అంబర్పేట్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలను సృష్టిస్తున్న ఓ నెట్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగ్ అంబర్పేట్లోని శివం రోడ్డులో కటికే ప్రవీణ్ కుమార్ (35) శ్రీ బాలాజీ బిజినెస్ సొల్యూషన్ పేరుతో నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
ఇక్కడ ఆధార్ కార్డుల్లోని పేర్లు, ఫొటోలను మార్చి నకిలీ కార్డులను తయారు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్, అంబర్పేట్ పోలీసులు గురువారం ఈ సెంటర్ పై దాడి చేసి ప్రవీణ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించారు.

