న్యూఢిల్లీ: జపాన్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న 'ఆసియా గేమ్స్ 2026' కోసం భారత మహిళా క్రికెట్ జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. హర్మన్‌ప్రీత్‌కు తోడుగా వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన బాధ్యతలు చేపట్టనున్నారు.
గత ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు.. ఈసారి కూడా అదే జోరుతో పసిడి పతకాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ టోర్నమెంట్ కోసం సెలక్టర్లు అనుభవం, యువ ప్రతిభ కలగలిసిన 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేశారు.
జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలతో పాటు విధ్వంసకర ఓపెనర్ షఫాలీ వర్మ, ఫామ్‌లో ఉన్న జెమిమా రోడ్రిగ్స్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఉన్నారు. వికెట్ కీపర్లుగా రిచా ఘోష్, సి. కమలిని జట్టులో చోటు దక్కించుకున్నారు. మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తూ భారతీ ఫుల్మాలీ, శ్రీ చరణిలను ఎంపిక చేశారు. వీరందరి సమిష్టి ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లకు గట్టి పోటీ ఇవ్వడానికి టీమిండియా సన్నద్ధమవుతోంది.
బౌలర్లు ఎవరెవరంటే..
బౌలింగ్ విభాగంలో భారత్ అత్యంత సమతుల్యంగా కనిపిస్తోంది. పేస్ విభాగాన్ని రేణుకా సింగ్ ఠాకూర్ నడిపించనుండగా.. ఆమెకు తోడుగా క్రాంతి గౌడ్, అరుంధతీ రెడ్డి ఉన్నారు. స్పిన్ విభాగంలో ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు రాధా యాదవ్, నందినీ శర్మలతో పాటు శ్రేయాంక పాటిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆసియా ఖండపు క్రీడా సంబరంలో మరోసారి భారత జెండాను ఎగురవేసి, దేశానికి బంగారు పతకాన్ని అందించడమే లక్ష్యంగా ఈ 15 మంది సభ్యుల హర్మన్‌ప్రీత్ సేన జపాన్‌కు పయనం కానుంది.
