వలస పక్షులకి కేరాఫ్​ అమీన్ పూర్ చెరువు

వలస పక్షులకి కేరాఫ్​ అమీన్ పూర్ చెరువు

చెట్ల కొమ్మలు, చెరువు గట్ల మీద పక్షుల్ని చూసినా, వాటి సవ్వడుల్ని విన్నా మనసుకి తెలియని హాయి కలుగుతుంది. అందుకనే చాలామంది వీకెండ్​లో పక్షుల్ని చూసేందుకు జూ పార్క్​ లేదా బర్డ్ శాంక్చురీలకి వెళ్తుంటారు. అక్కడ నీళ్ల మీద ఎగురుతున్న రంగురంగుల పక్షుల్ని చూస్తూ, వాటి ఫొటోలు తీస్తూ  మురిసిపోతారు. అలాగే హైదరాబాద్​కు దగ్గర్లో ఉన్న అమీన్​పూర్ చెరువు వీకెండ్​ టూర్​కి బాగుంటుంది. సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ ప్లేస్​కి వెళ్తే  పొలాలు, చెరువు గట్ల పొంటి పక్షుల గుంపుని చూస్తూ పెరిగిన చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి.   

మనరాష్ట్రంలో ఇక్రిశాట్​ క్యాంపస్ తర్వాత  రకరకాల పక్షులు ఎక్కువగా కనిపించే ప్లేస్​ అమీన్​పూర్ చెరువు.  ఈ ప్రాంతాన్ని 2016లో ‘బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్’​గా  గుర్తించారు. విశేషం ఏంటంటే... మనదేశంలో మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్​ సైట్​ ఇదే. ఈ చెరువుని మూడొందల ఏండ్ల కిందట పంటపొలాలు, గార్డెన్లకు నీళ్లు ఇచ్చేందుకు తవ్వించారు. అంత పెద్ద అమీన్​పూర్​ చెరువు ఇప్పుడు  ఐదు చిన్న చెరువులుగా అయింది. 

వలస పక్షులకి కేరాఫ్​

జూలై నుంచి అక్టోబర్ నెలల మధ్య వలస పక్షులతో ఎంతో సందడిగా ఉంటుంది ఈ చెరువు. తలమీద నల్లని గీతలు ఉండే బాతులు, ఫ్లెమింగో, పెలికాన్, కింగ్​ఫిషర్ వంటి పక్షుల్ని చూసేందుకు చాలామంది వెళ్తుంటారు. బర్డ్ లవర్స్, నేచర్ ఫొటోగ్రాఫర్స్ వాటి  ఫొటోలు తీసేందుకు పోటీపడుతుంటారు. ఆవాసం ఏర్పాటు చేసుకున్న పక్షులతో పాటు వలస పక్షులు కలిపి దాదాపు 171 రకాల పక్షులు ఉంటాయి ఈ చెరువులో. ఇక్కడ రంగురంగుల సీతాకోకచిలుకల్ని చూస్తుంటే మైమరచిపోవాల్సిందే. అయితే... దాదాపు వంద ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువులో కొంత భాగం ఆక్రమణకు గురైంది. దగ్గర్లోని ఇండ్లు, ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు వచ్చి చేరడంతో ఈ చెరువు కలుషితం అవుతోంది. చేపలు  తగ్గిపోవడంతో వాటిని తిని బతికే పక్షులు ఇప్పుడు రావట్లేదు. అందుకని ఈ చెరువుని శుభ్రం చేసి, మళ్లీ వలస పక్షులకి కేరాఫ్​గా మార్చే ప్రయత్నం చేస్తోంది గవర్నమెంట్.