మొక్కలు నాటకుండానే బిల్లులు డ్రా చేసిన్రు

మొక్కలు నాటకుండానే బిల్లులు డ్రా చేసిన్రు

మిర్యాలగూడ, వెలుగు : మొక్కలు నాటకుండానే బిల్లులను డ్రా చేసి మున్సిపాలిటీ గ్రీన్ బడ్జెట్ నిధులను అధికారులు దుర్వినియోగం చేశారని మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగర్ భార్గవ్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించాలని కోరారు. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ నుంచి ఖలీల్ దాబా వరకు అవెన్యూ ప్లాంటేషన్ పనులను చేసేందుకు 2023 సెప్టెంబర్ 4న రూ.70 లక్షల ఎస్టిమేషన్ తో టెండర్లను పిలిచారని తెలిపారు. 

అయితే 90 రోజుల్లో ఆ పనులు చేపట్టకపోవడంతో అప్పటి ఆఫీసర్లు బిల్లులు చేయలేదని పేర్కొన్నారు. ఇటీవల విధుల్లో చేరిన మున్సిపల్ కమిషనర్ తోపాటు ఇంజినీరింగ్​అధికారులు అవెన్యూ ప్లాంటేషన్ కు సంబంధించిన బిల్లులను ఓకే చేసి కాంట్రాక్టర్ కు చెక్కును అందజేశారని ఆరోపించారు. అసంపూర్తి అవెన్యూ ప్లాంటేషన్ పనులకు బిల్లులు ఎలా చేశారని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే విజిలెన్స్ డిపార్ట్ మెంట్ ను స్పందించి అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ ​చేశారు.