నెహ్రూ తప్పు వల్లే పీఓకే

నెహ్రూ తప్పు వల్లే పీఓకే

    పటేల్‌‌ జోక్యముంటే కాశ్మీర్‌‌లో సమస్యే ఉండేది కాదు

    స్పెషల్​ స్టేటస్​ అడ్డుపెట్టుకుని కాశ్మీర్​లో అవినీతి రాజ్యం

    కేంద్ర నిధులను ఈజీగా లూటీ చేశారు..

    రద్దుతో పని పూర్తికాలేదు.. అభివృద్ధి దిశగా నడిపించాలి

    కార్యకర్తలకు షా దిశానిర్దేశం

    ఆర్టికల్ 370 రద్దు అంశంపై ముంబైలో సెమినార్

‘‘మాజీ ప్రధాని జవహర్​లాల్​నెహ్రూ తప్పు వల్లే పాక్​ఆక్రమిత కాశ్మీర్​(పీఓకే) ఉనికిలోకి వచ్చింది. ఆనాడు అనవసరంగా పాకిస్తాన్​తో కాల్పుల విరమణను నెహ్రూ ప్రకటించి ఉండకపోతే.. పీఓకే అనేదే ఉండేది కాదు. కాశ్మీర్ అంశాన్ని నెహ్రూకు బదులుగా తొలి హోం మంత్రి సర్దార్​వల్లభాయ్ పటేల్​ టేకప్ ​చేసి ఉండాల్సింది” అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకాశ్మీర్​కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఆదివారం ముంబైలో జరిగిన ఓ సెమినార్​లో మాట్లాడారు. ‘‘ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటివరకు కాశ్మీర్​లో ఒక్క బుల్లెట్​కూడా కాల్చలేదు. కాశ్మీర్​లో ఇప్పుడు కల్లోలం లేదు, అశాంతి లేదు. త్వరలోనే టెర్రరిజం కూడా అంతమవుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

వారికి చలిలోనూ చమటలు పడుతున్నాయి..

‘కాశ్మీర్​లో పాలన సాగించిన 3 కుటుంబాలు.. ఆర్టికల్ 370 సాకు చూపుతూ ఏసీబీని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం చల్లటి వాతావరణం ఉన్నా కూడా.. అవినీతి చేసిన వారందరికీ చమటలు పడుతున్నాయి” అని విమర్శించారు. ‘‘స్పెషల్​ స్టేటస్​ను రద్దు చేయడంతోనే మన పని పూర్తి కాలేదు. అసలు పని ఇప్పుడే మొదలైంది. నేషనలిజం, ప్రోగ్రెస్​అనే అంశాల ఆధారంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే మన లక్ష్యం” అని బీజేపీ కార్యకర్తలకు ​షా పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్, ఎన్సీపీలు సిగ్గులేకుండా వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘రాహుల్​గాంధీ, శరద్​పవార్​ఒక విషయం ప్రజలకు చెప్పాలి. ఇంతకీ వారు ఆర్టికల్​370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా?” అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధిస్తుందని, ఫడ్నవీస్​ మరోసారి సీఎం అవుతారన్నారు.

రాహుల్.. నిన్న లేక మొన్న వచ్చారు

‘‘ఆర్టికల్ 370 అనేది పొలిటికల్​ అంశం అని రాహుల్​గాంధీ అంటున్నారు. రాహుల్​బాబా గారు.. మీరు రాజకీయాల్లోకి ఇప్పుడొచ్చారు. కానీ బీజేపీకి చెందిన మూడు తరాలు కాశ్మీర్​కోసం, ఆర్టికల్​370 రద్దు కోసం తమ జీవితాలను అర్పించాయి. ఇది మాకు పొలిటికల్​ మ్యాటర్​కాదు. భారత మాతను విభజించకుండా ఉండాలన్న మా లక్ష్యంలో ఒక భాగం’’ అని షా విమర్శించారు.

బంగారంతో ఇళ్లు కట్టుకునేటోళ్లు

‘‘జమ్మూకాశ్మీర్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.2.27 లక్షల కోట్లను ఆ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. నిజానికి ఆ నిధులు ప్రజల వరకు చేరాయా? ప్రజలకు అంది ఉంటే.. వాళ్ల ఇంటికి బంగారు పైకప్పులను ఏర్పాటు చేసుకునేటోళ్లు” అని అమిత్ షా అన్నారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసమే ఆర్టికల్​370ని రద్దు చేశామన్నారు. ‘‘ఆర్టికల్​370 వల్ల కాశ్మీర్​లో యాంటీ కరప్షన్​ బ్యూరోను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. దీంతో అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించే నిధులను కొందరు ఈజీగా లూటీ చేసేవారు. నిజానికి ఆర్టికల్​370ని కాశ్మీర్​కల్చర్​ను ప్రొటెక్ట్​ చేసేందుకు కాదు.. తమ అవినీతి బయటపడకుండా ఉండేందుకు రాజకీయ నాయకులు వాడుకున్నారు”  అని మండిపడ్డారు.