గుజరాత్ పోల్స్ : కాంగ్రెస్లో 10సార్లు గెలిచి.. బీజేపీలో చేరాడు

గుజరాత్ పోల్స్ :    కాంగ్రెస్లో 10సార్లు గెలిచి.. బీజేపీలో చేరాడు

గుజరాత్ లో  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఏకంగా 10సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత మోహన్ సింహ్ రాథ్వా (78) పార్టీకి రాజీనామా చేశారు.  తన రాజీనామా లేఖను గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ జగదీశ్ ఠాకూర్ కు పంపించారు. వెంటనే ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం గుజరాత్ లోని ఛోటా ఉదయ్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి మోహన్ సింహ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రంలోని గిరిజన వర్గంలో మోహన్ సింహ్ కు మంచి పేరుంది.

ఈసారి జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయనని, కొడుకు రాజేంద్ర సింహ్ రాథ్వా ను తన స్థానంలో నిలబెడతానని ఇటీవల మోహన్ సింహ్ ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. కుమారుడు రాజేంద్రకు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినందు వల్లే మోహన్ సింహ్ రాజీనామా చేశారని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ‘‘ గిరిజన ప్రాంతాల్లో మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరాలని నేను నిర్ణయించుకున్నా’’ అని మోహన్ సింహ్ స్పష్టం చేశారు. 

డిసెంబరు 1, 5 తేదీల్లో..

గుజరాత్ లో డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబరు 8న కౌంటింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 182 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశలో 89 స్థానాలకు డిసెంబర్ 1న, రెండో దశలో 93 స్థానాలకు 5న ఎన్నికలు జరపనున్నారు. అంతకుముందు 2017 ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి వరుసగా ఆరో సారి గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 77 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీకి 49 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు పడ్డాయి.