తెలంగాణ వంటకాలతో సంబురంగా అలయ్ బలయ్

తెలంగాణ వంటకాలతో సంబురంగా అలయ్ బలయ్

ఏటా దసరా తర్వాత నిర్వహించే ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఈసారి కూడా ఘనంగా జరిగింది. హైదరాబాద్​లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బిడ్డ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ వంటకాలతో ఏర్పాటు చేసిన విందుకు సుమారు 12 వేల మంది హాజరయ్యారు. గవర్నర్ దత్తాత్రేయ స్వయంగా ఒగ్గు డోలు కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు.

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెబుతూ ఏటా దసరా తర్వాత నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం ఈసారి కూడా ఘనంగా జరిగింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బిడ్డ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పలువురు గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు సహా వేలాది మంది హాజరయ్యారు. కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేలాది మంది తెలంగాణ వంటకాలను రుచిచూశారు. అలయ్ బలయ్ లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మీనాక్షి లేఖి, రావు సాహెబ్ పాటిల్ దన్వే, మురళిధరన్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మిజోరం గవర్నర్ హరిబాబు, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్, జార్ఖండ్ గవర్నర్ రాధాకిషన్, ఎంపీలు కే కేశవరావు, లక్ష్మణ్, సినీ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ర్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, రాపోలు ఆనందభాస్కర్, బూర నర్సయ్య గౌడ్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ప్రజా గాయకురాలు విమలక్కతో పాటు అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై దత్తాత్రేయ మనుమరాళ్లు పాడిన పాట ఆకట్టుకుంది. అలయ్ బలయ్ సందర్భంగా రాష్ర్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు నృత్యాలను ప్రదర్శించారు. వివిధ వేషధారణలతో డోలు కళకారులు, డప్పు, సన్నాయితో ప్రదర్శనలు ఇచ్చారు. గవర్నర్ దత్తాత్రేయ స్వయంగా ఒగ్గు డోలు కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు.    

12 వేల మందికి విందు: బండారు విజయలక్ష్మి   

అలయ్ బలయ్ సందర్భంగా తెలంగాణ వంటకాలతో సుమారు12 వేల మందికి విందు ఏర్పాట్లు చేసినట్లు ఫౌండేషన్ చైర్మన్, దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమం కోసం మూడు నెలల నుంచి పని చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బోటి, రొయ్యలు, తలకాయ కూర, పాయ, రాగి సంకటి, లివర్, సకినాలు, కారపూస, అరిసెలు, బిర్యానీ, చేపలు, జోన్న రొట్టెల వంటి తెలంగాణ వంటలను రుచిచూపించామన్నారు.  

పార్టీలకు, మతాలకు అతీతం: కె. లక్ష్మణ్ 

రాజకీయ పార్టీలకు, మతాలకు అతీతంగా అం దరినీ ఒకే వేదిక మీదకు తెచ్చి అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎంపీ కె. లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ కార్యక్రమం అందరినీ ఏకం చేసిందన్నారు. నిత్యం ఎన్నో విమర్శలు చేసుకునే నేతలంతా అలయ్ బలయ్ కు వచ్చి అప్యాయంగా పలకరించుకుంటారన్నారు.

అందరినీ ఒకే వేదికపైకి తెచ్చారు: 
కేంద్ర మంత్రి మురళీధరన్

అలయ్ బలయ్ కార్యక్రమానికి రావటం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి మురళీధరన్ అన్నారు. రాష్ర్ట ప్రజలకు దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా, అన్ని వర్గాల వారిని ఒకే వేదిక మీదకు దత్తాత్రేయ తీసుకువస్తున్నారని ప్రశంసించారు.  

అలయ్ బలయ్​తోనే 
దసరా ముగింపు: కిషన్ రెడ్డి   
  
గత 17 ఏండ్లుగా దసరా తర్వాత అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో అలయ్ బలయ్ లేకుండా దసరా పూర్తికాదన్నారు. ఏటా తెలంగాణ సంస్కృతిని చాటిచెప్తూ, వంట కాలను రుచిచూపించడం గొప్ప విష యమని దత్తాత్రేయను కొనియాడారు.