అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: 40 రోజుల యుద్ధంలో అమెరికా అభాసుపాలు..!

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: 40 రోజుల యుద్ధంలో అమెరికా అభాసుపాలు..!

న్యూఢిల్లీ: ఇరాన్‎పై 40 రోజుల పాటు యుద్ధం చేసినప్పటికీ అంతర్జాతీయ వేదికలపై అమెరికా అభాసుపాలయ్యింది. ఇరాన్‎లో పాలన మార్పును సాధించడంలో లేదా ప్రధాన వివాదాలను పరిష్కరించడంలో విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘర్షణ కాల్పుల విరమణ, చర్చల ప్రక్రియతో ముగిసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని ‘సంపూర్ణ విజయం’గా ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయి వాస్తవాలు మరో కథను చెబుతున్నాయి. 

అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి సైనిక చర్యలో ఇరాన్ సుప్రీం లీడర్​అయతుల్లా అలీ ఖమేనీ సహా అగ్రశ్రేణి నాయకత్వాన్ని తుడిచిపెట్టగలిగింది. కానీ ఆ దేశంలో పాలన మార్పు తీసుకురావాలన్న అమెరికా ప్రయత్నం మాత్రం ఫలించలేదు. మరోవైపు, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం, హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడం ద్వారా ఇరాన్ ఈ దాడులను దీటుగా ఎదుర్కొంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు భారీ అంతరాయం ఏర్పడింది. 

ఫిబ్రవరి 28న ట్రంప్ ప్రారంభించిన దాడిలో తొలుత విజయం లభించినప్పటికీ, ఆ తర్వాత అమెరికా తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయింది. 40 రోజుల బాంబు దాడుల తర్వాత కూడా ఇరాన్‌‌ను సైనికంగా నిర్వీర్యం చేయడం సాధ్యం కాలేదు. అదేసమయంలో డ్రోన్ దాడుల ద్వారా పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలను ఇరాన్ ఇబ్బంది పెడుతూనే ఉంది. అమెరికాతో పోలిస్తే  ఇరాన్ పోరాట విధానం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా ఈ యుద్ధం నిరూపించింది. 

ఫలితంగా ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షలు, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో ఇరాన్​ను లొంగదీసుకోవాలన్న ట్రంప్ ప్రయత్నాలు విఫలమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వారాల తరబడి దాడులు చేసినా, అమెరికా నిర్ణయాత్మకమైన దెబ్బ కొట్టలేకపోయింది. చివరికి, యుద్ధ క్షేత్రంలో లభించిన విజయం కంటే దౌత్య చర్చల ద్వారానే ప్రస్తుతం పోరాటం ఆగింది. చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.