
వికారాబాద్, వెలుగు: త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ కోరారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ, వీడియో వింగ్ తదితర ఎన్నికల నిర్వహణ కమిటీలకు ప్రత్యేక అధికారులను నియమించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ 8416-2 35291 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు సుధీర్, లింగ్యానాయక్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీపీవో జయసుధ పాల్గొన్నారు.