ఎందరో లీడర్లకు రాజకీయ గురువు ఈయన

ఎందరో లీడర్లకు రాజకీయ గురువు ఈయన

తొలి తెలంగాణా ఉద్యమానికి అనంతుల మదన్​మోహన్​ మూల స్తంభం లాంటివారు. అప్పటికాయన   లాయర్​గా ప్రాక్టీస్ చేస్తూనే రాజకీయాల్ని అధ్యయనం చేస్తుండేవారు. ఆంధ్రప్రదేశ్​ ఏర్పడిననాటి నుంచే తెలంగాణతో చేసుకున్న ఒప్పందాలు తుంగలో తొక్కపడి తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురవడం మొదలయింది. తెలంగాణ ప్రజలు నిరసన తెలియజేయడం మొదలు పెట్టారు. 1968 జూలై 10 న ‘తెలంగాణ రక్షణాల దినం’గా పాటించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ పవర్ స్టేషనులో ఉద్యోగాల్లో ఎక్కువమంది ఆంధ్రోళ్లనే తీసుకోవడాన్ని ఇల్లందుకు చెందిన రామదాసు బయటపెట్టాడు. దీనికి ఫలితంగా రామదాసుపై అక్రమ కేసులు పెట్టి హింసించింది ప్రభుత్వం. 1969 జనవరి 9 న రవీంద్రనాథ్ అనే విద్యార్థి ఖమ్మములోని గాంధీ చౌక్ వద్ద నిరసన నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. .జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఏర్పడింది. మెడికల్ విద్యార్థి మల్లికార్జున్ (తర్వాత కాలంలో పీసీసీ ప్రెసిడెంట్) విద్యార్థి జేఏసీ జనరల్​ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మేధావులు , యువకులు, సామాజిక కార్యకర్తలతో బషీర్‌‌ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) ఏర్పడింది. యువకుడు, విద్యావంతుడు ,మేధావి , న్యాయవాది ఐన అనంతుల మదన్ మోహన్ టీపీఎస్​కి వ్యవస్థాపక అధ్యక్షుడైనాడు.

హైదరాబాదులోని రెడ్డి హాస్టలులో జరిగిన టీపీఎస్ సమావేశానికి సదాలక్ష్మి అధ్యక్షత వహించారు. ఏప్రిల్ 11 లోపు తెలంగాణ రాష్ట్రాన్నివ్వాలని కేంద్రాన్ని కోరింది. ఏప్రిల్ 5 న సికింద్రాబాదులో రాష్ట్ర సమైక్యతని కోరుకుంటూనే తెలంగాణకి రక్షణాలు ఇవ్వాలని బహిరంగ సభ నడిపిన కమ్యూనిస్టులకి తెలంగాణ వాదులకి (టీపీఎస్) మద్య గొడవ జరిగింది. లాఠీచార్జీ జరిగింది. మదన్ మోహన్ మల్లిఖార్జున్ లని పీడీ యాక్ట్ కింద అరెష్ట్ చేసిండ్రు.తెలంగాణవాదుల అరెష్ట్ లకి నిరసనగా ఏప్రిల్ 11 న హైదారాబాద్ లో సామూహిక సత్యాగ్రహం జరిగింది. ఈ సత్యాగ్రహములో పాల్గొన్నందుకు తెలంగాణ శాసన సభ్యులైన అచ్యుత రెడ్డి ,అంజయ్య , మాణిక్ రావు, హాషీము లని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. కొండా లక్ష్మన్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో దూకిండు. తెలంగాణ లొల్లి డిల్లీ కి చేరింది. ఇందిరాగాందీ మర్రి చెన్నారెడ్డి , నూకల రాంచంద్రారెడ్డి , కొండా లక్ష్మణ్ బాపూజీ జువ్వాడి చొక్కారావు తదితర ప్రధాన నాయకులతో సమావేశం ఏర్పాటు చేసింది. అరెస్టయిన తెలంగాణవాదులు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఇందిరా గాంధీ కాంగ్రెస్ నాయకులతో చర్చించి 1969 ఏప్రిల్ 12 న అష్టసూత్ర పథకం ప్రకటించింది. ఇది తెలంగాణవాదులని సంతృప్తిపరుచలేదు. ఈ చర్చలలో పాల్గొన్న నాయకులు తమ అసంతృప్తిని తెలియజేసిండ్రు. తెలంగాణలో నిరసనలు కొనసాగినయి. ఇందిరాగాంధి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్ ) నాయకులతో చర్చలకి ఆహ్వానించింది. వాళ్ళు చర్చలకు ఇష్టపడలేదు. తిరస్కరించారు.

