Viral : యాంకరింగ్‌లో 'సిండికేట్'పై ఉదయభాను సంచలన కామెంట్స్..

Viral : యాంకరింగ్‌లో 'సిండికేట్'పై ఉదయభాను సంచలన కామెంట్స్..

తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు తిరుగులేని యాంకర్, తనదైన స్టైల్, గ్లామర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన పేరు ఉదయభాను. ఒక దశలో ఆమె లేకుండా ఏ పెద్ద ఈవెంట్ లేదా టీవీ షో లేదంటే అతిశయోక్తి కాదు.  ఏ టీవీ షో చూసినా, ఏ పెద్ద ఈవెంట్‌కు వెళ్లినా ఆమె గొంతు, హడావుడే కనిపించేవి. తన గ్లామర్, వాక్చాతుర్యంతో లక్షలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.  అలాంటి ఉదయభాను ఇప్పుడు యాంకరింగ్ వృత్తిలో నెలకొన్న 'సిండికేట్' పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  భవిష్యత్తులో తాను ఈవెంట్లు చేస్తానో లేదో అనే ఆమె వ్యాఖ్యలు బుల్లితెర వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.  ఇది కేవలం ఆమె వ్యక్తిగత ఆవేదన మాత్రమే కాదు, పరిశ్రమలోని అంతర్గత సమస్యలను బయటపెట్టేలా ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నా కెరీర్‌నుఉద్దేశపూర్వకంగా తొక్కేశారు.. 
బుల్లితెరపై సెటిల్ అవ్వకముందు సినిమాల్లోనూ నటించారు. టాలీవుడ్‌లో తిరుగులేని యాంకర్‌గా వెలుగొందిన ఆమె, అనూహ్యంగా తెరపై కనుమరుగవడం అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సుదీర్ఘ విరామం తర్వాత, గతేడాది ఒక సభలో తన కెరీర్‌ను కొందరు ఉద్దేశపూర్వకంగా తొక్కేశారని ఉదయభాను భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. టీవీలో కనిపించి ఐదేళ్లు అయిందని, అయినా అలుపెరగని ప్రయత్నాలు చేయడం వల్లే తాను ఇంకా నిలబడగలిగానని ఆమె పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో నుంచి తనను ఎవరూ తుడిపేయలేరని ఆమె ఆనాడు ధీమా వ్యక్తం చేశారు.  ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే ఉదయభాను చేయడంతో చర్చనీయాంశమైంది.

మళ్లీ చేస్తానన్న గ్యారెంటీ లేదు..
సుహాస్ హీరోగా నటించిన 'ఓ భామ అయ్యో రామ' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు విజయ్ కనకమేడల ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. మైక్ అందుకుని మాట్లాడుతూ, "చాలారోజుల తర్వాత ఉదయభాను మళ్లీ ఈవెంట్స్ చేస్తున్నారు. థాంక్యూ" అన్నారు. వెంటనే ఉదయభాను కలగజేసుకుంటూ.. "ఇదొక్కటే చేశానండి. మళ్లీ చేస్తానన్న గ్యారెంటీ లేదు. రేపే ఈవెంట్ ఉంది, చేయాలనుకుంటాం. కానీ, ఆ రోజు వచ్చాక ఆ ఈవెంట్ మన చేతిలో ఉండదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది" అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

 

 కావాలనే టీవీ పరిశ్రమ నుంచి దూరం చేశారా?
"నా మనసులో ఉన్న నిజమే చెప్పాను. సుహాస్ మా బంగారం కాబట్టి చేయగలిగాను" అని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉదయభానుకు యాంకరింగ్ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఆమెకు ఈవెంట్లు ఇవ్వడం లేదా? ఆమె వరకు అవకాశాలు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారా? అనే చర్చ నెటిజన్ల మధ్య మొదలైంది. 'సిండికేట్' అన్నంత పెద్ద పదం వాడిందంటే, ఉదయభానును కావాలనే టీవీ పరిశ్రమ నుంచి దూరం చేశారని ఆమె అభిమానులు బలంగా అభిప్రాయపడుతున్నారు.

►ALSO READ | Shruti Haasan : 'పెళ్లంటే భయం.. కానీ అమ్మ అవ్వాలని ఆశ' : శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

ఉదయభాను చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు టెలివిజన్ పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెట్టాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతిభకు కాకుండా, కేవలం కొన్ని గ్రూపులు లేదా వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగానే అవకాశాలు లభిస్తున్నాయనే ఆమె ఆవేదన యాంకరింగ్ రంగంలో నెలకొన్న పక్షపాతాన్ని స్పష్టం చేస్తుందంటున్నారు. ఒకప్పుడు తనదైన శైలితో, ఎలాంటి అడ్డంకులు లేకుండా రాణించిన ఉదయభాను వంటి సీనియర్ యాంకర్లు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందంటే, ఈ రంగంలో కొత్తగా ప్రవేశించాలనుకునేవారికి ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చంటున్నారు నెటిజన్లు.