ఖమ్మం పార్లమెంట్ స్థానంపై పార్టీల ఫోకస్​

ఖమ్మం పార్లమెంట్ స్థానంపై పార్టీల ఫోకస్​
  • సిట్టింగ్​ ఎంపీకే సీటును కన్ఫామ్​ చేసిన బీఆర్ఎస్​ 
  • ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకున్న కాంగ్రెస్​
  • ఖమ్మం నుంచి హైదరాబాద్​ వరకు మల్లు నందిని భారీ ర్యాలీ
  • బీజేపీ టికెట్ కోసం పోటీపడుతున్న పలువురు నేతలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం పార్లమెంట్ స్థానంపై అన్ని పార్టీలు ఫోకస్​ పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల పోరులోనూ బీఆర్ఎస్​, మిగిలిన పార్టీల కంటే ఒక అడుగు ముందే ఉంది. ఖమ్మం స్థానానికి పోటీ చేయబోయే అభ్యర్థిని ముందుగానే ప్రకటించింది. సిట్టింగ్​ ఎంపీనే మరోసారి బరిలోకి దిగుతారని ప్రకటించడంతో ఆయా సెగ్మెంట్లలోని అసెంబ్లీ స్థానాల వారీగా కేడర్​ను సమాయత్తం చేయడంపై దృష్టిపెట్టింది. 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీ టికెట్ కోసం ఇప్పటికే ఆశావహులంతా దరఖాస్తులు సమర్పించారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్న స్థానాల్లో ఖమ్మం కూడా ఉంది. ఈజీగా గెలిచే అవకాశమున్న సీటు కావడంతో లీడర్లంతా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. బీజేపీలోనూ టికెట్ కోసం పోటీ  పడుతున్నవారి సంఖ్య పెద్దదిగానే ఉంది. 

కాంగ్రెస్​ లోనే ఎక్కువ హడావుడి.. 

ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్​ లోనే ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన నాయకులు చాలా మంది ఎంపీ టికెట్ పై కన్నేశారు. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరితో పాటు ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. చాలా మంది సీనియర్​ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు కూడా రేసులో ఉన్నారు. 

రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని శనివారం ఖమ్మం నుంచి హైదరాబాద్​ వరకు భారీగా కార్లతో ర్యాలీగా వెళ్లి దరఖాస్తు సమర్పించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్​ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్​ కూడా టికెట్​ కోసం అప్లై చేసుకున్నారు. 

మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పీసీసీరాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్​రెడ్డి, పీసీసీ సభ్యుడు నాగ సీతారాములు, వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్రప్రసాద్​, మరికొంత మంది టికెట్​ ను ఆశిస్తున్నారు. ఇక తప్పకుండా కాంగ్రెస్​ కు విజయావకాశాలు ఉన్న నేపథ్యంలో స్థానిక నేతల మధ్య విభేదాలకు తావులేకుండా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా ఖమ్మం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. 

రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్​ కు మధ్య ఏకంగా 2.63 లక్షల ఓట్లు తేడా ఉండడం, ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు కాంగ్రెస్​ గెల్చుకోవడం, మరో స్థానంలో కాంగ్రెస్​ బలపరిచిన సీపీఐ విజయం సాధించడంతో కాంగ్రెస్​ లీడర్లకు ఈ సీటు హాట్ సీట్ గా మారింది. 

బీఆర్ఎస్​ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా 

ఖమ్మం బీఆర్ఎస్​ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలోకి దిగుతారని ఆ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే ఎన్నికలకు కేడర్​ ను సమాయత్తం చేసేలా ముఖ్యనేతల పర్యటనలను కూడా ప్లాన్​ చేసింది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ముఖ్య నేతలు, బూత్ లెవల్​ లీడర్లతో మీటింగ్ లు పెట్టాలని నిర్ణయించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ ఆదివారం ఖమ్మం, వైరా అసెంబ్లీ పరిధిలో మీటింగ్ లకు వస్తారని ముందుగా ప్రకటించినా, ఆ తర్వాత వాయిదా పడింది. వచ్చే వారం కేటీఆర్​ టూర్​ ఫిక్స్​ అయ్యే చాన్స్​ ఉంది.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశతో ఉన్న కేడర్​ ను ఉత్సాహంగా మార్చడంతో పాటు, గెలుపు ధీమా తీసుకువచ్చేలా కేటీఆర్​ పర్యటన ఉంటుందని బీఆర్ఎస్​ లీడర్లు చెబుతున్నారు. 

బీజేపీ నుంచి ముఖ్య నేతల పోటీ.. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరపున పోటీకి ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. ఎంపీ ఎన్నికల ఖమ్మం ఇన్​చార్జిగా పొంగులేటి సుధాకర్​ రెడ్డిని నియమించడంతో ఆయన పోటీ చేస్తారన్న ప్రచారముంది. ఆయన బరిలో ఉండకుంటే తనకు అవకాశం ఇవ్వాలని కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​ రెడ్డి అధిష్టానాన్ని కోరుతున్నారు. ఖమ్మంలో ప్రముఖ డాక్టర్​ గోంగూర వెంకటేశ్వర్లు(జీవీ) కూడా రీసెంట్ గా కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డిని కలిసి తనకు టికెట్​ ఇవ్వాలని కోరారు. 

గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన దేవకి వాసుదేవరావుతో పాటు మరికొందరు కూడా బీజేపీ టికెట్​ ను ఆశిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీతో పొత్తు కారణంగా అప్పటి వరకు బీజేపీ టికెట్​ ను ఆశించిన చాలా మంది సీటును కోల్పోయారు. అప్పటి నుంచి నిరుత్సాహంతో ఉన్న కేడర్​ లో మళ్లీ ఉత్సాహం రావాలంటే తప్పకుండా మొదటి నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న బీజేపీ నిజమైన కార్యకర్తకే పార్లమెంట్ టికెట్​ ఇవ్వాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.