మీ సీఎం పేదలకు పథకాలు అందనీయలే

మీ సీఎం పేదలకు పథకాలు అందనీయలే

విద్వేషపూరిత రాజకీయాలను అంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో డర్టీ పాలిటిక్స్ చేస్తున్న నేతల్ని ఓడించాలన్నారు. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చాలా పథకాలను సీఎం కేజ్రీవాల్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఫైర్ అయ్యారు. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలను అడ్డుకుని, పేదలకు మంచి వైద్యం అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఉంటున్న ఇళ్లు లేని నిరుపేదలను ఏం పాపం చేశారని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అడ్డుకున్నారని మోడీ ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన ఆ పథకాలను అడ్డుకున్న తీరు చూస్తేనే ఆ నేతల మనస్తత్వం, వారి డర్టీ పాలిటిక్స్ అర్థమవుతున్నాయని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ అనుకూల పరిస్థితులను చూసి కొందరు నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారాయన.

ఢిల్లీ దశను మార్చే ప్రభుత్వం కావాలని, బ్లేమ్ గేమ్‌లతో కాలం గడిపే రాజకీయాలు కాదని అన్నారు మోడీ. ఢిల్లీ ప్రజలు ఇన్నాళ్లు ఆప్ ప్రభుత్వ ద్వేషపూరిత రాజకీయాలను చూశారని అన్నారు. ఈ దశాబ్దంలో వచ్చిన తొలి ఎన్నికలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలేనని, ఈ రోజు తీసుకునే నిర్ణయాలపైనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉందని, ఢిల్లీ ప్రజలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓట్లేయాలని కోరారు మోడీ. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లోనూ ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, విద్వేషాలు రెచ్చగొట్టే లీడర్లను ఓడించాలని అన్నారాయన. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ విషయంలోనూ అబద్ధాలు ప్రచారం చేశారాని కాంగ్రెస్ నేతలు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మోడీ.