కొండగట్టు టెంపుల్​లో .. మరో రూ.20లక్షల అవినీతి? 

కొండగట్టు టెంపుల్​లో .. మరో రూ.20లక్షల అవినీతి? 
  • ఇటీవల టెండర్ల సొమ్ము రూ.52లక్షలు పక్కదారి పట్టినట్లు ఆడిట్‌‌లో గుర్తింపు 
  • ఇప్పటికే సస్పెండ్‌‌ అయిన ఈవో, సీనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌ 
  • అవినీతి ఆరోపణలపై ఆరేండ్ల రికార్డులను పరిశీలిస్తున్న ఆఫీసర్లు 
  • టెండర్ల సొమ్మును ఆలయ అకౌంట్లలో జమచేయనట్లు అధికారుల గుర్తింపు 

జగిత్యాల/కొండగట్లు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో మరో రూ.20లక్షల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఆలయంలో అవినీతిపై గతంలో ఫిర్యాదులు రాగా ఎండోమెంట్‌‌ అధికారులు ఇటీవల ఆడిట్‌‌ నిర్వహించి రూ.52లక్షలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి సీనియర్​ అసిస్టెంట్‌‌ శ్రీనివాసచారితోపాటు ఈవో వెంకటేశ్‌‌ను సస్పెండ్‌‌ చేశారు.  

కొన్నేండ్లుగా టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయం పక్కదారి పడుతోందని ఆరోపణలున్నాయి. టెండర్‌‌‌‌దారులు చెల్లించిన సొమ్ముకు రిసిప్ట్‌‌లు ఇస్తూ ఆలయ అకౌంట్‌‌లో జమ చేయనట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎండోమెంట్‌‌ అధికారులు ఆరేండ్ల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో సుమారు రూ.కోటికి పైగానే అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ముందస్తు టెండర్లతో అవినీతి బయటకు.. 

ఆలయ పరిధిలోని 13 రకాల షాపులకు ఏటా మార్చిలో ఎండోమెంట్ ఆఫీసర్లు టెండర్ నిర్వహిస్తారు. బిడ్​దక్కించుకున్న నిర్వాహకులు టెండర్‌‌‌‌ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఆలయ అధికారులు రెండు నెలల ముందుగానే 2024- –25 కు సంబంధించిన టెండర్లు పిలిచారు. ఈ మేరకు గతంలో టెండర్లు దక్కించుకున్న నిర్వాహకులు నో డ్యూ సర్టిఫికేట్ కోసం సీనియర్​అసిస్టెంట్ ఇచ్చిన రిసిప్ట్ లతో ఎండోమెంట్ ఈవో కు దరఖాస్తు చేసుకున్నారు.

కాగా ఈ రిసిప్ట్‌‌లు క్యాష్ బుక్ లో నమోదు కాకపోవడం.. ఉన్నతాధికారుల సంతకాలు లేకపోవడంతో టెండర్ సొమ్ము ఆలయ అకౌంట్‌‌లో జమ కానట్లు ఈవో గుర్తించారు. ఇలా కొబ్బరికాయల షాప్ రూ. 31.80 లక్షలు, హోటల్ రూ. 50 వేలు, కిరాణా షాపు రూ.60 వేలు, పూలు పండ్ల షాపు రూ. 3 లక్షలు, సులభ్‌‌ కాంప్లెక్స్ రూ. 2 లక్షలుకు గానూ సదరు సీనియర్ అసిస్టెంట్ రిసిప్ట్ లు ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా రూ. 37.90 లక్షలు పక్కదారి పట్టించినట్లు గుర్తించడంతో గత ఈవో వెంకటేశ్‌‌ ఫిర్యాదు మేరకు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌‌చారిని సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 29న ఉత్తర్వులు జారీ చేశారు. 

మార్చి 19న ఎంక్వైరీ షూరూ

ఎండోమెంట్ ఉన్నతాధికారుల ఆదేశాలతో మార్చి 19న అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి అంజన్న ఆలయంలోని ఎండోమెంట్ ఆఫీసులో రికార్డులు తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో రూ. 37.90 లక్షలతో పాటు మరో రూ. 14  లక్షలు కూడా పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. ఇలా దాదాపు రూ. 52 లక్షల ఆలయ ఆదాయాన్ని సదరు సీనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌ సొంతానికి వాడుకున్నట్లు తేలింది. ఈ అవినీతిని గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈవో వెంకటేశ్‌‌ను కూడా సస్పెండ్​ చేస్తూ మార్చి 23న ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కాగా రెండేండ్ల రికార్డుల్లో అవకతవకలను గుర్తించిన ఆఫీసర్లు.. 2018 నుంచి జరిగిన లావాదేవీలపై దృష్టి సారించారు. ఆ రికార్డులను స్వాధీనం చేసుకుని ఎంక్వైరీ చేపట్టారు. ఈ ఎంక్వేరీ లో తాజాగా మరో రూ. 20 లక్షలు మాయమయ్యాయని ఆఫీసర్లు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా పక్కదారి పట్టిన సొమ్ము సుమారు రూ.కోటిదాకా ఉండే అవకాశం ఉందని ఎండోమెంట్​ ఆఫీసర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అవినీతి బాగోతంలో బదిలీపై వెళ్లిన కీలక ఆఫీసర్‌‌‌‌తోపాటు మరో ఉద్యోగిపై వేటు పడే అవకాశం ఉందని సమాచారం.  

పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాం

టెండర్ల సొమ్ములో జరిగిన గోల్ మాల్ పై పూర్తి విచారణ జరుపుతున్నాం. ఇందుకు భాద్యుడైన సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసచారిని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గత ఏఈవో, సూపరింటెండెంట్‌‌కు మెమో జారీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాఖాపరమైన చర్యలు ఉంటాయి. 

చంద్రశేఖర్, అంజన్న ఆలయ ఈవో