ఇదే నా చివరి నిరాహార దీక్ష

ఇదే నా చివరి నిరాహార దీక్ష

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే రైతు సమస్యలపై ఉద్యమిస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన అన్నదాతలకు మద్దతుగా నిలుస్తానని చెప్పారు. రైతుల కోసం తన జీవితంలో ఆఖరి పోరాటానికి సిద్ధమవుతున్నానని, నిరాహార దీక్ష చేయబోతున్నానని తెలిపారు. ఈ మేరకు చివరి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించానని ప్రధాని మోడీకి రాసిన లెటర్‌‌లో హజారే పేర్కొన్నారు.

కొత్త అగ్రి చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా లేవని, ఈ చట్టాలను తీసుకురావడంలో ప్రజలను భాగస్వామ్యం చేయలేదని హజారే విమర్శించారు. ఈ నెల ఆఖరున నిరాహార దీక్షకు సంకల్పించినట్లు తెలిపారు. నిరాహార దీక్షకు అనుమతించాలని కేంద్ర అధికారులకు నాలుగుసార్లు లెటర్ రాశానని, వాళ్ల దగ్గర నుంచి జవాబు రాలేదన్నారు. ‘రైతు సమస్యలపై కేంద్రంతో ఐదుమార్లు సంప్రదించడానికి ప్రయత్నించా. కానీ అటు వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందుకే నా జీవితంలో చివరి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించా’ అని మోడీకి రాసిన లెటర్‌‌లో హజారే పేర్కొన్నారు.