పాక్‌లో నిన్న గురుద్వారాపై దాడి.. నేడు సిక్కు యువకుడి హత్య

పాక్‌లో నిన్న గురుద్వారాపై దాడి.. నేడు సిక్కు యువకుడి హత్య

పాకిస్థాన్‌లో మైనారిటీలకు రక్షణ కొరవడిందని, మత హింసను ఎదుర్కొంటున్నారని.. వారి కోసం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చామంటున్న కేంద్ర ప్రభుత్వ వాదనకు బలం పెరుగుతోంది. పాక్‌లో జరుగుతున్న వరుస ఘటనలు దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆ దేశంలో ఉన్న సిక్కుల తొలి గురువు గురునానక్ జన్మస్థలమైన నాన్‌కానా సాహెబ్ గురుద్వారాపై జరిగిన దాడిని మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాక్‌లోని పెషావర్‌లో సిక్కు యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఆ దేశ మీడియా కథనాలు ప్రసారం చేయడం కలకలం రేపుతోంది.

పాకిస్థాన్‌కు చెందిన ఓ టీవీ చానెల్ రిపోర్టర్ హర్మీత్ సింగ్ సోదరుడు రవీందర్ సింగ్‌ (25)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. పెషావర్‌లోని చంకానీ పోలీస్ స్టేషన్ పరిధిలో అతడి మృతదేహం కనిపించింది. మలేసియాలో ఉంటున్న రవీందర్ సింగ్ బంధువుల పెళ్లి వేడుకలో పాల్గొనడానికి పాక్ వెళ్లాడు. ఈ సందర్భంగా షాపింగ్ కోసం పెషావర్ వెళ్లినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపినట్లు పాక్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

దీనిపై బాధితుడి సోదరుడు హర్మీత్ సింగ్ మాట్లాడుతూ ఏ దేశమైనా మైనారిటీలు లేకుండా అభివృద్ధి కాలేదన్నాడు. పాకిస్థాన్ బ్యూటిఫుల్‌గా ఉందంటే మైనారిటీల వల్లేనన్నాడు. కానీ, ప్రతి ఏటా తమ తోటివారి శవాలను లెక్కపెట్టుకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మైనారిటీల రక్షణ కోసం పాకిస్థాన్‌కు పలు దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయని, కానీ తమకు భద్రత లేదని చెెప్పాడు. ఈ పరిస్థితి వల్లే నేడు తన సోదరుడు శవాన్ని చిన్న వయసులోనే భుజంపై వేసుకుని నడవాల్సి వచ్చిందని ఆవేదన చెందాడు.

మరోవైపు నాన్‌కానా గురుద్వారాపై దాడి విషయంలో భారత అధికార, ప్రతిపక్షాలు ముక్తకఠంతో స్పందించాయి. పాక్ చర్యలను ఖండించాయి. దాయది దేశంలో మైనారిటీలపై దాడికి ఇదే నిదర్శనమని బీజేపీ అంటుండగా.. మైనారిటీలపై దాడులు సరికాదంటూ కాంగ్రెస్ కామెంట్స్ చేసింది.