పాపం : ఉగ్రవాది అనుకొని ప్రయాణికుణ్ని చితకబాదిన రైల్వే పోలీసులు

పాపం : ఉగ్రవాది అనుకొని ప్రయాణికుణ్ని చితకబాదిన రైల్వే పోలీసులు

ఒక్కోసారి మన టైం ఎంత బాగున్నా మనం చేయని తప్పులకు మనమే తన్నులు తినాల్సి వస్తుందని అంటున్నాడు ముంబైకి చెందిన గణేష్ షిండే.

ఓ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం చేస్తున్న గణేష్ షిండే మహరాష్ట్ర లో జల్గాన్ లో తన ఫ్రెండ్ వివాహానికి వెళ్లి తిరిగి ముంబైకి వస్తుండగా రైల్వే పోలీసులు, తోటి ప్రయాణికులతో తన్నులు తిన్నాడు. ఎందుకంటారా..?

గణేష్  జల్గాన్ లోని కందేష్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ జనరల్ భోగీ ఎక్కాడు. అదే భోగీలో గణేష్ కు శంకర్ అనే ప్రయాణికుడు పరిచయం అయ్యాడు. పరిచయంతో భోగీ డోర్ దగ్గర కూర్చున్న శంకర్ ను సెల్ ఫోన్ ఛార్జర్ ఇవ్వమని కోరాడు. అదే సమయంలో గణేష్..శంకర్ కు శరీరంలో ఫ్యాట్ ను తగ్గించే బాంబ్ రెసిపీ ఎలా చేయాలో నేర్పిస్తానని చెప్పాడు. ఆ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగా..రైల్వే టీసీ టికెట్ చూపించండి అంటూ హుకుం జారీ చేశాడు. టీసీ ఆదేశాలతో ట్రైన్ టికెట్ ను చూపించేందుకు గణేష్ సూట్ కేసును ఓపెన్ చేయబోయాడు. అయితే గణేష్ సూట్ కేసు పై బాంబ్ అనే ట్యాగ్ ఉండడం తో టెర్రరిస్ట్ అనుకొని తోటి ప్రయాణికులు, టీసీ గణేష్ పై ముప్పేట దాడి చేశారు. గణేష్ సూట్ కేసులో బాంబ్ ఉందంటూ గుజరాత్ లోని బార్డోలి రైల్వే స్టేషన్ లో ట్రైన్ ను ఆపేసి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ప్రయాణికుల సమాచారంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు డాగ్ స్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. గణేష్ ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.

విచారణలో తాను ముంబై లో ఉంటున్నట్లు మహరాష్ట్రలో  స్నేహితుడు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నట్లు పోలీసులకు చెప్పాడు. సూట్ కేస్ పై బాంబ్  ట్యాగ్ ఎందుకు ఉందో రైల్వే పోలీసులకు వివరణిచ్చాడు. తాను ఓ ఎయిర్ పోర్ట్ లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నానని, ఎయిర్ పోర్ట్ ఉద్యోగులకు గుర్తుగా సామాన్లకు ట్యాగ్ తగిలిస్తారని పోలీసులకు చెప్పాడు. ట్యాగ్ లో “బాంబే” అని కాకుండా “బాం” అని మెన్షన్ చేశారని వాపోయాడు. అందుకు ఆధారాల్ని చూపించే ప్రయత్నం చేశాడు.

అయితే గణేష్ అరెస్ట్ తో మహరాష్ట్రలో ఉంటున్న అతడి తల్లిదండ్రులు సూరత్ రైల్వే స్టేషన్ పోలీసుల్ని ఆశ్రయించారు. గణేష్ తన కుమారుడేనని, ఓ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం చేస్తున్నాడంటూ పలు ఆధారాలు చూపించడంతో పోలీసులు తరువాత రోజు విడుదల చేశారు.