యూట్యూబర్..వి ఆర్‌‌ ది స్టార్స్‌

యూట్యూబర్..వి ఆర్‌‌ ది స్టార్స్‌

కొందరు ఆఫ్రికన్ పిల్లలు ఇంగ్లిష్​, హిందీ పాటలకు లిప్‌‌సింక్ చేస్తూ.. హుషారుగా డాన్స్‌‌లు చేస్తుంటారు. ఆ వీడియోలను ‘మసక కిడ్స్‌‌ఆఫ్రికాన’  యూట్యూబ్‌‌ ఛానెల్‌‌లో అప్‌‌లోడ్‌‌చేస్తుంటారు. పెదాలపై చిరునవ్వు చెరగకుండా డాన్స్‌‌చేస్తుంటే.. అందరూ మైమరిచిపోవాల్సిందే. కానీ.. ఆ పిల్లల నవ్వుల వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంది. వాళ్లంతా కరువు, యుద్ధం, జబ్బుల వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు. 

ఉగాండాకు చెందిన ‘మసక కిడ్స్ ఆఫ్రికానా’ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) కొంతమంది పిల్లల్ని చేరదీసి వాళ్లకు తిండి పెట్టి, విద్యాబుద్ధులు నేర్పుతోంది. ఈ ఎన్జీవోనే ఆ పిల్లల డాన్స్​ వీడియోలు తీసి సోషల్‌‌‌‌ మీడియాలో పోస్ట్‌‌చేస్తున్నారు. ‘‘ఉగాండాలో 2.4 మిలియన్ల కంటే ఎక్కువ మంది పిల్లలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2019లో ఉగాండాలో 20% కంటే ఎక్కువ మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.

అలాంటి కొంతమంది పిల్లలను చేరదీసి వసతి కల్పించి, తినడానికి తిండి పెట్టి, బట్టలు, చదువు, మెడికల్‌‌ కేర్‌‌‌‌ అందిస్తున్నాం. అందుకు కావాల్సిన డబ్బుని అనేక మార్గాల ద్వారా సమకూర్చుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ పిల్లలకు పాటలు, డాన్స్‌‌లు నేర్పి వాళ్లతో వీడియోలు చేస్తున్నాం” అని మసక కిడ్స్ ఆఫ్రికానా సంస్థ చెప్తోంది. 

సూపర్​ ఫాలోయింగ్‌‌

మసక కిడ్స్ ఆఫ్రికానా ఫౌండర్, సీఈవో సునా హసన్ ఆలోచన నుంచి పుట్టిందే సోషల్‌‌మీడియా నుంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన. పెద్దగా ట్రైనింగ్‌‌ లేకపోయినా పిల్లలు డాన్స్​ స్టెప్పులు మాత్రం అదరగొడతారు. అందుకే వీళ్ల డాన్స్‌‌కు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఉగాండాలో ఉన్న ఫాలోయింగ్‌‌ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్‌‌లో 3.53 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్స్ ఉన్నారు.

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఎనిమిది మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌‌ఉన్నారు. ఈ పిల్లలు చేసే డాన్స్‌‌వీడియోలను అందరూ మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రయోజనం కోసం సోషల్ మీడియాను వాడుకుంటుంటే.. వీళ్లు మాత్రం తమలాంటి పిల్లల కనీస అవసరాలు తీర్చడం కోసం డాన్స్​ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ఎన్జీవో కోసమే ఖర్చు చేస్తున్నారు. 

ఎందుకు ఈ ఎన్జీవో అంటే...

