హాంకాంగ్​ ప్రైమరీ లిస్టింగ్​ వైపు అలీబాబా అడుగులు

హాంకాంగ్​ ప్రైమరీ లిస్టింగ్​ వైపు అలీబాబా అడుగులు

హాంకాంగ్ ​: ప్రపంచంలోనే అతి పెద్ద ఈ–కామర్స్​ కంపెనీగా పేరొందిన అలీబాబా హాంకాంగ్​ స్టాక్​ ఎక్స్చేంజీలో ప్రైమరీ లిస్టింగ్​ పొందాలని చూస్తోంది.  చైనా ఇన్వెస్టర్లకు మరింత అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే షేర్ల లిస్టింగ్​ స్టేటస్​ను మార్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. టెక్​ కంపెనీలు తమ సంపదను పబ్లిక్​తో పంచుకోవాలని చైనా ప్రభుత్వం ఇటీవల కాలంలో కొంత ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలోనే అలీబాబా తాజా నిర్ణయం తీసుకుంది. 2022 చివరికి హాంకాంగ్​ ఎక్స్చేంజ్​లో ప్రైమరీ లిస్టింగ్​ పూర్తవుతుందని అంచనా. ఇప్పటికే అలీబాబా షేర్లు న్యూయార్క్​ స్టాక్​ ఎక్స్చేంజీలో ప్రైమరీ స్టేటస్​తో ట్రేడవుతున్నాయి. తాజా నిర్ణయంతో రెండు ఎక్స్చేంజీలలోనూ ప్రైమరీ స్టేటస్​తో ట్రేడయ్యే కంపెనీగా అలీబాబా మారుతుంది.

ఇన్వెస్టర్ బేస్​ పెంచుకునే క్రమంలోనే మరో ఎక్స్చేంజీని వెతకడం మొదలు పెట్టినట్లు అలీబాబా సీఈఓ డేనియల్​ ఝాంగ్​ చెప్పారు.  హాంకాంగ్​ కూడా న్యూయార్క్​లాగే పెద్ద ఫైనాన్షియల్​ సెంటర్​ కావడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చైనా ఎకానమీ, భవిష్యత్​ పట్ల తమకు నమ్మకం ఉందని, కంపెనీ గ్లోబలైజేషన్​ స్ట్రాటజీకి హాంకాంగ్​ లిస్టింగ్​ సాయపడుతుందని పేర్కొన్నారు. తాజా చొరవ వల్ల లక్షలాది మంది చైనీయులు కంపెనీ ఇన్వెస్టర్లుగా మారడం ఈజీ అవుతుందని వివరించారు. ఆడిటింగ్​ రూల్స్​ను పూర్తి స్థాయిలో పాటించకపోతే చైనా కంపెనీలకు డీ లిస్టింగ్​ తప్పదని అమెరికా రెగ్యులేటర్లు గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.