ బాల్​పాయింట్​ పెన్​ను మార్కెట్​లోకి తెచ్చినప్పుడు దానికి స్లోగన్​ ‘ఇట్​ వోంట్​ లీక్​ ఇన్​ యువర్​ పాకెట్​ అండ్​ ఎంబరాస్​ యు’ అని పెట్టారు. అంటే ఈ పెన్ను జేబులో సిరాను లీక్​ చేయదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు’ అని అర్థం. ఈ స్లోగన్​ను మెక్సికోలో మెయిన్​ లాంగ్వేజ్​ అయిన స్పానిష్​లోకి మార్చినప్పుడు ‘ఎంబరాస్​’ కు బదులుగా ‘ఎంబరాజర్​’ వాడారు. నిజానికి ‘ఎంబరాజర్​’ అంటే ఇమ్​ప్రెగ్నెంట్​(గర్భం) అని అర్థం. దాంతో ఆ స్లోగన్​ అర్థమే మారిపోయింది. భాషతో ముఖ్యంగా అనువాదంతో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి దీన్ని ఉదాహరణగా చెప్తుంటారు ఇంటర్నేషనల్​ యాడ్​ మేకర్స్​.  

బొమ్మలతోనూ తిప్పలు
ప్రొడక్ట్స్​ పేర్లు, స్లోగన్స్​ మాత్రమే కాదు వాటి యాడ్స్​లోని బొమ్మల వల్ల కూడా కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. చిన్నపిల్లలకోసం ఫుడ్​ తయారుచేసే ‘గెర్బర్’​కంపెనీకి ఇలాంటి చిక్కే వచ్చింది. ఆఫ్రికాలో గెర్బర్​ ప్రొడక్ట్స్​ అమ్మకానికి పెట్టినప్పుడు అక్కడ కొన్ని వారాలపాటు సేల్స్​  లేవు. కారణం.. బాటిల్​పై వేసిన లేబుల్. సీసాలో పిల్లల ఫుడ్​ ఉంది అని చెప్పడానికి లేబుల్​పై చిన్నపిల్లాడి బొమ్మ వేశారు. అదే ఆ ప్రొడక్ట్​ కొంప ముంచింది. నిజానికి ఏదైనా ప్యాక్​, లేదా బాటిల్​ మీద ఉన్న బొమ్మను బట్టి అందులో ఉన్న ఫుడ్​ దాంతో తయారుచేశారని ఆఫ్రికాలో అర్థం. ఎందుకంటే అక్కడ చదువుకున్న వాళ్లు తక్కువ కాబట్టి బాటిల్​ లేదా ప్యాక్​లో ఉన్న ఫుడ్​ దేంతో తయారుచేశారో చెప్పడానికి ఇలాంటి పద్ధతి వాడతారు. గెర్బర్​ బాటిల్​ లేబుల్​పై చిన్నపిల్లాడు ఉండడంతో దాన్ని చిన్నపిల్లల్ని చంపి తయారుచేసిన ఫుడ్​ అనుకున్నారు ఆఫ్రికన్లు. 

