ఏమిరా మీ కక్కుర్తి: కాక్‌పిట్‌‌ను ఓయో రూమ్‌గా మార్చేసిన ఎయిర్ ఇండియా పైలట్లు

ఏమిరా మీ కక్కుర్తి: కాక్‌పిట్‌‌ను ఓయో రూమ్‌గా మార్చేసిన ఎయిర్ ఇండియా పైలట్లు

కాక్‌పిట్‌‌లోకి అనధికారిక మహిళలు ప్రవేశిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా నెలరోజుల క్రితం స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి అనుమతించిన పైలట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్‌ ఇండియా సంస్థకు డీజీసీఏ  రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. అయినప్పటికీ.. నెల రోజుల తర్వాత మ‌ళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. 

స్నేహితురాలితో సంభాషించడానికి సమయం లేదనుకున్న ఫైలెట్లు ఆమెను కాక్ పిట్‌లోకి ఆహ్వానించారు. ఈ ఘటన గత వారం ఢిల్లీ నుంచి లేహ్(ఏఐ-445)కి ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. ఈ విషయంపై క్యాబిన్ సిబ్బంది ఎయిర్ ఇండియా యాజమాన్యానికి పిర్యాదు చేయడంతో.. వారు పైలట్, కో పైలట్‌పై చర్యలు తీసుకున్నారు. వారిని విధుల‌కు దూరంగా ఉంచారు.   

"ఏఐ-445 విమాన పైలట్ మహిళా స్నేహితురాలు నిబంధనలు పాటించకుండా కాక్ పిట్‌లోకి ప్రవేశించిందని, ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు పైలట్లను సంస్థ విధుల‌కు దూరంగా ఉంచింద‌ని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 

ఈ ఘటనపై డీజీసీఏ స్పందిస్తూ.. 'ఈ విషయం డీజీసీఏకు తెలుసనీ, విధివిధానాలకు అనుగుణంగా ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. దర్యాప్తు కోసం ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థ ఓ కమిటీని ఏర్పాటు చేసిందని ఓ అధికారి మీడియాకు తెలిపారు. దీనిపై ఎయిర్ ఇండియా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.