
హైదరాబాద్, వెలుగు: అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్పవర్, భూటాన్‌లోని గ్రీన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (జీడీఎల్) దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం వాణిజ్య నిబంధనల పత్రంపై సంతకం చేసింది.
దీని ప్రకారం రెండు సంస్థలు కలిసి భూటాన్‌లోని అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌ను 50:50 నిష్పత్తిలో అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్ట్ స్థాపిత సామర్థ్యం 500 మెగావాట్లు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను బిల్డ్ -ఓన్ -ఆపరేట్ (బీఓఓ) విధానంలో చేపడతారు. దీనికోసం దాదాపు రూ.రెండు వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. ఇది భూటాన్ సౌర విద్యుత్ రంగంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) అని రిలయన్స్ పవర్ తెలిపింది. కార్యక్రమంలో భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ టోగ్బే, అనిల్అంబానీ పాల్గొన్నారు.