జలదోపిడీకి ఏపీ మరో స్కెచ్!..తాగునీళ్ల పేరుతో ఇంకో 10 టీఎంసీలకు ఇండెంట్​

జలదోపిడీకి ఏపీ మరో స్కెచ్!..తాగునీళ్ల పేరుతో ఇంకో 10 టీఎంసీలకు ఇండెంట్​
  • తాగునీళ్ల పేరుతో ఇంకో 10 టీఎంసీలకు ఇండెంట్​
  • సాగర్​ కుడి కాల్వ నుంచి తీసుకెళ్తామని బోర్డుకు లేఖ
  •  ఇప్పటికే కోటాకు మించి నీటిని ఎత్తుకెళ్లిన పక్క రాష్ట్రం 
  • ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో వాడుకోవడానికి ఉన్నవి 15 టీఎంసీలే 
  • మన అవసరాలకు 16.2 టీఎంసీలు కావాలి
  • సాగర్​ నుంచి ఏపీ నీళ్లు తీసుకెళ్తే మనం మోటార్లతో ఎత్తిపోసుకోవాల్సిందే 
  • 5న కేఆర్ఎంబీ త్రీ మెంబర్ కమిటీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: ఏపీ మరోసారి నీటి దోపిడీకి ప్లాన్ వేసింది. ఇప్పటికే కోటాకు మించి తరలించుకుపోయిన ఆ రాష్ట్రం.. ఇప్పుడు తాగునీళ్ల పేరుతో మరిన్ని నీళ్లను తన్నుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నది. నాగార్జునసాగర్​కుడి కాల్వ ద్వారా మరో 10 టీఎంసీలు తాగునీటి కోసం విడుదల చేయాలంటూ కొద్ది రోజుల కింద కృష్ణా రివర్​ మేనేజ్‌‌మెంట్​బోర్డు (కేఆర్‌‌‌‌ఎంబీ)కు ఏపీ ఇండెంట్​పెట్టింది. ఈ నెల 31 వరకు కుడి కాల్వ ద్వారా నీటి తరలింపునకు అనుమతివ్వాలంటూ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఇటు తెలంగాణ తన డ్రింకింగ్​వాటర్​అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 5.7 టీఎంసీలు, సాగర్​నుంచి 10.5 టీఎంసీల చొప్పున విడుదల చేయాలంటూ ఏప్రిల్ 17న బోర్డుకు లేఖ రాయగా, ఆ తర్వాత 10 రోజులకే ఏపీ కూడా పోటీకి నీళ్లు కావాలంటూ బోర్డుకు లేఖ రాయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై సోమవారం (ఈ నెల 5న) త్రీ మెంబర్​కమిటీ మీటింగ్​ పెట్టాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. 

ఇప్పటికే కోటాకు మించి..

ఏపీ ఈ ఏడాది ఇప్పటికే కోటాకు మించి నీళ్లను తరలించుకుపోయింది. తాత్కాలిక కేటాయింపుల ప్రకారం 66:34 శాతంలో నీళ్లు వాడుకోవాల్సి ఉన్నా.. 72.2 శాతం మేర నీటిని తన్నుకుపోయింది. మొత్తంగా తెలంగాణ, ఏపీ కలిపి 992.467 టీఎంసీల నీటిని వాడుకుంటే.. ఇందులో ఏపీ ఒక్కటే 716.543 టీఎంసీలను వాడుకున్నది. మనం వాడుకున్నది కేవలం 275.924 టీఎంసీలే. అంటే తాత్కాలిక కేటాయింపుల నిష్పత్తి ప్రకారం కేవలం 27.8 శాతమే మనం వాడుకున్నాం. కానీ, ఏపీ మళ్లీ ఇప్పుడు తాగునీటి అవసరాల పేరుతో మన నోటికాడి నీళ్లనూ గుంజుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నది. మన వాటా ప్రకారమే మరో 16.2 టీఎంసీలకు తాగునీళ్ల కోసం మనం ఇండెంట్​పెట్టుకుంటే.. ఏపీ మాత్రం దురాశతో నీటిని తరలించుకుపోయే కుట్రలకు పాల్పడుతున్నది. ఇప్పటికే అన్ని రిజర్వాయర్లను నింపుకున్న ఏపీ.. తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయన్న స్పృహ కూడా లేకుండా ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

డెడ్‌‌ స్టోరేజీకి దగ్గర్లో ప్రాజెక్టులు.. 

నాగార్జునసాగర్​, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతం కేవలం 15 టీఎంసీల జలాలే వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. సాగర్​ డెడ్​స్టోరేజీ 510 అడుగులు కాగా.. ప్రస్తుతం 514 అడుగుల నీటి మట్టం ఉన్నది. మొత్తంగా 138 టీఎంసీలు ప్రాజెక్టులో నిల్వ ఉండగా.. డెడ్​స్టోరేజీకి ఎగువన 4 అడుగుల వరకే నీటిని వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ లెక్కన 7 టీఎంసీల జలాలే అందుబాటులో ఉన్నాయి. ఇటు శ్రీశైలం డెడ్​స్టోరేజీ 834 అడుగులు కాగా.. ఇప్పటికే 814 అడుగులకు శ్రీశైలం నీటి మట్టం చేరుకున్నది. 37 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. అయితే, రెండు రాష్ట్రాలూ ఈ ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి కూడా నీటిని తరలించుకునేందుకు వీలుండగా.. ఆ స్థాయిలో కూడా వాడుకోవడానికి మిగిలి ఉన్న జలాలు కేవలం 8 టీఎంసీలే. మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లోనూ కలిపి వాడుకునేందుకు 15 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. నీటి తరలింపు, ఆవిరి నష్టాలు పోనూ 12 టీఎంసీలే మిగులుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఏపీ 10 టీఎంసీలు, తెలంగాణ 16.2 టీఎంసీలు కలిపి మొత్తంగా 26.2 టీఎంసీల నీళ్లు ఇప్పుడు అవసరం కానున్నాయి. ఈ లెక్కన 14 టీఎంసీలకు పైగా కొరత ఏర్పడనుంది. 

బోర్డు తలొగ్గితే మనకు నష్టమే..

ఒకవేళ ఏపీ విజ్ఞప్తికి బోర్డు తలొగ్గితే మనకు తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాగర్​నుంచి ఏపీ 10 టీఎంసీల నీటిని తరలించుకెళ్తే.. మనం మోటార్లు పెట్టి నీటిని లిఫ్ట్​ చేసుకోవాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. ఏపీ మాత్రం సాగర్​ ప్రాజెక్టు డెడ్​స్టోరేజీ నుంచి కూడా కాలువ గేట్లను ఎత్తి నీటిని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రాజెక్టు డెడ్​స్టోరేజీకి చేరుకున్నాక అక్కడకు మోటార్ల తరలింపు, వాటి ఖర్చుల భారం మనమే అదనంగా భరించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు..