
హైదరాబాద్, వెలుగు : దశాబ్ద కాలంగా కాంట్రాక్ట్ బేసిస్‌పై పనిచేస్తున్న తమ ఉద్యోగాల ను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ యూరోపి యన్ కమిషన్ ఏఎన్‌ఎంలు డిమాండ్ చేస్తున్నారు. కోఠిలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీసు ఆవరణలో ఏఎన్‌ఎంలు సోమవారం ధర్నా చేశారు. యూరోపియన్ కమిషన్ స్పాన్సర్ చేసిన ఓ కార్యక్రమం కోసం 2003లో కొంత మంది ఏఎన్‌ఎంలను, 2009లో మరికొంత మంది ఏఎన్‌ఎంలను ఆరోగ్యశాఖ రిక్రూట్ చేసుకుంది. అందుకే వీరిని యూరోపియన్ కమిషన్ ఏఎన్‌ఎంలుగా వ్యవహరిస్తారు.
ఆ కార్యక్రమం పూర్తయ్యాక కూడా ప్రభుత్వం వీరిని ఉద్యోగాల్లో కొనసాగించింది. పదేండ్ల నుంచి ప్రభుత్వమే వీరికి జీతాలు చెల్లిస్తోంది. ఇటీవల ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించిన సర్కార్, ఆ లిస్ట్‌లో యూరోపియన్ కమిషన్ ఏఎన్‌ఎంలను చేర్చలేదు. దీంతో తమ ను కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నా రు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసనకు దిగారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసఫ్, అడిషనల్ జనరల్ సెక్రటరీ ఎం.నర్సింహ్మా పాల్గొన్నారు.