ఈ ఎన్జీవో ఫౌండర్ హసన్ కూడా తనకంటూ ఎవరూ లేక ఆ పిల్లల్లానే పెరిగాడు. అందుకే అతనికి ఆ కష్టాల విలువ తెలుసు. తను పడినలాంటి కష్టాలు ఉగాండాలో ఇంకే పిల్లలు పడకూడదనే ఎన్జీవో మొదలుపెట్టాడు. ఎవరూ సాయం చేయకున్నా ఎన్జీవోకు సరిపడా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నాడు. అంతేకాదు.. మసక కిడ్స్‌‌ఆఫ్రికానా పేరుతో కొన్ని ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నాడు. ముఖ్యంగా టీషర్ట్స్​, బనియన్స్​ మార్కెట్‌‌లోకి తెచ్చారు. వాటిని కొని పిల్లలకు సాయం చేయమని కోరుతున్నారు. సాధారణంగా ఆఫ్రికాలో డాన్స్, పాటలను కమ్యూనికేషన్‌‌ కోసం ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యమైన వేడుకల్లో ఆఫ్రికన్ డ్రమ్స్ ప్లే చేస్తుంటారు.

వాటిని అక్కడివాళ్లు ‘హార్ట్ ఆఫ్‌‌ కమ్యూనిటీ’ అంటుంటారు. ముఖ్యంగా ఉగాండాలో ప్రజల మనోభావాలు, భావోద్వేగాలకు డాన్స్‌‌, మ్యూజిక్‌‌ అద్దం పడతాయి. అందుకే మసక కిడ్స్ ఆఫ్రికానా పిల్లలు డాన్స్‌‌, మ్యూజిక్‌‌ద్వారా ప్రజల్లోకి వచ్చారు. ఇప్పుడు ఈ ఎన్జీవో ద్వారా చాలామంది పిల్లలకు సాయం అందుతోంది. ఎన్జీవోలో ఉన్న పిల్లలతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో ఉండే అనాథ పిల్లలకు కూడా సాయం చేస్తున్నారు. కొందరికి స్కూల్‌‌ ఫీజులు కడతారు. బట్టలు, పాఠశాల సామగ్రి ఇస్తున్నారు. 

గ్లోబల్ విలేజ్‌‌లో...

పిల్లలు అద్భుతంగా డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతర్జాతీయంగా ఈ ఎన్జీవోకు గుర్తింపు దక్కింది. అందుకే పోయినేడాది దుబాయ్‌‌లో నిర్వహించిన గ్లోబల్ విలేజ్‌‌లోని కిడ్స్ థియేటర్‌‌లో ఈ ఎన్జీవో పిల్లలకు ప్రదర్శన ఇచ్చే అవకాశం దొరికింది. ఆరేండ్ల పిల్లలు కగ్గ్వా జాన్‌‌బోస్కో, కకూజా ముహమ్మద్, ఐదేండ్ల ప్రిన్స్ సునా థియేటర్‌‌లో డాన్స్ పర్ఫార్మెన్స్‌‌ ఇచ్చి.. అందరి మెప్పు పొందారు. 

చదువుకుంటూనే.. 

సోషల్‌‌మీడియాలో ఎక్కువగా కనిపించే ఈ పిల్లలు చదువులో కూడా ముందుంటారు. స్కూల్‌‌కి సెలవులు ఉన్నప్పుడు మాత్రమే వీడియోలు చేస్తారు. అంతేకాదు.. పిల్లల కోసం ఈ ఎన్జీవో ‘వి ఆర్‌‌‌‌ది స్టార్స్‌‌’ పేరుతో ప్రత్యేకంగా ఒక ఆడియో ఆల్బమ్‌‌ చేసింది. అందులో పాటల ద్వారా వాళ్ల కష్టాలు, సమస్యలు చాలా బాగా చెప్పారు. ఆ పాటలు వాళ్ల అఫిషియల్ ఛానెల్‌‌‘మసక కిడ్స్‌‌ఆఫ్రికానా’లో అప్‌‌లోడ్‌‌ చేశారు. ఈ ఛానెల్‌‌ను 2018లో మొదలుపెట్టారు. అప్పటినుంచే వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఛానెల్‌‌కు 3.53 మిలియన్ల మంది సబ్‌‌స్క్రయిబర్స్ ఉన్నారు.