తెలంగాణలో సాగు ఎంత.. పడావు ఎంత?

తెలంగాణలో  సాగు ఎంత.. పడావు ఎంత?
  • రైతు భరోసా కోసం లెక్కలు తీస్తున్న వ్యవసాయ శాఖ 
  • గత ప్రభుత్వంలో పడావు భూములకూ సాయం
  • ఇప్పుడు పడావు భూములకు ఆపేస్తే.. ఏటా రూ. 3,750 కోట్లు ఆదా

హైదరాబాద్‌‌, వెలుగు: రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే సీజన్‌‌ నుంచి సాగు భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రభుత్వం బడ్జెట్‌‌ సమావేశాల్లో ప్రకటించిన నేపథ్యంలో రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ సాగు లెక్కలు తేల్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలు, మండలాలు, గ్రామాలవారిగా ఉన్న సాగు భూమి ఎంత? సాగు చేయకుండా పడావు (బీడు) పడ్డ భూమి ఎంత? రాళ్లు, గుట్టలతో సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూమి ఎంత? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగు చేయని భూములలో ఎన్ని ఎకరాలకు రైతుబంధు ఇచ్చారు? అందులో కొండలు, గుట్టలు ఎన్ని ఉన్నాయనే అంశాలతో సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారులకు ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక సహాయకున్ని నియమిస్తే సాగు లెక్కలను పక్కాగా తేల్చే అవకాశం ఉందని ఏఈవోలు అంటున్నారు.   

సాగు భూములకే సాయం 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రెండు సీజన్ లకు రూ. 15 వేల చొప్పున పెట్టుబడి సాయం చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సాగు భూములకే సాయం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఏటా ఏ భూమిలో, ఏ పంట వేశారన్న వివరాలు  వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేస్తున్నా.. వాస్తవాలకు, నివేదికలకు పొంతన ఉండటం లేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ వ్యవసాయ శాఖ ఇస్తున్న వివరాలకు, కొనుగోలు చేస్తున్న ధాన్యానికి సంబంధం ఉండటం లేదు. దీంతో వ్యవసాయ అధికారులకు తోడు క్షేత్రస్థాయిలో భూముల వివరాలు తెలిసిన రెవెన్యూ సిబ్బందిని సైతం రంగంలోకి దింపి వేగంగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. 

84 లక్షల రైతులకు ఐదెకరాలోపే..  

రైతు బంధు లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.52 కోట్ల ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. ఇందులో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 22.55 లక్షల మంది ఉన్నారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులు 62.34 లక్షల మంది ఉన్నారు. ఈ 62.34 లక్షల మంది చేతిలోనే కోటి ఎకరాల భూమి ఉన్నది. అంటే రాష్ట్రంలో ఒక గుంట నుంచి ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులే 90.36 శాతం మంది (84.89 లక్షల మంది) ఉన్నారు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు 6.65 లక్షల మందే ఉన్నప్పటికీ.. వీరందరికీ కలిపితే ఏకంగా 52 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసాను ఐదు ఎకరాలకే పరిమితం చేస్తే.. ప్రభుత్వానికి ఏటా రూ.7,800 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందని, అలాగే 90 శాతం మంది రైతులకు సర్కారు సాయం దక్కినట్లు కూడా అవుతుందని భావిస్తున్నారు. పడావు భూములకు సాయాన్ని నిలిపేయడం వల్ల రూ. 3,750 కోట్లు.. పథకాన్ని ఐదు ఎకరాలకు పరిమితం చేయడం వల్ల రూ. 7,800 కోట్లు.. రెండింటికీ కలిపి ఏటా రూ. 11,550 కోట్ల వరకూ దుబారాను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. 

25.5 లక్షల ఎకరాలు పడావు భూములే 

గత ప్రభుత్వ హయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొండలు, గుట్టలకు సైతం పెట్టుబడి సాయం అందింది. కొన్ని మున్సిపాల్టీల్లో రియల్‌‌ ఎస్టేట్‌‌ వెంచర్లు, ప్రాజెక్టులకు సేకరించిన భూములకు సైతం రైతు బంధు కింద డబ్బులు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25.5 లక్షల ఎకరాల వరకు సాగు యోగ్యత లేని పడావు భూములకు కూడా నిధులు అందుతున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయితే ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముందని చెప్తున్నారు. పట్టాదారు పాస్‌‌బుక్‌‌ ఉంటే చాలు.. ఎవుసం చేసినా, చేయకపోయినా గత ప్రభుత్వం రైతుబంధు అందించేది. గత వానాకాలం సీజన్‌‌లో 68.99 లక్షల మంది రైతులకు సంబంధించి కోటి 52 లక్షల 49 వేల 486 ఎకరాలకు రూ.7,624.74 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి. ఇకపై పడావు భూములకు సాయాన్ని నిలిపేస్తే.. ప్రభుత్వానికి ఏటా రూ. 3,750 కోట్ల మేరకు ఆదా కానున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల పథకంలో నిధుల వృథాను పెద్ద ఎత్తున అరికట్టవచ్చని భావిస్తున్నారు.  

కౌలు రైతులకూ అమలు..

గత ప్రభుత్వం కౌలు రైతులను అసలు రైతులుగానే గుర్తించలేదు. వారిని గుర్తించడం సాధ్యం కాదని చెప్తూ రైతు బంధు సాయం95 అందించలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఎన్నికల హామీ మేరకు కౌలు రైతులకూ రైతు భరోసా అందించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దుబారాను అరికట్టడం ద్వారా గతంలో పెట్టిన ఖర్చతోనే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించే వీలుంటుందని రైతు సంఘాలు చెప్తున్నాయి.