విపత్తుల సమయంలో వ్యవసాయమే దేశానికి దారి 

విపత్తుల సమయంలో వ్యవసాయమే దేశానికి దారి 
  • మన ఎకానమీకి ఎవుసమే ఇరుసు

దేశ ఆర్థిక వ్యవస్థకు ఇరుసులా పనిచేసేది వ్యవసాయ రంగమే. గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభించి.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించిన సమయంలో అందరినీ ఆదుకుంది ఈ రంగమే. దేశ ఆర్థిక పరిస్థితి గాడి తప్పకుండా చూసి.. ప్రజలు తిండి లేక అలమటించకుండా అండగా నిలిచింది అన్నదాతలే. తాజాగా మరోసారి కరోనా కేసులు పెరుగుతూ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మరోసారి అందరికీ అండగా నిలబడేందుకు వ్యవసాయ రంగం సిద్ధంగా ఉంది. ఇంత కీలకమైన ఈ రంగాన్ని కేంద్రం మరింత బలోపేతం చేస్తే ఎలాంటి విపత్తులు ఎదురైన సమయంలోనైనా అది దేశానికి దారి చూపుతుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఉత్పాదక రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండే రంగం వ్యవసాయమే. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ఎగుడు దిగుడులను సరి చూసే వ్యవస్థ వ్యవసాయ రంగమే. మనదేశంలో 79 శాతం మంది చిన్న సన్నకారు రైతులే. వీరందరూ చిన్న చిన్న కమతాలలో వ్యవసాయం చేసి పొట్ట పోసుకోవడమే కాకుండా, దేశ ప్రజలకు తిండి పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు ఇరుసులా పని చేసే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు సాగును వదిలిపెట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా జీవనోపాధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది భవిష్యత్​లో దేశాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది. 
కొత్త చట్టాలపై ఆందోళనలు 
మూడు కొత్త చట్టాలతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. అయితే ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% కలిపి మద్దతు ధరలు అందించాలన్న డాక్టర్ స్వామినాథన్ సిఫార్సు ఎన్నో ఏండ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. కొన్నేండ్లుగా రైతులకు మద్దతుధర అందించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్​లో అరకొరగా కేటాయించినా వాటిని ఖర్చు చేయకపోవడంతో రైతులకు సరైన లబ్ధి చేకూరడం లేదు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెటింగ్ రంగంలో దళారులను అనుమతించవద్దని దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం తొమ్మిదిసార్లు రైతులతో చర్చలు జరిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాగు చట్టాలను అమలు చేయబోమని ప్రకటించింది. చర్చలు జరిపేటప్పుడు గిట్టుబాటు ధర అంశమే కాకుండా కరెంటు ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు హామీ ఇవ్వడం లేదన్న విషయాన్ని రైతులు గుర్తుచేస్తున్నారు. అయితే రైతు డిమాండ్లను కొంత మేరకైనా ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో రైతుల సగటు వార్షిక ఆదాయం ఐదు వేల రూపాయలు కూడా లేదు. 
ప్రైవేటు రుణాలే ఆధారం
గత 30 ఏండ్ల కాలంలో ఉత్పత్తి వ్యయాలు విపరీతంగా పెరిగాయి. రైతులకు వచ్చే ఆదాయం కన్నా ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న కూలీల కొరత వల్ల అధిక మొత్తంలో కూలి చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు పంట వేసినప్పుడు ఉన్న ధర.. కోసేటప్పుడు ఉండటం లేదు. ప్రభుత్వం బ్యాంకుల నుంచి రైతులకు సరైన సమయంలో లోన్లు ఇప్పించలేకపోవడం వల్ల చాలా మంది రైతులు తమకు అందుబాటులో ఉన్న ప్రైవేటు రుణాలు తీసుకుంటున్నారు. అధిక వడ్డీకి అప్పులు చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక తెచ్చిన పెట్టుబడి తీర్చలేకపోతున్నారు. అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో కూడా ఆధునిక విధానాలను అందుబాటులోనికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఇందుకు కావలసిన వనరులు, సూచనలు, సలహాలు ప్రభుత్వం తరపు నుంచి రైతుకు క్షేత్ర స్థాయిలో అందడం లేదు. భారీ పెట్టుబడులు పెట్టలేక, ఆధునిక వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేయలేక, సంప్రదాయ విధానంతోనే ఎక్కువ శాతం రైతులు పంటలు పండిస్తున్నారు. 
పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులు
