ఒక్క పంపుతోనే.. పాలమూరు పచ్చపడ్తదా?

ఒక్క పంపుతోనే.. పాలమూరు పచ్చపడ్తదా?

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.35,200 కోట్లతో 2015లో జీవో విడుదల చేశారు. 12. 30 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడం దీని ఉద్దేశం. శ్రీశైలం నుంచి నార్లాపూర్ కు, నార్లాపూర్ నుంచి ఏదులకు, ఏదుల నుంచి వట్టెంకు, వట్టెం నుంచి కర్వేనాకు, కర్వెనా నుంచి ఉద్దండాపూర్ కు, ఉద్దండపూర్ నుంచి లక్ష్మీదేవి పల్లకి నీళ్లు ఎత్తిపోయాలి. శ్రీశైలం నుంచి 430 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయాలి. లక్ష్మీదేవిపల్లె రిజర్వాయర్ ఎత్తు 670 మీటర్లు. ఈ అన్ని ప్రాజెక్టుల్లో 31 పంపులు ఉంటాయి. 28 పంపులు 145 మెగావాట్లవి, 3  పంపులు 65 మెగావాట్లవి. నార్లపూర్ వద్ద కేవలం ఒకే ఒక్క మోటార్​ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు. నార్లపూర్, ఏదుల  వద్ద ఒక్క ఎకరం ఆయకట్టు కూడా ప్రభుత్వం ప్రతిపాదించలేదు. అంటే ప్రధాన కాలువలు, పిల్లకాలువల  అవసరం లేదు. 4 రిజర్వాయర్లు 70% పూర్తి కాగా, ఉద్దండపూర్ 30 శాతం మాత్రమే పూర్తయింది. లక్ష్మీదేవి పల్లె మొదలే కాలేదు. హెడ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా 6 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.

ఎన్నికల కోసమేనా?

ఒక్క ఎకరం ఆయకట్టులేని నార్లాపూర్ వద్ద, ఒకే ఒక్క పంపు ప్రారంభిస్తే ఏ రైతుకు లాభం? నీరు అందించాలనుకున్న ప్రతిపాదిత1200 గ్రామాల గుడుల్లో దేవుళ్ల పాదాలకు అభిషేకం చేసి, బీఆర్ఎస్ కు గంప గుత్తగా ఓట్లు వేయాలని, జనానికి పూనకం రగిలించబోతున్నారు తప్ప మరొకటి కాదు. ఇంకా 30 పంపులు నడిస్తేనే12.30 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. దీనికి ఇంకా అనేక పదుల వేల కోట్లు కావాలి. నిధులు కేటాయించకుండా, ప్రాజెక్టు పూర్తి కాకుండా ఒక్క పంపు ప్రారంభించడం అర్థరిహితం. ఇలా చేసిన దాఖలాలు చరిత్రలో లేవు. ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదు. పూర్తికాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించడం ప్రజలను సామూహికంగా మోసం చేయడమే. మొత్తం 31 పంపులకు ఒక్క పంపును మాత్రమే ప్రారంభించి, మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించినట్టుగా, మొత్తం ప్రాజెక్టు పూర్తి అయినట్టుగా ప్రజలను మభ్యపెట్టడం ఏమిటి? ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో సెప్టెంబర్ 5న సీఎం కేసీఆర్ పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 

మంత్రులు ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నత స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సెప్టెంబర్17న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును భారీ ఎత్తున ప్రారంభిస్తున్నారని ప్రకటించారు. తర్వాత సెప్టెంబర్16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వెట్ రన్ ప్రారంభిస్తారని ప్రకటించారు. అందుకు నార్లాపూర్ ఇంటెక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ప్రపంచంలోనే భారీ బహుబలి పంపులతో ఎత్తిపోతలకు సిద్ధమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించి.. రెండు కిలోమీటర్ల దూరంలోని నార్లాపూర్ రిజర్వాయర్ లోకి నీటిని ఎత్తిపోస్తారని ప్రభుత్వం ప్రకటించింది. అదే రోజు బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొమ్మిదిన్నరేండ్లు మొద్దు నిద్రపోయి, పాలమూరు రంగారెడ్డి జిల్లాల రైతుల బీడు భూములకు ప్రయోజనం కలిగించే ఎత్తిపోతలకు ఏటా అవసరమైన నిధులు విడుదల చేయకుండా  మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరోసారి ఎన్నికల వేళ రెండు జిల్లాల ప్రజలను దగా చేయాలని చూస్తున్నది.

దేవుడి పాదాలకు అభిషేకం..

