ఈ ఇంజనీర్‌‌..లక్ష మొక్కలు నాటిండు..

ఈ ఇంజనీర్‌‌..లక్ష మొక్కలు నాటిండు..

ఇంజనీరింగ్‌‌ చదివాడు.. కానీ, పర్యావరణమన్నా, మొక్కలు పెంచడమన్నా  అమరేష్ సమంత్‌‌కు ప్రాణం. అందుకే ఉద్యోగం చేస్తూనే వీకెండ్స్‌‌లో మొక్కలు పెంచుతున్నాడు. ఒడిశా వ్యాప్తంగా ఇప్పటికి లక్ష మొక్కలు నాటి 20 మిని అడవులను సృష్టించాడు. వరదలు, నేలకోత (సాయిల్‌‌ ఎరోజన్‌‌) ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేస్తున్నాడు. తనతో పాటు మరో 100 మంది యువకులను వాలంటీర్లుగా చేర్చుకుని పర్యావరణాన్ని కాపాడుతున్నాడు. 

ఒడిశాలోని ప్రతాప్‌‌ జిల్లా బిస్వాలీ గ్రామం వాడు అమరేశ్‌‌ సమంత్‌‌ జగత్‌‌సింగ్‌‌పూర్‌‌‌‌ జిల్లాలోని పారాదీప్‌‌ పోర్ట్‌‌లో ఎలక్ట్రికల్‌‌ ఇంజినీర్‌‌‌‌. చిన్నతనం నుంచి కోస్టల్‌‌ ఏరియాలో పెరిగాడు. వరదల వల్ల తలెత్తే ఇబ్బందులను అనుభవించాడు. పర్యావరణంలో వస్తున్న మార్పులే వాటికి కారణమని తెలుసుకుని తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. వీకెండ్స్‌‌లో మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. అంతేకాదు వరదలు, సాయిల్‌‌ ఎరోజన్‌‌ వల్ల కలిగే ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తున్నాడు. దీని కోసం ‘బాబా బలుంకేశ్వర్‌‌‌‌ గ్రామ్య పరిషత్‌‌’ అనే ఎన్జీవోను స్థాపించి మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. ఎన్జీవోలో దాదాపు 100 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఒడిశాలోని లున్‌‌కులా, కేందారపూర్‌‌‌‌, గదారోమిత, బిశ్వాలీ, మహాకలపాద, అపైనా, ప్రదీప్‌‌ఘర్‌‌‌‌ తదితర గ్రామాల్లో దాదాపు లక్ష మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ 20 మినీ అడవులను పెంచాడు.

“ ఒడిశాకి ఏడాదికి కనీసం రెండు సైక్లోన్లు వస్తాయి. రీసెంట్‌‌గా వచ్చిన ఫనీ, అంఫా, ఫయాన్‌‌ సైక్లోన్ల వల్ల జనం బాగా ఇబ్బందులు పడ్డారు. చాలా గ్రామాల్లో చెట్లను కూడా నరికేశారు. నేచురల్‌‌ డిజాస్టర్స్‌‌ చెట్లు లేకపోవడం వల్లే జరుగుతున్నాయని నా ఫీలింగ్‌‌. అందుకే మొక్కలు నాటడం మొదలుపెట్టాను. మొదట్లో కోస్టల్‌‌ ఏరియాలో మొక్కలు నాటేవాళ్లం. వరదలు వస్తే అవి  కుప్పకూలేవి. అందుకే రోడ్‌‌ సైడ్‌‌, గ్రామాల్లోని కొన్ని ఏరియాల్లో నాటుతున్నాం.
చాలామంది గ్రామాల వాళ్లు మొదట్లో మా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూశారు. కానీ, ఇప్పుడు వేరే గ్రామాలవాళ్లు కూడా ముందుకు వస్తున్నారు” అని అమరేశ్‌‌ చెప్పారు.

పిడుగులను ఆపేందుకు

గ్రామాల్లో పిడుగుల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు దాదాపు 300 తాటి చెట్లను నాటినట్లు ఎన్జీవోలోని సభ్యుడు సుఖ్‌‌దేవ్‌‌ తరేయి చెప్పాడు. తాటిచెట్లు ఎత్తుగా ఉండడం వల్ల పిడుగు దాని మీదే పడుతుంది. అందుకే సాధ్యమైనన్ని తాటిచెట్లు నాటాం. వాటితో పాటు మేం తయారు చేసిన అడవుల్లో పక్షుల కోసం మట్టికుండలు పెట్టి వాటిలో గింజలు వేసి, నీళ్లు ఉంచుతాం. ఇప్పుడింక పండ్ల చెట్లు నాటాలని ప్లాన్‌‌ చేసుకుంటున్నాం” అంటున్నాడు సుఖ్‌‌దేవ్‌‌.