అప్పటికి ఎమ్మెల్యేగా నెగ్గిన మర్రి చెన్నారెడ్డిపై ఆరేండ్ల పాటు హైకోర్ట్ నిషేధం విధించడంతో ఉద్యమానికి దూరంగా ఉన్న చెన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణని సమర్థించారు. తెలంగాణ ప్రజా సమితి ఉద్యమాన్ని మదన్​మోహన్​ సమర్థవంతంగా నడిపించారు. అయితే, చెన్నారెడ్డి వ్యూహం ఫలితంగా మదన్ మోహన్ టీపీఎస్ పగ్గాలు వదులుకున్నడు.  1969 మే 25 న నాగర్ కర్నూల్​లో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ వాదులని రెచ్చకొట్టేలా  మాట్లాడడంతో ఘర్షణ మొదలైంది. అప్పుడు జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిండ్రు.  తెలంగాణ అంతటా ఎక్కడికక్కడ నిరసనలు కాల్పులు. తెలంగాణ మొత్తం అగ్నిగుండం అయ్యింది. దాదాపు వివిధ సంఘటనల్లో కలిపి 369 మంది కాల్పులకి గురై చనిపోయిండ్రు .

టీపీఎస్​ మొదటి ఎమ్మెల్యే

1970 లో సిద్దిపేట ఎమ్మెల్యే బీవీ రాజు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడంతో  తెలంగాణ ప్రజా సమితి సంస్థ తరపున ఇండిపెండెంట్​గా మదన్ మోహన్ 20 వేల మెజారిటీతో గెలిచారు.  1971 లోక్ సభ మధ్యంతర ఎన్నికలు రావడంతో చెన్నారెడ్డి టీపీఎస్​ని రాజకీయ పార్టీగా మార్చారు.  ఆ ఎన్నికలలో టీపీఎస్​ 10 సీట్లు గెల్చుకుంది. అయితే,  తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్​లో విలీనమయింది. చెన్నారెడ్డికి అవకాశము లేకపోవడముతో బ్రహ్మానందరెడ్డిని దించేసి పీవీ నరసింహారావుని ముఖ్యమంత్రిని చేశారు.

మదన్ మోహన్ 1971 నుండి 1985 పద్నాలుగేళ్లు వరుసగా సిద్దిపేట నుండి గెలుస్తూ ఆరోగ్య శాఖ , మైన్స్ అండ్ జియాలజీ , న్యాయ శాఖ, వాణిజ్యా శాఖ ,సాంకేతిక విద్యా శాఖ మరియు రెవెన్యూ మంత్రిత్వ శాఖలని పీ.వీ. నరసింహా రావు , చెన్నా రెడ్డి , భవనం వెంకట్రామ్ ,టీ. అంజయ్య మరియు కోట్ల విజయభాస్కర్ రెడ్డీల కాలములో నిర్వహించారు. ఆయన కాలంలోనే  జేఎన్టీయూ హైదరాబాద్​లో స్థాపించబడింది. ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ మినిస్టర్​గా కొద్ది కాలమే పనిచేసినా దాదాపు 12 వేల మందిని ఆయన వివిధ శాఖల్లో ఉద్యోగస్తులుగా రిక్రూట్​ చేసినట్లు సిద్ధిపేట ప్రాంత వాసులు చెప్పుకుంటారు. ఆయన సిగరెట్ డబ్బాలపై రాసిస్తే అనేక మంది ఉద్యోగాల్లో చేరిపోయారని  ఈ ప్రాంతంలో ఒక నానుడి.

విజయభాస్కర్ రెడ్డి కేబినెట్​లో మదన్​మోహన్​ ఆరోగ్య మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆయన దగ్గర డిప్యూటీ మంత్రి. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మదన్​మోహనే.  1982లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు రాజకీయ గురువైన మదన్ మోహన్​పైనే పోటీ చేసి 730 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల సభలోనే ఇందిరా గాంధీ మదన్ మోహన్ నాకు కొడుకు లాంటి వాడని చెప్పింది.

 (ఈవాళ అనంతుల మదన్ మోహన్ వర్ధంతి) ‑ వెంకటకిషన్ శాక్య,ఆదిలాబాద్

​1973లో పీ.వీ. నరసింహారావు తర్వాత మదన్ మోహన్ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో జలగం వెంగళరావు సీఎం అయ్యారు. కేసీఆర్ , నంది ఎల్లయ్య, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ తదితరులు మదన్ మోహన్ శిష్యులే.  మదన్ మోహన్ గారు నవంబర్ 1, 2004 న హైదరాబాద్లో మరణించారు. 1969 ప్రత్యేక తెలాంగాణ పోరాటం 369 మంది యువకులు ప్రాణాలు కోల్పోయి మిగిలిన వారు భారత దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగేలా పునాదినిచ్చిన ఒక మహోజ్వల పోరాటం. అదొక భవిష్యత్తు కొనసాగింపుకి పనిచేసింది.  అదొక ద్రోహ చరిత్ర కాదు. ఆ చరిత్రని మనం విపులంగా చదువుకోవాలి. 

ananthula Madan Mohan death anniversary today: special story