సీఎం కేసీఆర్​ సభకు పల్లె పల్లె నుంచి హాజరుకానున్న జనం, గ్రామ సర్పంచులు.. ఎత్తిపోసిన కృష్ణమ్మ జలాలను వారి గ్రామాలకు తీసుకుపోయి, ఈ నెల17న ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి ఊరి గుడిలో ఉన్న దేవుళ్ల పాదాలకు అభిషేకం చేయనున్నారు. ఇది పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సామూహికంగా కృష్ణా జలాల పేరిట వేసిన భారీ ఓట్ల వల. నాగార్జునసాగర్, శ్రీ రామ్ సాగర్, బాక్రానంగల్,  శ్రీశైలం లాంటి నిర్వహణ ఖర్చులేని భారీ గ్రావిటీ ప్రాజెక్టులను కట్టి, లక్షల ఎకరాలకు నేటికీ నీళ్లు ఇస్తున్న వారికి కూడా, ఆ నదుల నీళ్లతో దేవుళ్ల పాదాలకు పూజలు చేసే ఆలోచనలు నాడు తట్టలేదు. రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో గత పదేండ్ల నుంచి12.30 లక్షల ఎకరాల బీడు భూములకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయకుండా.. ఇప్పుడు గుళ్లో ఉన్న దేవుళ్లకు చెంబులతో పాదాలకు నీళ్లు ఇచ్చే తీరు విస్మయం కలిగిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏ ఒక్క ఎకరాకు నీరు రాకముందే, బంగారు తెలంగాణ సాకారం అయిందని కేసీఆర్ ప్రకటించేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి దుర్గతి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పట్టకుండా ఉభయ జిల్లాల ప్రజలు జాగ్రత్తపడాలి. 

గత అనుభవాలు..

ఈ శతాబ్దపు మానవ విజయంగా పాలమూ రు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం కీర్తిస్తున్నది. ఇంత అధ్వానంగా, ఇంత నత్తనడకగా దశాబ్దం దగ్గర పడుతున్నా, మొత్తం 31 పంపులు ప్రారంభించాల్సింది పోయి, ఒక్క పంపునే ప్రారంభించడం ఎవరి కోసం? పాలమూరు రైతుల కాళ్లను కృష్ణానది నీళ్లతో కడుగుతా అని కేసీఆర్​2015లో చెప్పారు. కానీ ప్రతిపాదించిన భూమిలో  ఒక్క శాతానికి కూడా నీళ్లు ఇవ్వలేదు.  శ్రీరామ్ సాగర్​ పునరుజ్జీవన పేరిట కాళేశ్వరం నీళ్లను14 రోజుల్లో రెండున్నర టీఎంసీలు ఎత్తిపోశారు. ఈ నీళ్లను చూపి సామూహికంగా ఓట్లు దండు కోవడానికి ప్రశాంత్ రెడ్డితో పాటు సమీప జిల్లాల బీఆర్ఎస్ మంత్రులు నాయకులు వేలాది మందిని బస్సుల్లో తరలించి, ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు. ఎత్తి పోసిన కాళేశ్వరం నీళ్లన్నీ ఎగువ నుంచి శ్రీరామ్ సాగర్ కు పూర్తికాని ప్రాజెక్ట్​ ప్రారంభం..రూ. 25 వేల కోట్లతో అద్భుతంగా ఒక్కోటి 145 మెగావాట్ల బాహుబలి పంపులు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. 

పాలమూరు బాహుబలుల పెద్దన్నలు కాళేశ్వరం 300 మెగావాట్ల బాహుబలి పంపులు.. కరెంట్​బిల్లులకు వణికిపోయి ముసుగు తన్ని గత నాలుగేళ్లుగా వాస్తవంలో పడుకున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశంతో ఈసారి శ్రీశైలం ప్రభుత్వ చౌక కరెంటుతోనే(అధికారుల ఆదేశం) కాళేశ్వరం మోటార్లు నడుపుతామని ప్రభుత్వం మొండికేసింది. 

ఈ కరెంటు బిల్లుల గతి పాలమూరు  బాహుబలులకు కూడా పట్టవచ్చు. 1200 గ్రామాల్లో లక్షలాది మంది ఓటర్లను అసెంబ్లీ ఎన్నికల్లో ఆకట్టుకోవడమే లక్ష్యంగా అసలు పూర్తికాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు16వ తారీఖున సీఎం కేసీఆర్.. 31 మోటార్లలో కేవలం ఒకే ఒక్క పంపును  ప్రారంభించబోతున్నారు. పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభించిన వారు చరిత్రలో లేరు. అసలే పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభిస్తున్న మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో  నిలుస్తారు. ఈ ప్రారంభం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పండించే పథకమే కానీ ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని  లక్షలాది ఎకరాల భూములకు నీళ్లు ఇచ్చే ప్రారంభం మాత్రం కాదు. 

‑ నైనాల గోవర్ధన్,
తెలంగాణ జల సాధన సమితి