విడాకులకు దారితీసిన భార్య స్నానం గొడవ 

విడాకులకు దారితీసిన  భార్య స్నానం గొడవ 

లక్నో: కొందరు చిన్న విషయాలకే విడాకులు తీసుకునే  భార్యాభార్తలను చూస్తూనే ఉంటాం. ఉత్తరప్రదేశ్ లో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. భార్య రోజూ స్నానం చేయడం లేదన్న కారణంతో భర్త విడాకులు కోరాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌ , క్వార్సీ గ్రామానికి చెందిన ముస్లిం మహిళకు, చందౌస్ గ్రామానికి చెందిన ముస్లిం వ్యక్తితో రెండేండ్ల కిందట పెండ్లి జరిగింది. వారికి ఒక సంతానం. అయితే భార్య ప్రతి రోజూ స్నానం చేయకపోవడంతో భర్త కోపగించుకునేవాడు. ఈ విషయంపై వారిద్దరూ ప్రతి రోజూ వాదులాడుకునేవారు. దీంతో విసుగు చెందిన భర్త, భార్యకు విడాకులు ఇచ్చేందుకు మూడు సార్లు తలాక్‌ చెప్పాడు. దీంతో ఆ భార్య అలీఘడ్‌ మహిళా రక్షణ సెల్‌ ను ఆశ్రయించిగా.. అధికారులు వారిద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తమ వివాహ బంధం కొనసాగాలని భార్య కోరగా, భర్త మాత్రం విడాకుల కోసం పట్టుబడ్డాడు.

తన భార్య ప్రతి రోజు స్నానం చేయదని, ఈ విషయంపై తమ ఇద్దరి మధ్య రోజూ గొడవ జరుగుతుందని, దీన్ని తాను భరించలేకపోతున్నట్లు అతడు చెప్పాడు. తమకు విడాకులు మంజూరు చేయాలంటూ ఒక దరఖాస్తును కూడా వారికి అందజేశాడు. అయితే.. సమస్య చిన్నది కావడంతో భార్యాభర్తలకు కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మహిళా రక్షణ సెల్‌ కౌన్సిలర్ తెలిపారు. ఇది గృహహింస చట్టం కిందకు రానందున విడాకుల పరిధిలోకి రాదని చెప్పారు. తమ వివాహ బంధాన్ని కాపాడుకునేందుకు భార్యాభర్తలు ఆలోచించుకోవాలని చెప్పామని, దీనికి కొంత గడువు ఇచ్చినట్లు వివరించారు. ఈ దంపతుల సమస్యలను కౌన్సిలింగ్‌ సహాయంతో పరిష్కరిస్తామని కౌన్సిలర్ తెలిపారు.