
హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఊరికి అవతల ఉన్న పాటిగడ్డ (పాతఊరి దిబ్బ)పై శాతవాహన, శాతవాహన పూర్వయుగాల నాటి టెర్రకోట వస్తు శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. వీటి ఆధారంగా చేర్యాలలో 2 వేల ఏళ్ల నాటికే గొప్ప నాగరిక సమాజం, అప్పటి ప్రజల నివాసాలు ఉండేవని తెలుస్తోందని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు.
తెలంగాణలో అన్వేషించాల్సి ఉన్న శాతవాహన ప్రదేశాల్లో చేర్యాల ఒకటని, ఇక్కడ తవ్వకాలు జరిపితే కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. చేర్యాలలో లభించిన శిల్పాల్లో తలపై కిరీటం, చెవులకు కుండలాలు, దండరెట్టలకు అలంకారాలతో ఉన్న బౌద్ధహారీతి టెర్రకోట శిల్పం, ఉన్ని దారం తీసే పనిముట్టు, వెండి, బంగారం, రాగి లోహాలు కరిగించే మూస, సాంభ్రాణి, అగరుధూపం వేసే మట్టిపాత్ర, ఎరుపు రంగు కోటింగ్ వేసిన వెడల్పైన పాత్ర, టెర్రకోట మట్టిపూసలు ఉన్నాయి.