గల్ఫ్​ కంట్రీస్​లో ఒక డిటర్జెంట్​ కంపెనీకి ఇదే అనుభవం ఎదురైంది. మూడే మూడు బొమ్మల్లో తన ప్రొడక్ట్​ గురించి యాడ్​ ఇవ్వాలనుకుంది ఆ కంపెనీ. మొదటి బొమ్మలో ఒక మహిళ తన చేతిలో మురికి చొక్కాను పట్టుకొని ఉంటుంది. రెండో బొమ్మలో ఆ చొక్కాను డిటర్జెంట్​ కలిపిన నీళ్లున్న బకెట్​లో ముంచుతుంది. మూడో బొమ్మలో తెల్లటి, శుభ్రమైన చొక్కా ఆమె చేతిలో కనిపిస్తుంది. నిజానికి ఇది చాలా మంచి యాడ్​. కానీ, మిగిలిన దేశాల మాదిరి కాకుండా అరేబియన్​ కంట్రీస్​లో అక్షరాల్ని, బొమ్మల్ని కుడి నుంచి ఎడమకు చదువుతారు, చూస్తారు అనే విషయం ఆ కంపెనీ మర్చిపోయింది. ఇంకేముంది? ‘తెల్లటి చొక్కాను డిటర్జెంట్​ నీళ్లున్న బకెట్​లో ముంచితే మురికిగా తయారైంది’ అని ఆ అడ్వర్టైజ్​మెంట్​ అర్థం మారిపోయింది. దాంతో యాడ్​ నవ్వులపాలైంది. డిటర్జెంట్​ స్టోర్స్​లో మిగిలిపోయింది. కోక్​కు పోటీగా పెప్సీ తీసుకొచ్చిన ‘పెప్సీ కోలా’ సేల్స్​ ఆగ్నేయాసియాలో రాత్రికి రాత్రే అమాంతం పడిపోవడం వెనక కూడా దాదాపు ఇలాంటి కారణమే ఉంది. అప్పటివరకూ ఆ దేశాల్లో రీగల్​ బ్లూ కలర్​లో ఉన్న ‘పెప్సీకోలా’లోగో, వెండింగ్​ మెషిన్స్​, కూలర్స్​ను ‘లైట్​ ఐస్​ బ్లూ’లోకి మార్చడంతో సేల్స్​ మొత్తం పడిపోయాయి. ఎందుకంటే ‘లైట్​ ఐస్​ బ్లూ’ను మరణాలు, శ్రద్ధాంజలి టైంలో వాడతారు అక్కడి ప్రజలు. 

కల్చర్​.. 
యాడ్స్​ను తయారుచేసేటప్పుడు ఆయా దేశాల్లోని సంస్కృతి, సంప్రదాయాలను కూడా గమనించాలి. అలా చేయకపోవడం ఎంత తప్పో ప్రొక్టర్​ అండ్​ గ్యాంబల్(పిఅండ్​జి)​కు లేట్​గా తెలిసొచ్చింది. ఈ అమెరికన్​ కంపెనీ ‘ప్యాంపర్స్’ పేరుతో చిన్నపిల్లల డైపర్స్​ తయారుచేసింది. డైపర్స్​ ఉన్న ప్యాక్​ మీద.. డైపర్​ను ఊయలగా చేసుకొని నిద్రపోతున్న ఒక చిన్నారిని తన నోటితో తీసుకెళ్తున్న కొంగ బొమ్మ వేశారు. ఈ కొంగను అమెరికాలో ‘స్టార్క్’​ అంటారు. ఇది చిన్నపిల్లల్ని క్షేమంగా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చుతుందని అమెరికన్ల నమ్మకం. కానీ, జపాన్​లో ఈ స్టార్క్​ కనిపించదు. పైగా అక్కడి జానపద కథలు ఒక పెద్ద పండులో చిన్నపిల్లాడు దొరికినట్లు చెప్తాయి. జపాన్​లో పిఅండ్​జి ప్యాంపర్స్​ సేల్స్​ తక్కువగా ఉండడానికి కారణం అది. ఇదే కాదు, మరో యాడ్​లోనూ పిఅండ్​జి ఇలాంటి తప్పే చేసింది. ఈ కంపెనీ తయారుచేసిన ఒక సోప్​ టీవీ యాడ్​ విషయంలో జరిగింది ఇది. ఇందులో ఒక మహిళ బాత్​ టబ్​లో ఉండగా, ఆ గదిలోకి ఆమె భర్త  వచ్చి వెనకనుంచి తాకుతాడు. అయితే, ఈ యాడ్​ ఒక మహిళ ప్రైవసీని డిస్టర్బ్​​ చేస్తున్నట్లు ఉందని జపాన్​లో అనుకున్నారు. అంతే, ఆ సోప్​ అమ్మకాలు ముందుకుసాగలేదు. యాడ్స్​ చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాని ఫలితాలు వేరుగా ఉంటాయి అనడానికి ఉదాహరణలే పైవన్నీ. అంటే ఏదైనా యాడ్​ చేయాలంటే భాష, ఉచ్ఛారణ, స్థానికత, సంస్కృతి, మతం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. వీటిలో ఏమాత్రం తేడా ఉన్నా ప్రొడక్ట్ సేల్స్, కంపెనీ బ్రాండ్​ నేమ్​కు దెబ్బతగలడం ఖాయం.