రాజ్యాంగం అంటే కేసీఆర్​కు లెక్కలేదు

రాజ్యాంగం అంటే కేసీఆర్​కు లెక్కలేదు

ఖైరతాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలనే సీఎం సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అఖిలపక్ష నేతలు మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయన నిరంకుశ పాలన అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్​అయ్యారు. తెలంగాణ కోసం ఉద్యమించినట్లే కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వివిధ పార్టీలు, సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ, కేసీఆర్​వ్యాఖ్యలపై పలువురు నేతలు మాట్లాడారు. టీజేఎస్​అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యక్తులకు, పార్టీలకు నిరసన తెలిపే అవకాశం లేకుండాపోయిందన్నారు. కేసీఆర్ ఎన్నికల వరకే ప్రజలకు స్వేచ్ఛ ఇస్తున్నారని, ఆ తర్వాత అణచి వేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక ఉద్యమకారుడు జేబీ రాజు మాట్లాడుతూ..  కేసీఆర్ లాంటి నియంతను దించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం అని, మార్చాలనుకుంటే రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలను మార్చాలని సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. అందరూ ఒక్క తాటిపైకి వచ్చి రాజ్యాంగ పరిరక్షణ కోసం పని చేయాలన్నారు. 

చరిత్రను మరుగున పడేసేందుకే: సంజయ్
అంబేద్కర్ చరిత్రను కనుమరుగు చేసేందుకే రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ ​కుట్ర పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్ మండి పడ్డారు. దళితులు అంటే కేసీఆర్ కు కోపమని, అందుకే వారిని మోసం చేస్తున్నారన్నారు.‘‘ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, మంద కృష్ణ, కోదండరాం లాంటి వాళ్లు ఎక్కడ ఉన్నారు? సీఎం ఫ్యామిలీ ఎక్కడ ఉంది”అని ప్రశ్నించారు.

కేసీఆర్​ను మార్చాలె: అద్దంకి దయాకర్
మర్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు, కేసీఆర్​ను అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ దొరల తెలంగాణ, భూస్వాముల తెలంగాణ కావాలనుకుంటున్నారని, అది సాధ్యం కాదన్నారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్, మహిళలకు ప్రత్యేక అవకాశాల కోసం రాజ్యాంగాన్ని సవరణ చేయాలని అంటే ప్రజలు హర్షించేవారన్నారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి 
బెల్లయ్య నాయక్​ అన్నారు. 

ఒక్క ముక్క కూడా మార్చలేరు: హరగోపాల్​
ప్రభుత్వానికి అధికారాలు, ప్రజలకు హక్కులు ఇచ్చింది రాజ్యాంగమేనని ప్రొఫెసర్ హరగోపాల్ గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ప్రజల్ని ముట్టుకున్నట్టే అని, రాజ్యాంగంలో ఉన్న ఒక్క ముక్క మార్చడం కూడా కేసీఆర్​వల్ల కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుందోన్నారు. కేసీఆర్ అహంకార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఖండిస్తూ.. అందరం కలిసి రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ముందుకు రావాలన్నారు.కేసీఆర్ కు దళితులు, అంబేద్కర్ పై తీవ్ర కోపం ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ బానిసలు ఒక వైపు, రాజ్యాంగాన్నికాపాడుకునేవారు మరో వైపు   ఉన్నారన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ లో యుద్ధ భేరి సభ పెడతామన్నారు.  

మరిన్ని వార్తల కోసం..

 

ఎస్టీ కమిషన్ ఇంకెప్పుడు ?

మార్చురీలను మోడర్నైజ్​ చేస్తం