రవాణా భారం రైతులపైనే..హెచ్చరించినా మారని ఆఫీసర్ల తీరు

రవాణా భారం రైతులపైనే..హెచ్చరించినా మారని ఆఫీసర్ల తీరు
  • కాంటా వేసిన వడ్లను రైతులే మిల్లులకు తరలించుకోవాలంటున్న నిర్వాహకులు
  • అన్​లోడ్​ చేసుకునేందుకు కొర్రీలు పెడుతున్న మిల్లర్లు

మహబూబాబాద్, వెలుగు : ఇంతకాలం వడ్లు కాంటా వేయకుండా రైతులను ఇబ్బంది పెట్టిన నిర్వాహకులు, ఇప్పుడు కాంటాలు వేసినా వడ్లను తరలించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.   రైతులే రవాణ ఖర్చులు పెట్టుకోవాలని కొన్ని కేంద్రాల్లో  చెబుతున్నారు.  తప్పని పరిస్థితుల్లో రైతులు ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకొని వడ్ల బస్తాలను మిల్లులకు తరలిస్తున్నారు. కానీ అక్కడ మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు. కేంద్రాల్లో ఉండలేక, మిల్లుల్లో దింపలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కలెక్టర్ హెచ్చరించినా మారని తీరు

మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 35,322 క్వింటాళ్ల వడ్లు కొనగా ఇందులో 23,178 క్వింటాళ్లను మాత్రమే మిల్లులకు తరలించారు. ఇంకా 12,143 క్వింటాళ్ల వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయి.  వడ్లు కాంటా వేసిన తర్వాత 24 గంటల్లో మిల్లులకు తరలించాలని ఇటీవల నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. రవాణాకు సంబంధించిన డబ్బులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రైతులే సొంతంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకొని వడ్లు తరలించాలని నిర్వాహకులు సూచించడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కొనుగోలు కేంద్రం నిర్వహణ బాధ్యత నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. అయినా నిర్వాహకుల తీరు మాత్రం మారడం లేదు. 

ఆందోళనకు దిగుతున్న అన్నదాతలు

వడ్ల కొనుగోళ్లు సజావుగా జరపాలని, రవాణా విషయం సైతం నిర్వాహకులే చూసుకోవాలని ఇటీవల తొర్రూరు మండలం అమ్మాపురం వద్ద నర్సంపేట రోడ్డుపై ధర్నాకు దిగారు. బయ్యారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్న ఇల్లంద ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును అడ్డుకొని నిరసన తెలిపారు. తాజాగా 20 రోజులు గడిచినా వడ్లు కొనడం లేదని బుధవారం మరిపెడ మండలం అబ్బాయపాలెం వద్ద మహబూబాబాద్ సూర్యాపేట హైవేపై వడ్లను తగులబెట్టి ఆందోళన చేశారు. 

లారీకి 21 క్వింటాళ్ల దోపిడీ 

ఎల్కతుర్తి : హనుమకొండ జిల్లాలో రైతులను మిల్లర్లు  దోచుకుంటున్నారు. తేమ, తాలు, దుమ్ము పేరిట ధాన్యంలో  కోతలు విధిస్తున్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్​లో   ధాన్యాన్ని 676 బస్తాల్లో నింపి కాంటా వేశారు. ఒక్కో బస్తా 42.100 కిలోల చొప్పున 284 క్వింటాళ్ల ధాన్యం తూకం వేశారు.  తాలు పేరిట14 క్వింటాళ్ల తరుగు చూపించారు. ట్రక్​షీట్ లో 270 క్వింటాళ్ల ధాన్యం తూకం వేసినట్లు  చూపారు. బస్తాలను హసన్​పర్తి మండలం ఎల్లాపూర్​లోని గోదావరి రైస్​ మిల్​కు లారీలో తరలించారు. అక్కడ మిల్లర్ నూక శాతం ఉందని చెప్పి 53 బస్తాల ధాన్యం కోత విధించాడు. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 623 బస్తాల ధాన్యం (249.20 క్వింటాళ్లు) దిగుమతి చేసుకున్నట్లు ట్రక్​షీట్ లో రాసుకున్నాడు. ఈ ఒక్క లారీలో ఏకంగా 21 క్వింటాళ్ల కోత విధించారు.  విషయం రైతులకు తెలియడంతో వారు లబోదిబోమంటున్నారు.  ఇదిలాఉంటే ఎల్కతుర్తి మండలంలో కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ ఈ నెల 12న పర్యటించి ధాన్యంలో కోత విధించకుండా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు. అయినా క్షేత్రస్థాయిలో దోపిడీ మాత్రం ఆగడం లేదు.

బస్తాల తరలింపులో లేట్ చేస్తున్నరు  

వడ్ల కొనుగోలు సెంటర్లలో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మాయిశ్చర్ వచ్చినా అగ్రికల్చర్ ఆఫీసర్లు టోకెన్లు ఇవ్వడంలో లేట్ చేస్తున్నారు. కాంటా వేసి వారం రోజులైనా బస్తాలను మిల్లులకు తరలించడం లేదు. బస్తాలు మిల్లులకు చేరే వరకు రైతులదే బాధ్యత అని చెబుతుండడంతో రోజుల తరబడి కాపలా ఉండాల్సి వస్తోంది. వడ్ల తరలింపునకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి.

- గుగులోతు రవి, రైతు, వెంకటియా తండా 

ట్రాన్స్ పోర్ట్ లో ఇబ్బంది ఉంది 

మహబూబాద్ జిల్లాలో 157 కేంద్రాల్లో వడ్ల కొనుగోలు జరుగుతోంది. వర్షాల మూలంగా రైతులు ముందస్తుగానే వరి కోతలు చేపట్టడంతో అంచనాకు మించి వడ్లు వస్తున్నాయి. వాహనాల కొరత, హమాలీల ఇబ్బందుల మూలంగా కొనుగోలు చేసిన వడ్లను తరలించడంలో ఆలస్యం అవుతోంది. సమస్యను అధిగమించడం కోసం చర్యలు చేపడుతాం. 

– కృష్ణవేణి, సివిల్​ సప్లై డీఎం,  మహబూబాబాద్​ జిల్లా