తెలంగాణకి మరో వందే భారత్ రైలు

 తెలంగాణకి మరో వందే భారత్ రైలు
  • ఇయ్యాల వర్చువల్​గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు రానున్నది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే మూడో వందే భారత్ రైలు కాగా.. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండోది. ఇది ఈ నెల13 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. 

దేశవ్యాప్తంగా సుమారు రూ.85 వేల కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వందే భారత్ రైలుతో పాటు 55 వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్స్ ను, మూడు పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్, నాలుగు గూడ్స్ షెడ్స్, ఒక పీఎం జన్ ఔషధి కేంద్రం, రెండు రైల్ కోచ్ రెస్టారెంట్లను మంగళవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కాజీపేట – బల్లార్షా, కాజీపేట – విజయవాడ మధ్యన నిర్మిస్తున్న మూడో లైన్​లో రెండుమార్గాల్లోని, రెండు సెక్షన్లలో పూర్తయిన ట్రాక్​లనూ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు రావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు  ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.