యాదగిరిగుట్టలో మే 22న హనుమాన్ జయంతి మహోత్సవాలు

యాదగిరిగుట్టలో మే 22న  హనుమాన్ జయంతి మహోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : ఈనెల 22న హనుమాన్ జయంతి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆంజనేయస్వామి జయంతి మహోత్సవాలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి కావడంతో ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 22న కొండపై విష్ణుపుష్కరిణి పక్కన ఉన్న హనుమాన్ టెంపుల్ లో జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకటరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతమన్యసూక్త పారాయణాలతో అభిషేకం, లక్ష తమలపాకులతో సహస్ర నామార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

అంజన్నకు వైభవంగా ఆకుపూజ..

యాదగిరిగుట్ట నారసింహుడి క్షేత్రంలో క్షేత్రపాలకుడు హనుమంతుడికి ఆకుపూజను అర్చకులు వైభవంగా నిర్వహించారు. కొండపై విష్ణుపుష్కరిణి పక్కన ఉన్న హనుమాన్ టెంపుల్ లో స్వామివారి మూల విరాట్ ను పవిత్ర జలంతో శుద్ధి చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం సిందూరంతో అందంగా అలంకరించి ప్రత్యేకంగా తెప్పించిన తమలపాకులతో నాగవల్లి దళార్చన చేపట్టారు. అనంతరం అంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించారు.