ఫ్లైట్ ఎకానమీ క్లాస్​లో స్లీపింగ్ బెడ్స్

ఫ్లైట్ ఎకానమీ క్లాస్​లో స్లీపింగ్ బెడ్స్

ఫ్లైట్​లో ఇప్పటి  వరకు ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్​లకే పరిమితమైన స్లీపింగ్ బెడ్స్ ఎకానమీ క్లాస్​లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం న్యూజిలాండ్​కు చెందిన ఎయిర్ లైన్ కంపెనీ ‘ఎయిర్ న్యూజిలాండ్’… ‘ఎకానమీ స్కైనెస్ట్’ ప్రాజెక్టును చేపట్టింది. ఎకానమీ క్లాస్​లో కస్టమర్లు రిలాక్స్​డ్​​గా ప్రయాణించేందుకు గాను ప్రోటోటైప్ స్లీప్ పాడ్స్​ను రూపొందించింది. దాదాపు మూడేళ్లు దీనిపై రీసెర్చ్ చేసింది. 200 మంది ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో కంపెనీ తాజాగా పేటెంట్, ట్రేడ్ మార్క్ కోసం అప్లై చేసుకుంది. ఎకానమీ క్యాబిన్​లో ఉండే ఈ స్కై నెస్ట్​లో ఆరు ఫుల్ లెన్త్ స్లీప్ పాడ్స్ ఉంటాయని కంపెనీ తెలిపింది. 200 సెంటీమీటర్ల పొడవు, 58 సెంటీమీటర్ల వెడల్పుండే ఒక్కో పాడ్ (బెడ్)తో పిల్లో, బెడ్ షిట్, బ్లాంకెట్ వస్తాయని చెప్పింది. ప్రైవసీ కర్టెన్స్ ఉంటాయని, రీడింగ్ లైట్స్, యూఎస్​బీ అవుట్ లెట్స్ లాంటి మరిన్ని సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. అయితే ఫ్లైట్ లో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. ఫ్లైట్​లోని ఎకానమీ క్లాస్​లో ఎక్కువ దూరం ప్రయాణించడం ట్రావెలర్లకు కష్టంగా ఉంటోందని, దీనికి పరిష్కారమే ఎకానమీ స్కైనెస్ట్ అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

2021 లో తుది నిర్ణయం…

ఈ ఏడాది అక్టోబర్​లో ఆక్లాండ్ – న్యూయార్క్ విమాన సర్వీసులను కంపెనీ ప్రారంభించనుంది. ఇది ప్రపంచంలోనే అతి దూర ప్రయాణాల్లో ఒకటి. ఫ్లైట్ ఆక్లాండ్ నుంచి న్యూయార్క్​కు వెళ్లేందుకు 17 గంటల 40 నిమిషాలు పడుతుందని అంచనా. తొలుత స్కైనెస్ట్​ను ఈ ఫ్లైట్లలో ప్రవేశపెట్టి పరిశీలించాలని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎకానమీ క్లాస్​లో స్కైనెస్ట్​ను ప్రవేశపెట్టడంపై కంపెనీ 2021లో తుది నిర్ణయం తీసుకోనుంది. ఒక్కో ఫ్లైట్​లో ఆరు పాడ్స్ మాత్రమే అందుబాటులో ఉంచుతామని చెప్పిన కంపెనీ, ధరపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ‘‘ఎక్కువ దూరం ప్రయాణించే ఎకానమీ క్లాస్ కస్టమర్లు… స్కైనెస్ట్ కే మొగ్గు చూపుతారని మేం భావిస్తున్నాం. ఎందుకంటే ఇందులో రిలాక్స్​డ్​గా జర్నీ చేయొచ్చు” అని కంపెనీ జనరల్ మేనేజర్ నిక్కీ తెలిపారు. ఎకానమీ క్లాస్ ప్రయాణికుల కోసం ఈ కంపెనీ 2011లో ‘‘ఎకానమీ స్కైకౌచ్’’ను ప్రవేశపెట్టింది. ఇందులో జర్నీ చేసే ప్రయాణికులు తమ సీట్లను బెడ్స్​గా మార్చుకోవచ్చు.