ఎరువులు, పురుగుమందులు ఎక్కువగా వినియోగించడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి. అయితే రైతు దగ్గర తగినంత ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి ఇన్ స్టంట్​ రుణాలు తీసుకుంటున్నారు. కానీ, ఆరు నెలల తర్వాత పండించిన పంటను అమ్ముకోవడం రైతుకు కత్తి మీద సాములా మారింది. దేశ అవసరాలు తీర్చేలా రైతులు పంటలు పండిస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక, దళారులతో కూడిన మార్కెటింగ్ వ్యవస్థను ప్రభుత్వాలు నియంత్రించ లేకపోవడం వల్ల దోపిడీకి గురవుతున్నారు. ధాన్యం, ఏ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకుందామని మార్కెట్‌కు వస్తే రోజుల తరబడి అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పండించిన పంటకు సరైన ధర రాక పోవడం వల్ల రవాణా ఖర్చులు కూడా మిగలడం లేదు. ఇవన్నీ భరించలేక కొందరు రైతులు పంటలకు నిప్పు పెట్టడమో.. లేక తమకు తామే నిప్పు పెట్టుకోవడమో చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో వేసిన పంట అనావృష్టి, అతివృష్టి, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతోంది. అప్పటికీ రైతులకు పంట నష్ట పరిహారం అందించేందుకు సరైన ప్రణాళికలు లేవనే చెప్పాలి. 
70 శాతం మందికి బ్యాంకు రుణాలు అందట్లే
ఈసారి బడ్జెట్​లో సాగు రంగానికి రూ.1.31 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో కిసాన్ స్కీమ్​ కింద అధికభాగం కేటాయించారు. వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యాన్ని రూ.16 లక్షల కోట్లకు పెంచారు. దేశంలో సంస్థాగత లోన్లను అందుకుంటున్న రైతులు 30 శాతం లోపే. దేశంలోని పలు రాష్ట్రాల్లో 50 శాతానికి మించి సొంత భూమి ఉన్న సాగుదారులు సేద్యం చేయడం లేదు. వీటిని సాగు చేస్తున్న కౌలుదారులకు పంట రుణాలు అందడం లేదు. దేశంలో బ్యాంకులు అందించే మొత్తం రుణాల్లో 18% సాగు రంగానికి ఇవ్వాలని రెండు దశాబ్దాల కిందే రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించినా.. ఏ బ్యాంకు ఆచరించడం లేదు. దీంతో అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి కల్లాల్లోని పంటను అప్పుడున్న ధరకే అమ్మాల్సి వస్తోంది. ఇలా అరకొర ఆదాయం పొందుతున్న 70 శాతం వరకు రైతులకు పంట రుణమే అందని దుస్థితి కొనసాగుతోంది. దీని వల్లే మైక్రో ఫైనాన్స్​ కంపెనీలు, వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తెచ్చుకుంటున్నారు. ఇలా తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. దీంతో అసలు, వడ్డీ తీరక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 
మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఇప్పటికైనా వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. వ్యవసాయ రంగానికి అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించాలి. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించాలి. ఈ బాధ్యతల నుంచి వైదొలిగినా లేదా సరైన విధంగా నిర్వర్తించ లేకపోయినా వ్యవసాయ కుటుంబాలకు కనీస జీవనాధారం లేకుండా పోతుంది. వ్యవసాయ రంగానికి మేలు చేయడం అంటే బడ్జెట్లో భారీ  కేటాయింపులు చేయడం ఒక్కటే కాదు.. రైతులు వ్యవసాయ రంగంలో నిలదొక్కుకునే విధంగా వ్యవసాయ సంస్కరణలు తేవడం కూడా. ఏది ఏమైనా దేశ ఆర్థిక వ్యవస్థకు ఇరుసులా ఉపయోగపడుతున్న వ్యవసాయ రంగాన్ని భవిష్యత్ తరాలకు ఆహారాన్ని అందించే పరిశ్రమ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇందుకు కావలసిన ప్రణాళికలు, సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన చేపట్టాలి. అప్పుడే రైతుకు ప్రభుత్వం నుంచి సరైన న్యాయం జరుగుతుంది.

వలస కూలీలకు ఉపాధి చూపుతోంది
కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడుతోంది. ఆర్థిక మాంద్యం పెరిగిపోయి.. జనాలు కష్టాలు పడుతున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలు తలకిందులు అయిపోయాయి. పావర్టీ లైన్​కు దిగువన ఉన్న లక్షలాది కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి.. రోడ్డునపడ్డారు. మొత్తం కార్మికుల్లో 60 శాతం మంది బజారులో పడ్డారు. 35 శాతం సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమలు శాశ్వతంగా మూతబడ్డాయి. ఈ ఆర్థిక భారం దేశ ప్రజలందరికీ కలవరపరిచే విషయమే. లాక్​డౌన్​ సమయంలో సొంతూర్లకు లక్షలాది మంది వలస కూలీలు తిరిగి వెళ్లారు. వీరందరికీ ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే.