తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన అంగన్​వాడీల ఆందోళన

తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన అంగన్​వాడీల ఆందోళన
  • కలెక్టరేట్ ఎదుట పోలీసులతో తోపులాట
  •  స్పృహ కోల్పోయిన కార్యకర్త
  •  మహిళా ఎస్ఐ జుట్టు పట్టి లాగిన్రు
  • పలువురిని అరెస్ట్​ చేసిన పోలీసులు

ఆదిలాబాద్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అంగన్​వాడీలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్​వాడీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. ఓ కార్యకర్త స్పృహ కోల్పోవడంతో ఆమెను రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. 

Also Read : ఉద్యమకారుల్ని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్​ది: అర్వింద్

తోపులాటలో పలువురు అంగన్​వాడీ ఉద్యోగులు మహిళా ఎస్సై జుట్టు పట్టుకొని లాక్కెళ్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అంగన్​వాడీ ఉద్యోగులను, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మగ పోలీసులతో అడ్డుకున్నరు..

తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే కావా లనే మగ పోలీసులతో తమను అడ్డుకున్నారంటూ అంగన్​వాడీ ఉద్యోగులు మండిపడ్డారు. తమ చీరలు, జాకెట్లు పట్టుకొని లాగారని, పోలీసులే తమపై దాడిచేశారంటూ అంగన్​వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ఆరోపించారు.

చిన్న సమస్యలుంటే పరిష్కరించేందుకు సిద్ధం : మంత్రి సత్యవతి  రాథోడ్​

కొన్ని యూనియన్లు తప్పుదోవ పట్టించడం వల్లే అంగన్‌‌వాడీలు సమ్మె చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌‌ ఆరోపించారు. వెంటనే సమ్మె విరమించాలని బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సమ్మెతో బలహీనవర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు